Telugu Global
Sports

నేటినుంచే రాజ కోట 'యుద్ధం'!

భారత్- ఇంగ్లండ్ జట్ల పాంచ్ పటాకా టెస్టు సిరీస్ షో సౌరాష్ట్ర్రలోని రాజకోట స్టేడియానికి చేరింది.

నేటినుంచే రాజ కోట యుద్ధం!
X

భారత్- ఇంగ్లండ్ జట్ల పాంచ్ పటాకా టెస్టు సిరీస్ షో సౌరాష్ట్ర్రలోని రాజకోట స్టేడియానికి చేరింది. గెలుపే లక్ష్యంగా రెండుజట్లు సై అంటే సై అంటున్నాయి.

ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా భారత్- ఇంగ్లండ్ జట్ల నడుమ ఐదుమ్యాచ్ ల టెస్టు సిరీస్ ఓ యుద్ధంలా సాగుతోంది. ఇంగ్లండ్ నేలవిడిచి సాము చేస్తుంటే...ఆతిథ్య భారత్ మాత్రం స్థానబలంతో వరుసగా రెండో విజయంతో సిరీస్ పై పట్టుబిగించాలన్న పట్టుదలతో ఉంది.

సౌరాష్ట్ర్రలోని రాజకోట ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ రోజు ఉదయం 9-30 గంటలకు ఐదురోజుల ఈ పోరు ప్రారంభంకానుంది.

వ్యూహం మార్చిన ఇంగ్లండ్....

సిరీస్ లోని మొదటి రెండుటెస్టుల్లో నలుగురు స్పిన్నర్లు, ఓ ఫాస్ట్ బౌలర్ వ్యూహంతో పోటీకి దిగిన ఇంగ్లండ్ ఓ గెలుపు, ఓ ఓటమితో నిలిచింది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలిటెస్టులో ఇంగ్లండ్ 28 పరుగులతో నెగ్గితే...విశాఖపట్నం వేదికగా ముగిసిన రెండోటెస్టులో భారత్ 106 పరుగుల భారీవిజయంతో సిరీస్ ను 1-1తో సమం చేయగలిగింది.

అయితే...సిరీస్ కే నిర్ణయాత్మకంగా మారిన మూడోటెస్టులో మాత్రం బెన్ స్టోక్స్ నాయకత్వంలోని ఇంగ్లండ్ వ్యూహం మార్చింది. ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు స్పిన్ బౌలర్లతో పోటీకి దిగుతోంది. యువబ్యాటర్లతో కూడిన భారత టాపార్డర్ ను కూల్చడానికి వెటరన్ సీమర్ యాండర్సన్, మెరుపు ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ లను అస్త్ర్రాలుగా చేసుకొంది.

స్పిన్ విభాగంలో లెగ్ స్పిన్నర్ రేహాన్ అహ్మద్, లెఫ్టామ్ స్పిన్నర్ టామ్ హార్ట్ లే లతో పాటు జో రూట్ సైతం బాధ్యత పంచుకోనున్నాడు.

ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తన వందవ టెస్టు ఆడటం ద్వారా ఈ ఘనత సాధించిన 16వ బ్రిటీష్ క్రికెటర్ గా, టెస్టు చరిత్రలో 76వ ఆటగాడిగా రికార్డుల్లో చేరనున్నాడు.

వెటరన్ పేస్ బౌలర్ జేమ్స్ యాండర్సన్ 41 సంవత్సరాల వయసులో 185వ టెస్టుకు సిద్ధమవుతున్నాడు.

అనుభవం లేమితో భారత టాపార్డర్....

భారత టాపార్డర్ గతంలో ఎన్నడూలేని విధంగా అనుభవం లేమితో కొట్టి మిట్టాడుతోంది. రన్ మెషీన్ విరాట్ కొహ్లీ, కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి బ్యాటర్లు లేకపోడంతో..భారత్ తొలిసారిగా ఎక్కువమంది యువబ్యాటర్లు, టెస్ట్ మ్యాచ్ అనుభవం అంతంత మాత్రమే ఉన్నవారితో పోటీకి దిగుతోంది.

ఓపెనర్ కమ్ కెప్టెన్ రోహిత్ శర్మ, జడేజా, అక్షర్ పటేల్ మినహా భారత బ్యాటింగ్ లైనప్ లో మిగిలిన వారంతా యువబ్యాటర్లే కావడం విశేషం.

సరఫ్రాజ్ ఖాన్ కు టెస్ట్ క్యాప్ చిక్కేనా?

భారత టెస్టుజట్టులో చోటు కోసం గత మూడేళ్లుగా పోరాడుతున్న ముంబై యువబ్యాటర్ సరఫ్రాజ్ ఖాన్ టెస్ట్ క్యాప్ కు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. రాజకోట్ వేదికగా ప్రారంభమయ్యే మ్యాచ్ ద్వారా 26 సంవత్సరాల సరఫ్రాజ్ టెస్ట్ అరంగేట్రం చేసే అవకాశం కనిపిస్తోంది. బ్యాటింగ్ లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న ఆంధ్ర వికెట్ కీపర్ బ్యాటర్ భరత్ స్థానంలో రాజస్థాన్ యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ కు చోటు కల్పించాలని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది.

ప్రస్తుత భారత బ్యాటింగ్ ఆర్డర్లో యువఓపెనర్ యశస్వి జైశ్వాల్, వన్ డౌన్ శుభ్ మన్ గిల్, రెండో డౌన్ సరఫ్రాజ్ ఖాన్, మూడో డౌన్ రజత్ పాటిదార్, ధృవ్ జురెల్ తో సహా అంతా కొత్తవారే కావడం విశేషం.

అక్షర్, కుల్దీప్ లలో ఒక్కరికే చోటు....

భారత జట్టులో రెండుస్థానాల కోసం ఆసక్తికరమైన పోరు జరుగుతోంది. రవీంద్ర జడేజా తిరిగి జట్టులో చేరడంతో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ బెంచ్ కే పరిమితం కావాల్సిన ప్రమాదం ఉంది. స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్, కుల్దీప్ లలో ఒకరిని, వికెట్ కీపర్ స్థానం కోసం భరత్, ధృవ్ జురెల్ లలో ఒకరిని ఎంపిక చేయాల్సి ఉంది.

ఎవరిని ఎంపిక చేయాలో తెలియక టీమ్ మేనేజ్ మెంట్ మల్లగుల్లాలు పడుతోంది.

హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ తిరిగి తుదిజట్టులో చేరడంతో స్వింగ్ బౌలర్ ముకేశ్ కుమార్ బెంచ్ లో విశ్రాంతి తీసుకోక తప్పదు. స్పిన్ జాదూ, వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి.

రాజకోట టెస్టులో మరో వికెట్ పడగొడితే 500 వికెట్ల మైలురాయిని చేరిన రెండో భారత క్రికెటర్ గా రికార్డుల్లో చేరగలుగుతాడు. అంతేకాదు..ఇంగ్లండ్ ప్రత్యర్థిగా వంద వికెట్ల రికార్డును సైతం సాధించే అవకాశం అశ్విన్ కు ఉంది.

టాస్ కీలకమే.....

రాజకోట టెస్టులో సైతం టాస్ కీలకంకానుంది. టాస్ నెగ్గిన జట్టు మరో ఆలోచన లేకుండా..ముందుగా బ్యాటింగ్ ఎంచుకొని భారీస్కోరుతో ప్రత్యర్థిని ఒత్తిడిలో పడేసే వ్యూహం అనుసరించనుంది.

హైదరాబాద్ టెస్టులో నాలుగో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కారణంగా భారత్ ఓడితే..విశాఖ టెస్టులో సైతం ఇంగ్లండ్ నాలుగో ఇన్నింగ్స్ బ్యాటింగ్ తోనే కుప్పకూలింది.

రాజకోట పిచ్ మొదటి మూడురోజులు బ్యాటింగ్ కు, చివరి రెండురోజులు స్పిన్ బౌలింగ్ కు అనుకూలించే అవకాశం ఉంది. సౌరాష్ట్ర్ర వాతావరణం రివర్స్ స్వింగ్ కు అనువుగా ఉండడంతోనే ఇంగ్లండ్ ఇద్దరు పేస్ బౌలర్ల వ్యూహం ఆచరిస్తోంది.

రాజకోట వేదికగా ఇప్పటి వరకూ జరిగిన రెండుటెస్టుల్లో భారత్ ఓ గెలుపు, ఓ డ్రా రికార్డుతో ఉంది. 2016లో భారత్- ఇంగ్లండ్ జట్ల నడుమ రాజకోట వేదికగా జరిగిన టెస్టుమ్యాచ్ హైస్కోరింగ్ డ్రాగా ముగిసింది.

2018లో వెస్టిండీస్ ప్రత్యర్థిగా జరిగిన టెస్టులో భారత్ తరపున ముగ్గురు టాపార్డర్ బ్యాటర్లు సెంచరీలు బాదడం, ఇన్నింగ్స్ 272 పరుగులతో భారత్ విజేతగా నిలవడం జరిగిపోయాయి.

రాజకోట్ వేదికగా ఈరోజు నుంచి జరిగేది కేవలం మూడో టెస్టు మాత్రమే.

ఇంగ్లండ్ స్పిన్నర్లను భారత్ టాపార్డర్ సమర్థవంతంగా ఎదుర్కొనగలదా?..భారత యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రాను ఇంగ్లండ్ టాపార్డర్ నిలువరించగలదా? అన్న అంశాలపైనే తుదిఫలితం ఆధారపడి ఉంది.

First Published:  15 Feb 2024 8:52 AM IST
Next Story