సఫారీగడ్డపై రెండురోజుల్లోనే టెస్ట్ నెగ్గిన భారత్!
2024 క్రికెట్ సీజన్ ను టెస్ట్ టాప్ ర్యాంకర్ భారత్ సంచలన విజయంతో ప్రారంభించింది. కేప్ టౌన్ టెస్టులో దక్షిణాఫ్రికాను రెండోరోజుఆటలోనే 7 వికెట్లతో చిత్తు చేయడం ద్వారా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.
2024 క్రికెట్ సీజన్ ను టెస్ట్ టాప్ ర్యాంకర్ భారత్ సంచలన విజయంతో ప్రారంభించింది. కేప్ టౌన్ టెస్టులో దక్షిణాఫ్రికాను రెండోరోజుఆటలోనే 7 వికెట్లతో చిత్తు చేయడం ద్వారా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.
ఐసీసీ టెస్టు లీగ్ లో దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ సంచలన విజయం సాధించింది. నేలవిడిచి సాము చేయటం ద్వారా 1-1తో రెండుమ్యాచ్ ల సిరీస్ ను సమం చేసింది.
సఫారీ ఫాస్ట్ -బౌన్సీ పిచ్ లపై దక్షిణాఫ్రికానే 7 వికెట్లతో చిత్తు చేయడం ద్వారా సత్తా చాటుకొంది.
దెబ్బకు దెబ్బ తీసిన రోహిత్ సేన...
ప్రస్తుత రెండుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా సెంచూరియన్ పార్క్ వేదికగా గతవారం ముగిసిన తొలిటెస్టు మూడురోజుల ఆటలోనే ఇన్నింగ్స్ ఓటమి పాలైన రోహిత్ సేన..కేప్ టౌన్ న్యూలాండ్స్ వేదికగా జరిగిన రెండోటెస్టు లో దెబ్బ తిన్న బెబ్బులిలా పోరాడింది. ఫాస్ట్ బౌలర్ల ముప్పేటదాడితో సఫారీ బ్యాటింగ్ లైనప్ ను కకావికలు చేసింది.
తొలిఇన్నింగ్స్ లో మొదటి రోజు ఆట భోజనవిరామానికే ఆతిధ్య దక్షిణాఫ్రికాను కేవలం 55 పరుగులకే కుప్పకూల్చడంతో పాటు..రెండో ఇన్నింగ్స్ లో 176 పరుగులకే ఆలౌట్ చేయగలిగింది.
రెండురోజుల్లో 20 వికెట్ల భారత పేసర్లు...
పేస్ బౌలింగ్ కు అనువుగా ఉన్న వాతావరణంలో..ఫాస్ట్ బౌలర్ల కోసమే తయారు చేసిన న్యూలాండ్స్ పిచ్ పైన భారత బౌలర్లు చెలరేగిపోయారు. జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, ప్రసిద్ధ కృష్ణలతో కూడిన భారత పేసర్లు నిప్పులు చెరిగారు.
తొలిరోజుఆటలో మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు పడగొట్టడం ద్వారా దక్షిణాఫ్రికాను 55 పరుగులకే కుప్పకూల్చితే...రెండోరోజుఆటలో బుమ్రా 6 వికెట్లు పడగొట్టడంతో ఆతిథ్యజట్టును 176 పరుగులకే పరిమితం చేయగలిగారు.
1932 తరువాత దక్షిణాఫ్రికాను అత్యల్పంగా 55 పరుగులకే కుప్పకూల్చిన జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. అంతేకాదు..రెండురోజుల్లో రెండుసార్లు ఆలౌట్ చేసిన జట్టు ఘనతను సైతం సొంతం చేసుకోగలిగింది.
మర్కరమ్ ఫైటింగ్ సెంచరీ...
ఓవర్ నైట్ స్కోరు 3 వికెట్లకు 62 పరుగులతో రెండోరోజుఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికా ను ఓపెనర్ మర్కరమ్ ఆదుకొన్నాడు, మిగిలిన బ్యాటర్లంతా చేతులెత్తిసినా..మర్కరమ్ ఒంటరిపోరాటం చేసి అసాధారణ శతకం సాధించాడు. కేవలం 103 బంతుల్లోనే 17 ఫోర్లు, 2 సిక్సర్లతో 106 పరుగులతో తన జట్టు స్కోరును 176 కు చేర్చగలిగాడు.
భారత బౌలర్లలోబుమ్రా 61 పరుగులిచ్చి 6 వికెట్లు, ముకేశ్ కుమార్ 2 వికెట్లు, సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ చెరో వికెట్ పడగొట్టారు.
3 వికెట్ల నష్టానికే భారత్ విజయం...
టెస్ట్ మ్యాచ్ నెగ్గాలంటే రెండో ఇన్నింగ్స్ లో 78 పరుగులు మాత్రమే చేయాల్సిన భారత్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్, వన్ డౌన్ శుభ్ మన్ గిల్, విరాట్ ల వికెట్లు నష్టపోయి 7 వికెట్ల విజయంతో సిరీస్ ను 1-1తో సమం చేయగలిగింది.
యశస్వి 23 బంతుల్లో 6 ఫోర్లతో 26 పరుగులు, శుభ్ మన్ 2 ఫోర్లతో 10 పరుగుల స్కోర్లకు అవుట్ కాగా..కెప్టెన్ రోహిత్ శర్మ 17 పరుగుల స్కోరుతో అజేయంగా నిలిచాడు. మాజీకెప్టెన్ విరాట్ కొహ్లీ 12 పరుగుల స్కోరుకు వెనుదిరిగాడు. అయ్యర్ 4 పరుగుల నాటౌట్ స్కోరుతో భారత్ విజయం పూర్తయ్యింది.
సఫారీబౌలర్లలో రబడ, బర్గర్ జెన్సన్ తలో వికెట్ పడగొట్టారు.
7వ ప్రయత్నంలో భారత్ సఫలం..
కేప్ టౌన్ న్యూలాండ్స్ వేదికగా భారత్ ఎట్టకేలకు ఓ టెస్టు విజయం నమోదు చేయగలిగింది. గత మూడుదశాబ్దాల కాలంగా న్యూలాండ్స్ వేదికగా ఆరు టెస్టులు ఆడిన భారత్ 4 పరాజయాలు, 2 డ్రాల రికార్డుతో ఉంది. ప్రస్తుత సిరీస్ లోని రెండోటెస్టు విజయంతో కేప్ టౌన్ లో టెస్ట్ విజయం లేని లోటును పూడ్చుకోగలిగింది.
గతంలో ఏ భారత కెప్టెన్ కూ దక్కని ఘనత రోహిత్ శర్మకు మాత్రమే దక్కింది. కేప్ టౌన్ కోటపై భారత జెండాను రెపరెపలాడించిన రికార్డును రోహిత్ సాధించాడు.