Telugu Global
Sports

భారత కుర్రాళ్లకు మాజీ దిగ్గజాల హ్యాట్సాఫ్!

ఇంగ్లండ్ తో ఐదుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో అంచనాలకు మించి రాణించిన భారత యువక్రికెటర్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

భారత కుర్రాళ్లకు మాజీ దిగ్గజాల హ్యాట్సాఫ్!
X

ఇంగ్లండ్ తో ఐదుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో అంచనాలకు మించి రాణించిన భారత యువక్రికెటర్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఐసీసీ టెస్టులీగ్ లో భాగంగా ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదుమ్యాచ్ ల సిరీస్ మొదటి నాలుగు టెస్టుల్లోనే భారత్ మూడు విజయాలు సాధించడం ద్వారా 3-1తో సిరీస్ ఖాయం చేసుకోడాన్ని క్రికెట్ దిగ్గజాలు గొప్ప విజయంగా అభివర్ణిస్తున్నారు. ఐదుగురు సీనియర్ స్టార్లు లేకుండానే సిరీస్ సాధించడం అపూర్వమంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

విరాట్, షమీ లేకుండానే...

'బజ్ బాల్ ' (వీరబాదుడు ) క్రికెట్ కు మరో పేరైన ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదుమ్యాచ్ ల టెస్టు సిరీస్ మొదటి నాలుగుమ్యాచ్ ల్లోనే మూడు విజయాలు సాధించిన భారత యువజట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఐదుగురు దిగ్గజ ( విరాట్ కొహ్లీ, పూజారా, రహానే, షమీ, రిషభ్ పంత్ ) క్రికెటర్లు లేకుండానే అనుభవం లేని ఎక్కువమంది యువఆటగాళ్లతో రోహిత్ శర్మ నాయకత్వంలో ఇంగ్లండ్ తో తలపడిన భారత్ మొదటి నాలుగుటెస్టుల్లోనే మూడు విజయాలు సాధించడం ద్వారా 3-1తో సిరీస్ ఖాయం చేసుకోడం ద్వారా సంచలనం సృష్టించింది.

ఐదుమ్యాచ్ ల సిరీస్ ను భారత్ ఓటమితో మొదలు పెట్టినా ఆ తర్వాతి మూడుటెస్టుల్లోనూ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేయడం ద్వారా విమర్శకుల నోటికి తాళం వేసింది.

హైదరాబాద్ టెస్టులో 18 పరుగులతో ఓడినా..ఆ తరువాత విశాఖ, రాజకోట, రాంచీ వేదికలుగా జరిగిన మిగిలిన మూడుటెస్టుల్లోనూ తిరుగులేని విజయాలు నమోదు చేసింది.

బుమ్రా, రాహుల్ లాంటి సెమీసీనియర్ స్టార్లు లేకుండానే అరుదైన విజయాలు నమోదు చేసింది. భారత్ సాధించిన ఈ విజయాల వెనుక సాంప్రదాయ టెస్టు క్రికెట్ అనుభవం తగినంతలేని ఓపెనర్ యశస్వి జైశ్వాల్, శుభ్ మన్ గిల్, సరఫ్రాజ్ ఖాన్, యువవికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ ల పాత్ర అంతాఇంతా కాదు.

యశస్వి ద్విశతకాల ధమాకా!

భారత యువఓపెనర్ యశస్వి జైశ్వాల్ ప్రస్తుత సిరీస్ మొదటి నాలుగుటెస్టుల్లోనే రెండు ద్విశతకాలు బాదడం ద్వారా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లండ్ ప్రత్యర్థిగా అత్యధిక పరుగులు సాధించిన భారత యువఓపెనర్ గా రికార్డుల్లో చేరాడు.

ఇక..వన్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగుతున్న శుభ్ మన్ గిల్ నిలకడలేమితో కొట్టిమిట్టాడుతున్నా..ఏదో ఒక ఇన్నింగ్స్ లో కీలక పరుగులు సాధించడం ద్వారా తనవంతు పాత్ర నిర్వర్తించాడు.

రాజకోట్ టెస్టు ద్వారా అరంగేట్రం చేసిన యువవికెట్ కీపర్ బ్యాటర్ జురెల్ రాంచీ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 90 పరుగుల స్కోరుతో మ్యాచ్ ను మలుపు తిప్పాడు. రెండో ఇన్నింగ్స్ లో అజేయ ఇన్నింగ్స్ ఆడడం ద్వారా భారత్ కు 5 వికెట్ల విజయం అందించడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

జట్టులోని సీనియర్ స్టార్లు రోహిత్ శర్మ, ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ కీలక సమయాలలో జట్టుగా అండగా నిలవటం ద్వారా తాము సైతం..అన్నట్లుగా ఉనికిని చాటుకోగలుగుతున్నారు.

ఇది కుర్రాళ్ల విజయం..వాన్...

ఐదుగురు సీనియర్ స్టార్లు లేకుండా భారత్ 3-1తో ఇంగ్లండ్ పై ఆధిపత్యాన్ని ప్రదర్శించడాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, క్రికెట్ విమర్శకుడు మైకేల్ వాన్..యువక్రికెటర్ల విజయంగా అభివర్ణించారు.

అపారఅనుభవం కలిగిన ఇంగ్లండ్ జట్టును యువఆటగాళ్లతో కూడిన భారతజట్టు ఎదుర్కొన్నతీరు అపూర్వమని కొనియాడారు. మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా ప్రారంభమయ్యే ఆఖరిటెస్టుకు ముందే భారత్ సిరీస్ ను ఖాయం చేసుకోడంలో అనుభవం లేని యువఆటగాళ్లు ప్రధానపాత్ర వహించారని, ప్రధానంగా వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ గొప్పగా ఆడుతున్నాడని, భారత టెస్టు జట్టుకు బంగారు భవిష్యత్ ఉందని జోస్యం చెప్పారు.

భారత మాజీ ఆల్ రౌండర్ మదన్ లాల్ సైతం..భారత యువఆటగాళ్లకు హ్యాట్సాఫ్ చెప్పారు. విరాట్ కొహ్లీ లేకుంటే భారతజట్టే లేదనుకొనే రోజులు పోయాయనని, కొహ్లీ లాంటి ప్రపంచ మేటి బ్యాటర్ లేని లోటును యువబ్యాటర్లు అత్యంత సమర్థవంతంగా పూడ్చగలిగారని ప్రశంసించారు.

సిరీస్ లోని మొదటి నాలుగుటెస్టుల్లోనే ఓపెనర్ యశస్వి జైశ్వాల్ రెండు డబుల్ సెంచరీలతో సహా 655 పరుగుల స్కోరు సాధించడం అపూర్వమని మదన్ లాల్ ప్రశంసించారు.

అత్యంత ఒత్తిడిలో శుభ్ మన్ గిల్ కీలక ఇన్నింగ్స్ ఆడుతూ తనపై ఉంచిన భారాన్ని మోస్తున్నాడని, రాజకోట టెస్టు ద్వారా అరంగేట్రం చేసిన సరఫ్రాజ్ ఖాన్ రెండు ఇన్నింగ్స్ లోనూ హాఫ్ సెంచరీలు బాదడం, ధృవ్ జురెల్ వయసుకు మించిన పరిణతి ప్రదర్శించడం ద్వారా మ్యాచ్ విన్నర్ గా నిలవడం గొప్పఘనతేనని చెప్పారు.

మొత్తం మీద..ఇంగ్లండ్ లాంటి పవర్ ఫుల్ జట్టు పైన భారత్ సాధించిన ప్రస్తుత సిరీస్ విజయం ఘనత అంతర్జాతీయ క్రికెట్ అనుభవం అంతంత మాత్రంగా ఉన్న యువఆటగాళ్లదేనని తేల్చి చెప్పారు.

First Published:  28 Feb 2024 5:20 PM IST
Next Story