Telugu Global
Sports

టీ-20 ప్రపంచకప్ లో భారత్ బోణీ!

సంచలనాలకు మరో పేరైన పసికూన ఐర్లాండ్ తో భారత్ తలపడడం ఇది 8వసారి. మొత్తం ఎనిమిదిమ్యాచ్ ల్లోనూ ఐర్లాండ్ ను చిత్తు చేయడం ద్వారా భారత్ 8-0 రికార్డుతో పైచేయి సాధించింది.

టీ-20 ప్రపంచకప్ లో భారత్ బోణీ!
X

2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ టోర్నీలో హాట్ ఫేవరెట్ భారత్ బోణీ కొట్టింది. గ్రూప్- ఏ లీగ్ లో ఐర్లాండ్ ను చిత్తు చేయడం ద్వారా శుభారంభం చేసింది..

2007 ప్రారంభ టీ-20 ప్రపంచకప్ టైటిల్ విజయం తరువాత...మరో టైటిల్ కోసం ప్రపంచ నంబర్ వన్ జట్టు భారత్ ఎదురుచూస్తోంది. ఇప్పటికే వన్డే ప్రపంచకప్ ను రెండుసార్లు నెగ్గిన భారత్..ధూమ్ ధామ్ టీ-20 ప్రపంచకప్ ను సైతం రెండోసారి గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉంది.

అమెరికా, వెస్టిండీస్ క్రికెట్ బోర్డుల సంయుక్త ఆతిథ్యంలో జరుగుతున్న 2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ గ్రూప్- ఏ లీగ్ లో భారత్ తొలివిజయం నమోదు చేసింది.

బౌలింగ్ లో జస్ ప్రీత్ బుమ్రా, బ్యాటింగ్ లో రోహిత్ శర్మ సరికొత్త రికార్డులు నమోదు చేయడం ద్వారా తమజట్టు విజయంలో ప్రధానపాత్ర వహించారు.

భారత పేసర్ల జోరు..ఐర్లాండ్ బేజారు...

అమెరికాలోని న్యూయార్క్ నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఏకపక్ష పోరులో భారత్ తన ప్రారంభ గ్రూప్- ఏ పోరులో ఐర్లాండ్ ను 8 వికెట్లతేడాతో చిత్తు చేసింది.

ముందుగా..ఊహించిన విధంగానే నసావు స్టేడియం డ్రాప్-ఇన్-పిచ్ పైన బౌలర్లు చెలరేగిపోయారు. కీలక టాస్ నెగ్గిన భారత్ మరో ఆలోచన లేకుండా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోడం ద్వారా సగం విజయాన్ని ఖాయం చేసుకొంది.

జస్ ప్రీత్ బుమ్రా విశ్వరూపం...

పేస్ బౌలింగ్ కు అత్యంత అనువుగా ఉన్న వాతావరణం, పిచ్ పైన భారత పేసర్లు చెలరేగిపోయారు. యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా, లెఫ్టామ్ స్వింగ్ బౌలర్ అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, హార్థిక్ పాండ్యాల జోరుకు ఐర్లాండ్ టాపార్డర్ బేజారెత్తిపోయింది.

బాల్ బిర్నీ- పాల్ స్టిర్లింగ్ ల జోడీతో బ్యాటింగ్ ప్రారంభించిన ఐర్లాండ్ ఒక దశలో 50 పరుగులకే 8 వికెట్లు నష్టపోయి పీకలోతు కష్టాలలో కూరుకుపోయింది. అయితే లోయర్ ఆర్డర్ బ్యాటర్ డెలానీ 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేయటంతో ఐరిష్ జట్టు 16 ఓవర్లలో 96 పరుగులకు కుప్పకూలింది.

భారత బౌలర్లలో జస్ ప్రీత్ బుమ్రా 3 ఓవర్లలో 6 పరుగులు మాత్రమే ఇచ్చి..ఓ మేడిన్ ఓవర్ తో 2 వికెట్లు, అర్షదీప్ 2, హార్ధిక్ పాండ్యా 3 వికెట్లు, అక్షర్ పటేల్ 1 వికెట్ పడగొట్టారు.

విరాట్ ఫ్లాప్- రోహిత్, పంత్ హిట్...

మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 97 పరుగులు మాత్రమే చేయాల్సిన భారత్..సీనియర్ జోడీ రోహిత్- విరాట్ లతో కలసి ఇన్నింగ్స్ ప్రారంభించింది. అనూహ్యమైన బౌన్స్ తో పేస్ బౌలర్లకు అనువుగా ఉన్న పిచ్ పైన విరాట్ 5 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేసి...అవుడ్ కావడంతో భారత్ 22 పరుగుల స్కోరు వద్ద తొలి వికెట్ నష్టపోయింది. ఆ తరువాత వన్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన రిషభ్ పంత్ తో కలసి రోహిత్ రెండో వికెట్ కు 69 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. రోహిత్ తన అనుభవాన్నంతా ఉపయోగించి ఆడి 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 పరుగులతో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు.

రెండోడౌన్ సూర్యకుమార్ యాదవ్ సైతం 2 పరుగుల స్కోరుకే అవుటయ్యాడు. చివరకు రిషభ్ పంత్ 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 36, శివం దూబే 0 పరుగులతో నాటౌట్ గా నిలవడంతో భారత్ 12.2 ఓవర్లలోనే 8 వికెట్ల విజయంతో పూర్తి పాయింట్లు సాధించగలిగింది.

భారత విజయంలో ప్రధానపాత్ర వహించిన జస్ ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఐర్లాండ్ పై 8 కి 8 విజయాల రికార్డు...

సంచలనాలకు మరో పేరైన పసికూన ఐర్లాండ్ తో భారత్ తలపడడం ఇది 8వసారి. మొత్తం ఎనిమిదిమ్యాచ్ ల్లోనూ ఐర్లాండ్ ను చిత్తు చేయడం ద్వారా భారత్ 8-0 రికార్డుతో పైచేయి సాధించింది.

గతంలో బంగ్లాదేశ్ ప్రత్యర్థిగా కూడా భారత్ కు 8 మ్యాచ్ ల్లో 8 విజయాల రికార్డు ఉంది.

భారత్, పాక్ జట్లతో పాటు కెనడా, అమెరికా, ఐర్లాండ్ ప్రత్యర్థులుగా ఉన్న గ్రూప్- ఏ లీగ్ లో భాగంగా 9న జరిగే సూపర్ సండే ఫైట్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో భారత్ తలపడనుంది

మొత్తం నాలుగు గ్రూపుల నుంచి 8 జట్లు రెండోదశ సూపర్-8 రౌండ్ కు చేరుకొంటాయి. ఆ తరువాత సెమీఫైనల్స్ నాకౌట్ పోరు జరుగనుంది.

First Published:  6 Jun 2024 12:32 PM IST
Next Story