విశాఖ టెస్టులో యశస్వి జైశ్వాల్ రికార్డుల మోత!
ఇంగ్లండ్ తో విశాఖ వేదికగా జరుగుతున్న రెండోటెస్ట్ తొలిరోజుఆటలో భారత యువబ్యాటర్ యశస్వి జైశ్వాల్ రికార్డుల మోత మోగించాడు.

ఇంగ్లండ్ తో విశాఖ వేదికగా జరుగుతున్న రెండోటెస్ట్ తొలిరోజుఆటలో భారత యువబ్యాటర్ యశస్వి జైశ్వాల్ రికార్డుల మోత మోగించాడు.
భారత యువఓపెనర్ యశస్వి జైశ్వాల్ స్వదేశీ పిచ్ ల పైన ఆడిన రెండోటెస్టులోనే భారీశతకం సాధించాడు. డబుల్ సెంచరీకి గురిపెట్టాడు. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియం వేదికగా ప్రారంభమైన రెండోటెస్టు తొలిరోజుఆటను 21 సంవత్సరాల యశస్వి జైశ్వాల్ 179 పరుగుల అజేయస్కోరుతో నిలిచాడు.
స్వదేశీ గడ్డపై తొలి టెస్టు శతకం...
గత సీజన్లో వెస్టిండీస్ వేదికగా టెస్టు అరంగేట్రం చేసిన యశస్వీ జైశ్వాల్ తన తొలిమ్యాచ్ లోనే సెంచరీ సాధించాడు. విదేశీగడ్డపై తన మొట్టమొదటి టెస్టు శతకం బాదిన యశస్వీ..స్వదేశీ గడ్డపైనా సెంచరీ నమోదు చేసిన భారత బ్యాటర్లలో ఒకడిగా నిలిచాడు.
ఐదుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ తో విశాఖ వేదికగా జరుగుతున్నఈ టెస్టు తొలిరోజు ఆటలో భారత మిగిలిన బ్యాటర్లు రెండంకెల స్కోర్లకే వెనుదిరిగితే..యశస్వీ మాత్రం దూకుడుగా ఆడుతూ తన పోరాటం కొనసాగించాడు.
ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జేమ్స్ యాండర్సన్ తో పాటు మిగిలిన ముగ్గురు స్పిన్నర్లను అలవోకగా ఎదుర్కొని పరుగుల మోత మోగించాడు. మొత్తం 257 బంతులు ఎదుర్కొని 17 ఫోర్లు, 5 సిక్సర్లతో డబుల్ సెంచరీకి 21 పరుగుల దూరంలో నిలిచాడు.
సచిన్, వినోద్ కాంబ్లీ ల సరసన యశస్వి...
హైదరాబాద్ వేదికగా ముగిసిన తొలిటెస్టులో సెంచరీకి చేరువై అవుటైన యశస్వి..విశాఖటెస్టులో మాత్రం చెలరేగిపోయాడు. సిక్సర్ షాట్ తో శతకం పూర్తి చేయడం ద్వారా మాస్టర్ సచిన్, రవి శాస్త్రిల సరసన నిలిచాడు. 23వ పుట్టిన రోజుకు ముందే స్వదేశీ, విదేశీ టెస్టు శతకాలు నమోదు చేసిన భారత మూడో క్రికెటర్ గా యశస్వి రికార్డుల్లో చేరాడు. విదేశీ గడ్డపైన మాత్రమే కాదు..స్వదేశంలోనూ టెస్టు శతకం బాదిన భారత క్రికెటర్ గా సచిన్, వినోద్ కాబ్లీల సరసన నిలిచాడు.
అంతేకాదు..ద్విశతకాలు బాదిన సచిన్, రవి శాస్త్రి, వినోద్ కాబ్లీల సరసన నిలవటానికి తహతహలాడుతున్నాడు.
కెప్టెన్ రోహిత్ శర్మతో కలసి మొదటి వికెట్ కు 40 పరుగులు, వన్ డౌన్ గిల్ తో కలసి రెండో వికెట్ కు 49 పరుగులు, 4వ వికెట్ కు శ్రేయస్ అయ్యర్ తో కలసి 90 పరుగుల భాగస్వామ్యాలను యశస్వి నమోదు చేశాడు.
5వవికెట్ కు రజత్ పాటిదార్ తో కలసి 70 పరుగుల భాగస్వామ్యం సాధించిన యశస్వీ పుణ్యమా అంటూ తొలిరోజుఆటలో భారత్ 93 ఓవర్లలో 6 వికెట్లకు 336 పరుగులు చేయగలిగింది.
ఒక్కరోజు ఆటలోనే.....
టెస్టు మ్యాచ్ తొలిరోజుఆటలో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆరో బ్యాటర్ గా యశస్వి రికార్డుల్లో చేరాడు. 2004లో సెహ్వాగ్ 228 పరుగులు, 2003లో 195 పరుగులు, 2007లో వాసిం జాఫర్ 192 పరుగులు, 2017లో శిఖర్ ధావన్ 190 పరుగులు, 2006లో సెహ్వాగ్180 పరుగుల స్కోర్లు సాధించగా..యశస్వి 179 పరుగుల నాటౌట్ స్కోరుతో వారి తర్వాతి స్థానంలో నిలువగలిగాడు.
ఇంగ్లండ్ ప్రత్యర్థిగా టెస్టు తొలిరోజు ఆటలో అత్యధిక స్కోరు సాధించిన భారత మూడో బ్యాటర్ గా యశస్వి నిలిచాడు. 2016లో చెన్నై వేదికగా ఇంగ్లండ్ పై కరుణ్ నాయర్ 232 పరుగులు, 1979లో ఓవల్ వేదికగా సునీల్ గవాస్కర్ 179, 1999లో మాంచెస్టర్ వేదికగా మహ్మద్ అజరుద్దీన్ 175 పరుగుల స్కోర్లు సాధిస్తే..యశస్వి విశాఖ వేదికగా 179 పరుగుల నాటౌట్ స్కోరు చేయటం విశేషం.