Telugu Global
Sports

నేటినుంచే సూపర్-8 షో..అప్ఘనిస్థాన్ తో భారత్ తొలిపోరు!

టీ-20 ప్రపంచకప్ సూపర్-8 సమరానికి ఈ రోజు ఆంటీగాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో తెరలేవనుంది. తొలిపోరులో పవర్ ఫుల్ దక్షిణాఫ్రికాకు పసికూన అమెరికా సవాలు విసురుతోంది.

నేటినుంచే సూపర్-8 షో..అప్ఘనిస్థాన్ తో భారత్ తొలిపోరు!
X

టీ-20 ప్రపంచకప్ సూపర్-8 సమరానికి ఈ రోజు ఆంటీగాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో తెరలేవనుంది. తొలిపోరులో పవర్ ఫుల్ దక్షిణాఫ్రికాకు పసికూన అమెరికా సవాలు విసురుతోంది.

వెస్టిండీస్, అమెరికా క్రికెట్ బోర్డుల సంయుక్త ఆతిథ్యంలో జరుగుతున్న 2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ రెండోదశ సూపర్-8 పోరుకు కరీబియన్ గడ్డపై కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.

తొలిదశ 20 జట్ల గ్రూపు లీగ్ నుంచి 12 జట్లు నిష్క్ర్రమించడంతో..ఆఖరి 8 జట్ల పోరుకు రంగం సిద్ధమయ్యింది. గ్రూపులీగ్ దశను విజయవంతంగా ముగించడం ద్వారా మాజీ చాంపియన్లు భారత్, ఆస్ట్ర్రేలియా, వెస్టిండీస్, డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ తోపాటు పసికూన అమెరికా, బంగ్లాదేశ్, అప్ఘనిస్థాన్, దక్షిణాఫ్రికా సూపర్-8 రౌండ్ కు అర్హత సంపాదించాయి.

ఆసియాజట్లకు మిశ్రమఫలితాలు....

భారత ఉపఖండం నుంచి ప్రపంచకప్ బరిలో నిలిచిన ఆసియాజట్లకు మిశ్రమఫలితాలు ఎదురయ్యాయి. మాజీ చాంపియన్లు పాకిస్థాన్, శ్రీలంక, ఒమన్ జట్లు గ్రూప్ లీగ్ దశ లోనే విఫలమైతే..భారత్, బంగ్లాదేశ్, అప్ఘనిస్థాన్ సూపర్-8 రౌండ్ చేరుకోగలిగాయి.

ప్రపంచకప్ బరిలో తొలిసారిగా నిలిచిన పసికూన అమెరికా గ్రూపు- ఏ లీగ్ లో 5 పాయింట్లు సాధించడం ద్వారా సూపర్- 8 బెర్త్ సంపాదిస్తే..దిగ్గజజట్లు న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక అనూహ్యంగా ఇంటిదారి పట్టాయి.

గ్రూప్- ఏ లీగ్ లో భారత్ 7 పాయింట్లతో టాపర్ గా నిలిచింది. అమెరికా 5 పాయింట్లతో రన్నరప్ కాగా..కెనడా 3 పాయింట్లు, ఐర్లాండ్ ఒక్కపాయింటుతో గ్రూపు 4, 5 స్థానాలలో నిలిచాయి. పాకిస్థాన్ కు 3 పాయింట్లు మాత్రమే దక్కాయి.

గ్రూప్ -బీ లీగ్ నుంచి డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, ఆస్ట్ర్రేలియా, నమీబియా, ఒమాన్, స్కాట్లాండ్ జట్లతో కూడిన పూల్- బీ మొదటి రెండుస్థానాలలో ఆస్ట్ర్రేలియా, ఇంగ్లండ్ జట్లు నిలిచాయి.

ఆస్ట్ర్రేలియా నాలుగుకు నాలుగు రౌండ్లూ నెగ్గడం ద్వారా 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిస్తే..ఇంగ్లండ్ 5 పాయింట్లతో రెండోస్థానంలో నిలవడం ద్వారా సూపర్-8 రౌండ్ బెర్త్ సంపాదించాయి. ఇంగ్లండ్ తో సమానంగా స్కాట్లాండ్ సైతం 5 పాయింట్లు సాధించినా..నెట్ రన్ రేట్ ప్రకారం మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

నమీబియా 2 పాయింట్లు, ఒమాన్ పాయింట్లేవీ లేకుండాను గ్రూపు ఆఖరి రెండుస్థానాలు దక్కించుకున్నాయి.

గ్రూప్- సీ టాపర్ గా వెస్టిండీస్..

అప్ఘనిస్థాన్, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఉగాండా, పాపువా న్యూగినియా జట్లతో కూడిన గ్రూప్- సీ లీగ్ లో రెండుసార్లు విజేత వెస్టిండీస్ 8 పాయింట్లతో టాపర్ గా నిలిచింది.

ఆఖరి లీగ్ మ్యాచ్ లో చిత్తుగా ఓడినా ..అప్ఘనిస్థాన్ సూపర్ -8 రౌండ్ చేరుకోగలిగింది.

న్యూజిలాండ్ 4 రౌండ్లలో 5 పాయింట్లు మాత్రమే సాధించి లీగ్ దశ నుంచే ఇంటిదారి పట్టింది. ఉగాండా నాలుగు, పాపువా న్యూగినియా ఐదు స్థానాలలో మిగిలాయి.

పూల్- డీ లీగ్ నుంచి దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ సూపర్ - 8 రౌండ్ చేరుకోగా..శ్రీలంక, నెదర్లాండ్స్, నేపాల్ జట్ల పోరు తొలిదశకే పరిమితం అయ్యింది.

ప్రపంచకప్ సూపర్-8 రౌండ్ తొలిపోరుగా ఈరోజు ఆంటీగా లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా జరిగే పోటీలో దక్షిణాఫ్రికాతో పసికూన అమెరికా తలపడనుంది.

జూన్ 20న డబుల్ హెడర్...

సూపర్ -8 రెండోరోజు పోటీలలో భాగంగా రెండుమ్యాచ్ లు జరుగనున్నాయి. సెయింట్ లూకాలోని డారెన్ సామీ స్టేడియం వేదికగా జరిగే దిగ్గజాల సమరంలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ తో రెండుసార్లు విజేత వెస్టిండీస్ పోటీపడుతుంది.

బార్బడోస్ కెన్సింగ్టన్ ఓవల్ స్టేడియం వేదికగా జరిగే పోటీలో టాప్ ర్యాంకర్ భారత్ ను అప్ఘనిస్థాన్ ఢీకోనుంది.

జూన్ 21న ఆంటీగా స్టేడియం వేదికగా జరిగే పోటీలో ఆస్ట్ర్రేలియాతో బంగ్లాదేశ్ తలపడుతుంది. అదేరోజు సెయింట్ లూకా వేదికగా జరిగే మరో పోరులో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాజట్లు పోటీపడతాయి.

ఆఖరిరోజున 3 రౌండ్ల మ్యాచ్ లు...

జూన్ 22న బార్బడోస్ వేదికగా జరిగే మ్యాచ్ లో వెస్టిండీస్ తో అమెరికా, ఆంటీగా వేదికగా బంగ్లాదేశ్ తో భారత్ తలపడతాయి. జూన్ 23న ఆస్ట్ర్రేలియాతో అప్ఘనిస్థాన్, అమెరికాతో ఇంగ్లండ్ తలపడతాయి.

సూపర్ -8 రౌండ్ ఆఖరిరోజు పోటీలలో భాగంగా మూడుమ్యాచ్ లు జరుగుతాయి.జూన్ 24న జరిగే కీలక పోటీలలో ఆస్ట్ర్రేలియాతో భారత్, వెస్టిండీస్ తో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ తో అప్ఘనిస్థాన్ ఢీ కొంటాయి.

సూపర్ - 8 రౌండ్లో రెండు విజయాలు సాధించిన జట్లు సెమీస్ చేరుకొనే అవకాశం ఉంది. భారత్ తన మూడుమ్యాచ్ ల్లో బంగ్లాదేశ్, అప్ఘనిస్థాన్ జట్ల పైన నెగ్గినా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోగలుగుతుంది.

First Published:  19 Jun 2024 2:16 PM IST
Next Story