అండర్ -19 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్!
2024-ఐసీసీ అండర్ -19 ప్రపంచకప్ క్రికెట్ సెమీఫైనల్స్ కు భారత్ అలవోకగా చేరుకొంది.
2024-ఐసీసీ అండర్ -19 ప్రపంచకప్ క్రికెట్ సెమీఫైనల్స్ కు భారత్ అలవోకగా చేరుకొంది. సూపర్-6 ఆఖరి రౌండ్లో నేపాల్ ను చిత్తు చేసింది.
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్ -19 ప్రపంచకప్ టోర్నీలో హాట్ ఫేవరెట్ భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. 16 జట్ల గ్రూప్ లీగ్ లో మాత్రమే కాదు..
ఆరుజట్ల సూపర్- 6 రౌండ్లోనూ తిరుగులేని విజయాలతో అజేయంగా నిలవడం ద్వారా సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్లో అడుగుపెట్టింది.
జంట సెంచరీలతో భారీగెలుపు...
సూపర్-6 తొలిరౌండ్లో న్యూజిలాండ్ ను చిత్తు చేసిన భారత్ ..ఆఖరి రౌండ్ మ్యాచ్ లో సైతం చెలరేగిపోయింది. నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో 132 పరుగుల విజయంతో వరుసగా ఐదోసారి సెమీఫైనల్స్ చేరుకోగలిగింది.
బ్లూమ్ ఫాంటీన్ వేదికగా జరిగిన ఆఖరి రౌండ్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 297 పరుగుల స్కోరు సాధించింది.
కెప్టెన్ ఉదయ్ సహ్రాన్, మిడిలార్డర్ బ్యాటర్ సచిన్ దాస్ సెంచరీలతో చెలరేగి పోయారు.
62 పరుగులకే మూడు టాపార్డర్ వికెట్లు కోల్పోయిన తరుణంలో క్రీజులోకి అడుగు పెట్టిన సచిన్ దాస్ తో కెప్టెన్ సహ్రాన్ 5వ వికెట్ కు డబుల్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశాడు.
ఈ ఇద్దరూ కేవలం 202 బంతుల్లోనే 215 పరుగుల భాగస్వామ్యం సాధించారు. సచిన్ దాస్ 101 బంతుల్లో 116 పరుగులు, ఉదయ్ సహ్రాన్ 107 బంతుల్లో 100 పరుగులు సాధించారు.
ప్రస్తుత ప్రపంచకప్ లో భారత బ్యాటర్లు ఇప్పటి వరకూ మొత్తం నాలుగు శతకాలు సాధించగలిగారు. ముషీర్ ఖాన్ ఒక్కడే రెండు సెంచరీలు బాదితే..సచిన్, ఉదయ్ చెరో శతకం సాధించగలిగారు.
165 పరుగులకే నేపాల్ కట్టడి....
మ్యాచ్ నెగ్గాలంటే 50 ఓవర్లలో 298 పరుగులు చేయాల్సిన నేపాల్ కు ఓపెనింగ్ జోడీ 14 ఓవర్లలో వికెట్ నష్టానికి 65 పరుగుల భాగస్వామ్యంతో చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు. అయితే..ఆ తరువాత కేవలం 12 పరుగుల వ్యవధిలో వరుసగా 6 వికెట్లు నష్టపోయి పీకలోతు కష్టాలలో కూరుకుపోయింది. 28వ ఓవర్ ముగిసే సమయానికి 77 పరుగుల స్కోరుకే 7 వికెట్లు నష్టపోయింది.
భారత స్టార్ స్పిన్నర్ సౌమ్య పాండే 10 ఓవర్లలో 29 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత ప్రపంచకప్ లో సౌమ్య మొత్తం 16 వికెట్లు పడగొట్టడం ద్వారా టాపర్ గా నిలిచాడు.
గ్రూప్ లీగ్ నుంచి సూపర్ సిక్స్ రౌండ్ల వరకూ నాలుగుసార్లు నాలుగు వికెట్ల చొప్పున సాధించిన ఏకైక బౌలర్ గా రికార్డుల్లో చేరాడు.
నేపాల్ బ్యాటర్లలో ఆకాశ్ చంద్ 18, దుర్గేశ్ గుప్తా 29 పరుగుల నాటౌట్ స్కోర్లతో నిలవడం తో నేపాల్ 50 ఓవర్లలో 165 పరుగులు మాత్రమే చేయగలిగింది.
సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాతో భారత్ ఢీ...
సూపర్ - 6 రౌండ్ నుంచి ప్రపంచకప్ సెమీస్ చేరిన ఇతరజట్లలో ఆతిథ్య దక్షిణాఫ్రికా, ఆస్ట్ర్రేలియా చేరుకొన్నాయి. బెనినో వేదికగా జరిగే సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ప్రస్తుత ప్రపంచకప్ లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో టైటిల్ వేటకు దిగిన భారత్ కు ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన రికార్డు ఉంది.