Telugu Global
Sports

ప్రపంచకప్ సూపర్-8 రౌండ్లో భారత్!

టీ-20 ఫార్మాట్లో ప్రపంచ నంబర్ వన్ జట్టు భారత్ ఐసీసీ టీ-20 ప్రపంచకప్ సూపర్- 8 రౌండ్ కు అలవోకగా చేరుకొంది హ్యాట్రిక్ విజయాలతో గ్రూప్ టాపర్ గా నిలిచింది.

ప్రపంచకప్ సూపర్-8 రౌండ్లో భారత్!
X

టీ-20 ఫార్మాట్లో ప్రపంచ నంబర్ వన్ జట్టు భారత్ ఐసీసీ టీ-20 ప్రపంచకప్ సూపర్- 8 రౌండ్ కు అలవోకగా చేరుకొంది హ్యాట్రిక్ విజయాలతో గ్రూప్ టాపర్ గా నిలిచింది.

ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో మరోసారి విశ్వవిజేతగా నిలవడానికి టాప్ ర్యాంక్ జట్టు భారత్ తహతహలాడుతోంది. 2007లో చివరిసారిగా ప్రపంచ టైటిల్ సాధించిన భారత్..ప్రస్తుత 2024 ప్రపంచకప్ లోనూ విజేతగా నిలవాలన్న పట్టుదలతో ఉంది.

గతేడాది జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో రన్నరప్ స్థానంతో సరిపెట్టుకొన్న భారత్...ప్రస్తుత టీ-20 ప్రపంచకప్ టైటిల్ వేటను జోరుగా మొదలు పెట్టింది. తొలిదశ గ్రూప్ లీగ్ ను అలవోకగా అధిగమించడం ద్వారా..ఎనిమిదిజట్ల సూపర్-8 రౌండ్ కు అర్హత సంపాదించింది.

గ్రూప్- ఏ టాపర్ గా భారత్...

పాకిస్థాన్, కెనడా, ఐర్లాండ్, అమెరికా జట్లతో కూడిన గ్రూప్- ఏ లీగ్ మొదటి మూడురౌండ్ల పోటీలు ముగిసే సమయానికే భారత్ మూడుకు మూడుమ్యాచ్ లు నెగ్గడం ద్వారా 6 పాయింట్లతో టాపర్ గా నిలిచింది.

ప్రారంభమ్యాచ్ లో ఐర్లాండ్ ను 8 వికెట్లతోను, రెండోరౌండ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను 6 పరుగుల తేడాతోను అధిగమించిన భారత్..మూడోరౌండ్ పోరులో చిచ్చరపిడుగు అమెరికాను సైతం 7 వికెట్ల తేడాతో కంగు తినిపించడం ద్వారా విజయాల హ్యాట్రిక్ నమోదు చేసింది.

అమెరికన్ బ్యాటర్లకు అర్షదీప్ పగ్గాలు....

పేస్, స్వింగ్ బౌలర్ల అడ్డా నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన మూడోరౌండ్ పోరులో ముందుగా టాస్ నెగ్గిన భారత్..మరోసారి ఫీల్డింగ్ వైపే మొగ్గు చూపింది.

ఎక్కువమంది భారత సంతతి ఆటగాళ్లతో కూడిన అమెరికాను ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించి 20 ఓవర్లలో 8 వికెట్లకు 110 పరుగుల స్కోరుకే కట్టడి చేసింది.

అమెరికా బ్యాటర్లలో ఓపెనర్ స్టీవెన్ టైలర్ 24, నితీష్ కుమార్ 27 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత ఓపెనింగ్ బౌలర్ అర్షదీప్ సింగ్ తన కోటా 4 ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టడం ద్వారా విశ్వరూపం ప్రదర్శించాడు. అపారఅనుభవం కలిగిన భారత బౌలింగ్ ఎటాక్ ను ఎదుర్కొనడంలో పసికూన్ అమెరికాజట్టు దారుణంగా విఫలమయ్యింది. హార్థిక్ పాండ్యాకు 2 వికెట్లు, అక్షర్ పటేల్ కు 1 వికెట్ దక్కాయి.

ఇటు సూర్య...అటు సౌరవ్....

బ్యాటింగ్ కు అంతగా అనువుకాని పిచ్ పైన 111 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన భారత్ కు ప్రారంభ ఓవర్లలోనే డబుల్ షాక్ తలిగింది.సీనియర్ ఓపెనర్లు విరాట్ కొహ్లీ (0 ), రోహిత్ శర్మ ( 3 ) 2.2 ఓవర్లలో 10 పరుగుల స్కోరుకే వెనుదిరిగారు. అమెరికాజట్టులో సభ్యుడిగా ఉన్న భారత మాజీ ప్రపంచకప్ ప్లేయర్ సౌరవ్ నేత్రవల్కర్ వికెట్ వెంట వికెట్ తీసి భారత్ ను కష్టాలలోకి నెట్టాడు.ముంబైకి చెందిన సౌరవ్ నేత్రవల్కర్ దశాబ్దకాలం క్రితం అమెరికాకు వలస వెళ్లి అక్కడ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా ఉంటూనే తన క్రికెట్ ప్రస్థానం కొనసాగిస్తూ...ప్రపంచకప్ లో అమెరికాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

2010, 2012 జూనియర్ ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలలో భారత ఓపెనింగ్ బౌలర్ గా వ్యవహరించిన సౌరవ్...ఇప్పుడు భారత సీనియర్ జట్టు సూపర్ స్టార్లనే గడగడలాడించాడు. విరాట్, రోహిత్ లాంటి దిగ్గజ బ్యాటర్లను తన స్వింగ్ తో కంగు తినిపించాడు.

భారత్ ను ఆదుకొన్న సూర్య, శివం...

భారత్ 10 పరుగులకే ఇద్దరు ఓపెనర్ల వికెట్లు నష్టపోయిన తరుణంలో క్రీజులో నిలిచిన వన్ డౌన్ రిషభ్ పంత్- రెండోడౌన్ సూర్యకుమార్..3వ వికెట్ కు 29 పరుగుల భాగస్వామ్యంతో ఊపిరిపోశారు. రిషభ్ 20 బంతుల్లో ఒక్కో ఫోర్, సిక్సర్ తో 18 పరుగులు సాధించి అవుట్ కావడంతో భారత్ మూడో వికెట్ నష్టపోయింది. 39 పరుగులకే 3 వికెట్లు నష్టపోయిన భారత్ ను...4వ వికెట్ కు ముంబైజోడీ సూర్యకుమార్ యాదవ్- శివం దూబే అజేయ భాగస్వామ్యంతో విజేతగా నిలిపారు.

ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ బ్యాటర్ సూర్యకుమార్ 49 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు, వీరబాదుడు శివం దూబే 35 బంతుల్లో ఒక్కో ఫోరు, సిక్సర్ తో

31 పరుగులతో అజేయంగా నిలవడంతో భారత్ 18.2 ఓవర్లలోనే విజయలక్ష్యాన్ని చేరుకోగలిగింది.

అమెరికా బౌలర్లలో సౌరవ్ నేత్రవల్కర్ 2 వికెట్లు, అలీఖాన్ 1 వికెట్ పడగొట్టారు. భారత విజయంలో ప్రధానపాత్ర వహించిన పేసర్ అర్షదీప్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఐదుజట్ల లీగ్ లో భారత్ కు ఇది వరుసగా మూడో గెలుపు కాగా..ఆతిథ్య అమెరికాకు మూడురౌండ్లలో తొలి ఓటమి. గ్రూప్ లీగ్ తమ ఆఖరి రౌండ్ పోరులో కెనడాతో భారత్, ఐర్లాండ్ తో అమెరికా తలపడాల్సి ఉంది.

3 విజయాలు, 6 పాయింట్లతో గ్రూపు టాపర్ గా భారత్ సూపర్ - 8 రౌండ్ బెర్త్ ఖాయం చేసుకోగా...ఇప్పటికే 2 విజయాలతో 4 పాయింట్లు సాధించిన అమెరికా..తన ఆఖరి రౌండ్ పోరులో ఐర్లాండ్ ను ఓడించగలిగితే సూపర్-8దశకు చేరుకోగలుగుతుంది. ఒకవేళ ఐర్లాండ్ చేతిలో అమెరికా ఓడితే..పాక్ జట్టుకు సూపర్- 8 రౌండ్ బెర్త్ దక్కే అవకాశం ఉంది.

ఇప్పటికే ప్రపంచ మాజీ చాంపియన్ శ్రీలంక, రన్నరప్ న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు సూపర్-8 రౌండ్ చేరుకోడంలో విఫలం కాగా..దక్షిణాఫ్రికా, భారత్, వెస్టిండీస్ జట్లు రెండోదశ పోరుకు అర్హత సంపాదించగలిగాయి.

గ్రూపులీగ్ దశలో తన ఆఖరిరౌండ్ మ్యాచ్ ను డల్లాస్ వేదికగా కెనడాతో భారత్ ఆడనుంది.

First Published:  13 Jun 2024 6:34 PM IST
Next Story