Telugu Global
Sports

టీ-20 కెప్టెన్ గా సూర్యకుమార్ రికార్డుల మోత!

భారత టీ-20 కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ శుభారంభం చేశాడు. ఆస్ట్రేలియాతో పాంచ్ పటాకా సిరీస్ లోని తొలి పోరులో కెప్టెన్ ఇన్నింగ్స్ తో తన జట్టును విజేతగా నిలిపాడు.

టీ-20 కెప్టెన్ గా సూర్యకుమార్ రికార్డుల మోత!
X

భారత టీ-20 కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ శుభారంభం చేశాడు. ఆస్ట్రేలియాతో పాంచ్ పటాకా సిరీస్ లోని తొలిపోరులో కెప్టెన్ ఇన్నింగ్స్ తో తన జట్టును విజేతగా నిలిపాడు.

వచ్చే ఏడాది జరిగే ఐసీసీ టీ-20 ప్రపంచకప్ టోర్నీకి టాప్ ర్యాంకర్ భారత్ తొలిగెలుపుతో సన్నాహాలు ప్రారంభించింది. 4వ ర్యాంకర్ ఆస్ట్రేలియాతో ప్రారంభమైన 2023- సిరీస్ లోని తొలిపోరులో మిస్టర్ 360 హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో విజేతగా నిలిచింది.

స్టీల్ సిటీలో పరుగుల హోరు....

విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియం వేదికగా జరిగిన తొలి టీ-20లో పరుగుల మోత మోగింది. బ్యాటర్ల స్వర్గంగా పేరున్న విశాఖ స్టేడియంలో ఆస్ట్రేలియా, భారత జట్లు కలసి 417 పరుగులతో హోరెత్తించాయి.

ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ఆతిథ్య భారత్ ముందుగా టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకోడంతో కంగారూ జట్టు బ్యాటింగ్ మొదలుపెట్టింది.

ఓపెనర్లుగా స్టీవ్ స్మిత్ ( 52 ), మాథ్యూ షార్ట్ ( 13) మొదటి వికెట్ కు 31 పరుగులతో చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు. షార్ట్ అవుటైన వెంటనే క్రీజులోకి వచ్చిన వన్ డౌన్ జోష్ ఇంగ్లిస్ కేవలం 50 బంతుల్లోనే 11 ఫోర్లు, 8 సిక్సర్లతో వీరవిహారం చేసి 110 పరుగుల స్కోరు సాధించడంతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 3 వికెట్లకు 208 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. భారత బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ, రవి బిష్నోయ్ చెరో వికెట్ పడగొట్టారు.

ఇషాన్, సూర్య చేజింగ్ షో......

మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 209 పరుగుల భారీ స్కోరు చేయాల్సిన భారత్ కు తొలిఓవర్ లోనే ఎదురుదెబ్బ తగిలింది. వైస్ కెప్టెన్ కమ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ డకౌట్ గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 8 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 21 పరుగుల స్కోరుకు అవుట్ కావడంతో భారత్ రెండో వికెట్ సైతం నష్టపోయింది.

22 పరుగులకే 2 వికెట్లు నష్టపోయిన భారత్ ను గెలిపించే బాధ్యత వన్ డౌన్ ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ లపైన పడింది. ఈ ఇద్దరూ మూడో వికెట్ కు సెంచరీ భాగస్వామ్యంతో కంగారూ బౌలర్లను ఓ ఆటాడుకొన్నారు.

ఇషాన్ కిషన్ 39 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 58 పరుగులు, కెప్టెన్ సూర్యకుమార్ 42 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్స్లర్లతో 80 పరుగుల స్కోర్లతో భారత్ ను విజయానికి చేరువగా తీసుకెళ్లారు. మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ 12 పరుగులకే అవుట్ కాగా..ఫినిషర్ గా రింకూ సింగ్ బాధ్యత తీసుకొని మరో బంతి మిగిలిఉండగానే భారత్ ను విజేతగా నిలిపాడు. రింకూసింగ్ 14 బంతుల్లో 4 బౌండ్రీలతో 22 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఆస్ట్రేలియా బౌలర్లలో లెగ్ స్పిన్నర్ తన్వీర్ సంఘా 47 పరుగులిచ్చి 2 వికెట్లు, షార్ట్, అబ్బోట్ , బెహ్రెన్ డోర్ఫ్ తలో వికెట్ పడగొట్టారు. ముగ్గురు భారత బ్యాటర్లు రనౌట్లుగా వెనుదిరగడం విశేషం. భారత విజయంలో ప్రధానపాత్ర వహించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

సారథిగా సూర్య రికార్డులే రికార్డులు...

సీనియర్ స్టార్లు రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా అందుబాటులో లేకపోడంతో భారత టీ-20 జట్టు పగ్గాలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా తన తొలి సిరీస్ తొలిమ్యాచ్ లోనే తన జట్టును విజేతగా నిలపడం ద్వారా పలు రికార్డులు నెలకొల్పాడు.

కెప్టెన్ గా తన తొలిమ్యాచ్ లోనే భారత జట్టును విజేతగా నిలిపిన 13 ఆటగాడిగా సూర్య రికార్డుల్లో చేరాడు. టీ-20 క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ బ్యాటర్ గా ఉన్న సూర్య సిక్సర్ల బాదుడులోనూ, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకోడంలోనూ సరికొత్త రికార్డులు సాధించాడు.

టీ-20 ఫార్మాట్లో భారతజట్టు 200కు పైగా పరుగుల భారీస్కోరును చేజింగ్ చేయడం ఇది రెండోసారిమాత్రమే. 2013లో రాజ్ కోట్ వేదికగా ఆస్ట్రేలియాపైనే తొలిసారి 200కు పైగా లక్ష్యాన్ని చేధించిన భారత్ ప్రస్తుత సిరీస్ తొలిపోరులోనే 209 పరుగుల టార్గెట్ ను అందుకోగలిగింది. 200కు పైగా స్కోర్లను భారత్ ఇప్పటి వరకూ ఐదుసార్లు చేజ్ చేయగలిగింది.

భారత్- ఆస్ట్రేలియా జట్ల టీ-20 సిరీస్ ల్లో 190కి పైగా స్కోర్లు సాధించిన జట్లు ఆరుసార్లు పరాజయాలు చవిచూశాయి. భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తన కెరియర్ లో రెండోసారి హాఫ్ సెంచరీ సాధించాడు.

టీ-20 ఫార్మాట్లో వన్ డౌన్ తర్వాత స్థానాలలో బ్యాటింగ్ దిగి అత్యధిక సిక్సర్లు బాదిన నాలుగో బ్యాటర్ గా సూర్యకుమార్ నిలిచాడు. విశాఖ టీ-20లో నాలుగు సిక్సర్లు బాదడం ద్వారా సూర్య సిక్సర్ల సంఖ్య వందకు చేరింది.

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మోర్గాన్ 107 ఇన్నింగ్స్ లో 120 సిక్సర్లు, విరాట్ కొహ్లీ 98 ఇన్నింగ్స్ లో 106, డేవిడ్ మిల్లర్ 98 ఇన్నింగ్స్ లో 105, సూర్య 47 ఇన్నింగ్స్ లోనే 100, కీరాన్ పోలార్డ్ 83 ఇన్నింగ్స్ లో 99 సిక్సర్లు బాదడం ద్వారా మొదటి ఐదుగురు అగ్రశ్రేణి సిక్స్ హిట్టర్లుగా కొనసాగుతున్నారు.

ఐదు మ్యాచ్ ల సిరీస్ లోని రెండో టీ-20 మ్యాచ్ తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియం వేదికగా ఈనెల 26న జరుగనుంది.

First Published:  24 Nov 2023 10:00 AM IST
Next Story