Telugu Global
Sports

హైదరాబాద్ లో ఆరేళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్ సందడి!

భారత క్రికెట్ ప్రధాన కేంద్రాలలో ఒకటైన హైదరాబాద్ కు టెస్ట్ క్రికెట్ కళ వచ్చింది. ఆరేళ్ల తర్వాత తొలిసారిగా ఓ టెస్టుమ్యాచ్ కు ఆతిథ్యమిస్తోంది.

హైదరాబాద్ లో ఆరేళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్ సందడి!
X

భారత క్రికెట్ ప్రధాన కేంద్రాలలో ఒకటైన హైదరాబాద్ కు టెస్ట్ క్రికెట్ కళ వచ్చింది. ఆరేళ్ల తర్వాత తొలిసారిగా ఓ టెస్టుమ్యాచ్ కు ఆతిథ్యమిస్తోంది.

తెలుగు రాష్ట్ర్రాల ప్రధాన క్రికెట్ వేదిక హైదరాబాద్ లో ఐసీసీ టెస్టు లీగ్ సందడి ప్రారంభమయ్యింది. ఐసీసీటెస్టు లీగ్ లో భాగంగా ఇంగ్లండ్ తో జరిగే తొలిటెస్టుమ్యాచ్ కు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది.

భాగ్యనగరంలో భారత క్రికెటర్లు....

గత రెండువారాలుగా అప్ఘనిస్థాన్ తో టీ-20 సిరీస్ ఆడుతూ గడిపిన రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు సభ్యులు...ఇంగ్లండ్ తో టెస్ట్ సమరం కోసం బెంగళూరు నుంచి హైదరాబాద్ నగరానికి చేరుకొన్నారు.

జనవరి 25 నుంచి హైదరాబాద్ రాజీవ్ స్టేడియం వేదికగా జరిగే తొలిటెస్టుమ్యాచ్ లో ఇంగ్లండ్ తో అమీతుమీ తేల్చుకోనున్నారు.

2018 తర్వాత తొలిసారిగా టెస్ట్ మ్యాచ్...

గత కొద్దిసంవత్సరాలుగా క్రికెట్ సంఘంలోని ముఠాల కుమ్ములాటలతో వార్తలలో నిలుస్తూ వచ్చిన హైదరాబాద్ 2018 తర్వాత ఓ టెస్టు మ్యాచ్ కు ఆతిథ్యమివ్వటానికి సకలహంగులతో ముస్తాబయ్యింది.

2018 అక్టోబర్ లో చివరిసారిగా వెస్టిండీస్ తో టెస్టుమ్యాచ్ కు ఆతిథ్యమిచ్చిన సమయంలో భారతజట్టు 10 వికెట్ల అలవోక విజయం సాధించింది. ఆ తరువాత పలు టీ-20 మ్యాచ్ లతో పాటు ఐసీసీవన్డే ప్రపంచకప్ మ్యాచ్ లకు సైతం ఆతిధ్యమిచ్చింది.

ఆరేళ్ల సుదీర్ఘవిరామం తరువాత మరోసారి టెస్ట్ మ్యాచ్ నిర్వహణకు హైదరాబాద్ వేదికగా నిలిచింది.

టెస్టుమ్యాచ్ టికెట్ల విక్రయం షురూ...

జనవరి 25నుంచి 5రోజులపాటు జరిగే టెస్టు మ్యాచ్ టికెట్ల విక్రయాన్ని హైదరాబాద్ క్రికెట్ సంఘం ప్రారంభించింది. 45 వేల సీటింగ్ సామర్థ్యం కలిగిన రాజీవ్ స్టేడియంలో 600 రూపాయల కనీస ధర నుంచి 16వేల రూపాయల కార్పొరేట్ బాక్స్ ధర టికెట్లను ఆన్ లైన్ ద్వారా విక్రయిస్తున్న క్రికెట్ సంఘం ప్రకటించింది.

ఆన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్న టికెట్లను పేటీఎం ఇన్ సైడర్ యాప్ లేదా www.insider.in ద్వారా కొనుగోలు చేయవచ్చు.

హైదరాబాద్ నగరంలోని పాఠశాలలకు చెందిన బాలలతో పాటు..భారత సైనికదళాల సిబ్బందికి ముందుగా పొందిన ప్రత్యేక అనుమతి తో ఉచితప్రవేశం కల్పించనున్నట్లు హైదరాబాద్ క్రికెట్ సంఘం తెలిపింది.

ఆన్ లైన్ ద్వారా టికెట్లను బుక్ చేసుకొన్నవారు జనవరి 22 నుంచి జింఖానా గ్రౌండ్స్ లోని ప్రత్యేక కౌంటర్ నుంచి టికెట్ల పొందవచ్చునని వివరించింది.

ఐదురోజుల టెస్ట్ టికెట్ ధర రు.600...

హైదరాబాద్ టెస్టు మ్యాచ్ ను రోజుకు 120 రూపాయల చొప్పున చెల్లించి మొత్తం 600 రూపాయలతో ఐదురోజుల మ్యాచ్ ను వీక్షించే అవకాశం కల్పించారు. స్టేడియంలోని నార్త్, సౌత్ పెవీలియన్ ( టెర్రస్ ) టికెట్లను 600 రూపాయలుగా నిర్ణయించారు.

సౌత్ పెవీలియన్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ టికెట్లను 1250 రూపాయల నుంచి 3వేల 750 రూపాయలుగా ప్రకటించారు.

నార్త్ పెవీలియన్ కార్పొరేట్ బాక్స్ (హాస్పిటాలిటీ ) టికెట్లను 3వేల రూపాయల నుంచి 12వేల రూపాయలుగా, సౌత్ పెవీలియన్ కార్పొరేట్ బాక్స్ టికెట్లను 4వేల నుంచి 16వేల రూపాయల ధరగా నిర్ణయించారు.

రోజుకు 5వేల మందికి ఉచితప్రవేశం...

టెస్ట్ మ్యాచ్ జరిగే ఐదురోజులూ రోజుకు 5వేల మంది బాలలకు ఉచితంగా టెస్ట్ మ్యాచ్ చూసే అవకాశాన్ని హైదరాబాద్ క్రికెట్ సంఘం కల్పించింది. దీనితో పాటు రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా జనవరి 26న సైనికదళాల సిబ్బందికి సైతం ఉచిత ప్రవేశం కల్పించనున్నారు.

జంటనగరాలలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు తమతమ యాజమాన్యాల ధర ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుంది. మ్యాచ్ జరిగే ఐదురోజులూ రోజుకు 5వేల మంది విద్యార్థులకు ఉచితంగా మంచినీరు, ఆహారాన్ని హైదరాబాద్ క్రికెట్ సంఘం అంద చేయనుంది.

హైదరాబాద్ లోని 3వేలకు పైగా పాఠశాలలు తమ విద్యార్థులను టెస్ట్ మ్యాచ్ కు పంపడానికి ఆసక్తితో ఉన్నాయి. మ్యాచ్ చూడదలచుకొన్న విద్యార్థులు తమ పాఠశాలల గుర్తింపు కార్డులతో వస్తేనే అనుమతిస్తామని హైదరాబాద్ క్రికెట్ సంఘం స్పష్టం చేసింది.

First Published:  21 Jan 2024 9:26 AM IST
Next Story