Telugu Global
Sports

వందోటెస్ట్ వాకిట్లో భారత 'స్పిన్ జాదూ'!

భారత స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ శత టెస్టుమ్యాచ్ ల ముంగిట్లో నిలిచాడు. వందటెస్టులు ఆడిన భారత 14వ క్రికెటర్ గా రికార్డుల్లో చేరటానికి తహతహలాడుతున్నాడు.

వందోటెస్ట్ వాకిట్లో భారత స్పిన్ జాదూ!
X

భారత స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ శత టెస్టుమ్యాచ్ ల ముంగిట్లో నిలిచాడు. వందటెస్టులు ఆడిన భారత 14వ క్రికెటర్ గా రికార్డుల్లో చేరటానికి తహతహలాడుతున్నాడు....

భారత ఆల్ టైమ్ స్పిన్ గ్రేట్ రవిచంద్రన్ అశ్విన్ 37 ఏళ్ళ వయసులో 100వ టెస్టుమ్యాచ్ కు సిద్ధమవుతున్నాడు. తన కెరియర్ లో ఇప్పటికే పలు అరుదైన రికార్డులు నెలకొల్పిన అశ్విన్ వంద టెస్టుల మైలురాయిని చేరడానికి తహతహ లాడుతున్నాడు.

ధర్మశాల వేదికగా అశ్విన్ వందోటెస్టు....

హిమాలయ పర్వతాల పాదాలలో నిర్మించిన అందమైన హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియం వేదికగా స్పిన్ మాంత్రికుడు టెస్టు మ్యాచ్ ల శతకాన్ని పూర్తి చేయనున్నాడు.

భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్ వేదికగా 2011లో తన టెస్టు కెరియర్ ప్రారంభించిన అశ్విన్ గత 13 సంవత్సరాల కాలంలో భారత నంబర్ వన్ స్పిన్నర్ గా నిలుస్తూ వచ్చాడు.

ప్రస్తుత సిరీస్ లోని నాలుగో టెస్టు వరకూ ఆడిన 99 మ్యాచ్ ల్లో అశ్విన్ 507 వికెట్లు పడగొట్టడం ద్వారా అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత టెస్ట్ రెండో బౌలర్ గా ఇప్పటికే రికార్డు నెలకొల్పాడు. మొత్తం 610 వికెట్లతో అనీల్ కుంబ్లే భారత నంబర్ వన్ టెస్టు బౌలర్ గా కొనసాగుతున్నాడు.

రాంచీటెస్టు రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టిన అశ్విన్ కు 35సార్లు ఓ ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టిన రికార్డు సైతం ఉంది.

ఇంగ్లండ్ ప్రత్యర్థిగా 100 వికెట్లు, 1000 పరుగుల రికార్డు..

ఇంగ్లండ్ ప్రత్యర్థిగా 100 వికెట్లు , 1000 పరుగులు సాధించిన భారత ఏకైక బౌలర్ గా అశ్విన్ రికార్డు నెలకొల్పాడు. తన కెరియర్ లో 200 మందికి పైగా ఎడమచేతి వాటం బ్యాటర్లను పడగొట్టిన ఘనత సైతం అశ్విన్ కు ఉంది.

భారత 14వ క్రికెటర్ గా అశ్విన్.....

ధర్మశాల టెస్టుతో అశ్విన్ వంద టెస్టుల మైలురాయిని చేరడం ద్వారా...ఈ ఘనత సాధించిన భారత 14వ క్రికెటర్ గా రికార్డుల్లో చేరనున్నాడు. సాంప్రదాయ టెస్టు చరిత్రలో అత్యధికంగా 200 టెస్టులు ఆడిన ప్రపంచ రికార్డు మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉంది.

163 టెస్టులతో రాహుల్ ద్రావిడ్, 134 టెస్టులతో వీవీఎస్ లక్ష్మణ్, 132 టెస్టులతో అనీల్ కుంబ్లే, 131 టెస్టులతో కపిల్ దేవ్ మొదటి ఐదుస్థానాలలో కొనసాగుతున్నారు.

125 టెస్టులతో సునీల్ గవాస్కర్, 116 టెస్టులతో దిలీప్ వెంగ్ సర్కార్, 113 టెస్టులతో సౌరవ్ గంగూలీ, 105 టెస్టులతో ఇశాంత్ శర్మ, 103 టెస్టులతో హర్భజన్ సింగ్, 103 టెస్టులతో చతేశ్వర్ పూజారా, 103 టెస్టులతో వీరేంద్ర సెహ్వాగ్ వందటెస్టుల క్లబ్ లో చేరిన భారత క్రికెటర్లుగా ఉన్నారు.

టెస్టు క్రికెట్లో తన 500 వికెట్ల రికార్డును తండ్రి రవిచంద్రన్ కు అంకితమిచ్చిన అశ్విన్..100 టెస్టుల రికార్డును తన కుటుంబానికి అంకితమిచ్చినా ఆశ్చర్యంలేదు.

First Published:  2 March 2024 10:45 AM IST
Next Story