విశాఖ టెస్టు గెలుపుతో రెండోస్థానంలో భారత్!
ఆంధ్రప్రదేశ్ ఏకైక టెస్టు వేదిక విశాఖలో భారత్ ఇప్పటి వరకూ ఆడిన మూడుకు మూడు టెస్టులు నెగ్గడం ద్వారా నూటికి నూరుశాతం విజయాల రికార్డు నమోదు చేసింది.
ఐసీసీ టెస్టులీగ్ టేబుల్ లో భారత్ తిరిగి రెండోస్థానం సాధించింది. విశాఖ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన రెండోటెస్టు నాలుగోరోజుఆటలోనే భారత్ 106 పరుగుల విజయం నమోదు చేసింది.
టెస్టు హోదా పొందిన దేశాల నడుమ ఐసీసీ నిర్వహిస్తున్న 2023-2025 టెస్టులీగ్ టో్ర్నీ లీగ్ టేబుల్ లో రెండుసార్లు రన్నరప్ భారత్ తిరిగి రెండోస్థానం సంపాదించింది.
5వ స్థానం నుంచి 2వ స్థానానికి....
ఇంగ్లండ్ తో ప్రస్తుత ఐదుమ్యాచ్ ల సిరీస్ ప్రారంభానికి ముందు వరకూ రెండోస్థానంలో కొనసాగుతూ వచ్చిన భారత్ హైదరాబాద్ వేదికగా జరిగిన తొలిటెస్టులో 28 పరుగుల తేడాతో పరాజయం పొందడంతో ఒక్కసారిగా ఐదవ స్థానానికి పడిపోయింది.
అయితే..విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియం వేదికగా జరిగిన కీలక రెండోటెస్టులో భారత్ పుంజుకొని ఆడి 106 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ను దెబ్బకు దెబ్బ తీయటం ద్వారా 5 నుంచి 2వ స్థానానికి చేరుకోగలిగింది.
ఐసీసీ విడుదల చేసిన తాజా పాయింట్ల పట్టిక ప్రకారం 55 శాతం విజయాలతో ఆస్ట్ర్రేలియా టేబుల్ టాపర్ గా కొనసాగుతుంటే..భారత్ 52.77 పాయింట్లతో ఆ తర్వాతి స్థానంలో నిలిచింది.
'బజ్ బాల్' బ్రాండ్ క్రికెట్ ఆడుతూ సంచలనాలు సృష్టిస్తున్న ఇంగ్లండ్ మాత్రం విశాఖ టెస్టు ఓటమితో లీగ్ టేబుల్ 8వ స్థానానికి పడిపోయింది.
విశాఖ స్టేడియంలో తిరుగులేని భారత్...
సాంప్రదాయ టెస్టు క్రికెట్లో విశాఖ పట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియం భారత పాలిట విజయాల గనిగా, లక్కీగ్రౌండ్ గా తన ప్రత్యేకతను మరోసారి చాటుకొంది.
ఐదుమ్యాచ్ ల ఈ సిరీస్ ను ఓటమితో మొదలు పెట్టిన ఆతిథ్య భారత్ నెగ్గితీరాల్సిన విశాఖ టెస్టులో స్థాయికి తగ్గట్టుగా రాణించగలిగింది. కీలక టాస్ నెగ్గడం ద్వారా కెప్టెన్ రోహిత్ శర్మ భారతజట్టుకు బరిలోకి దిగటానికి ముందే సగం విజయం అందించాడు.
ఇక..బ్యాటింగ్ లో యువఓపెనర్ యశస్వి జైశ్వాల్ తొలి ఇన్నింగ్స్ లో 209 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో వన్ డౌన్ స్టార్ శుభ్ మన్ గిల్ 106 పరుగులతో కీలక పాత్ర పోషిస్తే...బౌలింగ్ లో భారత తురుపుముక్క జస్ ప్రీత్ బుమ్రా రెండు ఇన్నింగ్స్ లోనూ కలిపి 9 వికెట్లు పడగొట్టడం ద్వారా తన జట్టును 106 పరుగుల తేడాతో నాలుగోరోజు ఆటలోనే విజేతగా నిలిపాడు.
విశాఖ వేదికగా హ్యాట్రిక్ విజయం...
ఆంధ్రప్రదేశ్ ఏకైక టెస్టు వేదిక విశాఖలో భారత్ ఇప్పటి వరకూ ఆడిన మూడుకు మూడు టెస్టులు నెగ్గడం ద్వారా నూటికి నూరుశాతం విజయాల రికార్డు నమోదు చేసింది.
భారత 24వ టెస్టు వేదికగా వెలుగులోకి వచ్చిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియాన్ని 2004లో స్టీల్ సిటీ విశాఖపట్నం శివారులోని పోతిన మల్లయ్యపాలెంలో బీసీసీఐ ఆర్థికసాయంతో ఆంధ్ర క్రికెట్ సంఘం నిర్మించింది.
ఏసీఏ-వీడీసీఏ స్టేడియం ప్రస్థానం చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్థాన్ జట్ల పోరుతో ప్రారంభమయింది. 2005, ఏప్రిల్ 5న ఈ రెండు జట్ల మధ్య వన్డే మ్యాచ్ నిర్వహించారు. ఈ పోరులో భారత్ ను పాక్ కంగుతినిపించింది.
ఆ తర్వాత నుంచి జరిగిన వన్డే, టీ-20, టెస్టుమ్యాచ్ ల్లో భారత్ అత్యధిక విజయాలు సాధించిన వేదికగా విశాఖ రికార్డుల్లో చేరింది.
విశాఖ వేదిక ఇంగ్లండ్ రెండో ఓటమి..
2005 నుంచి ప్రస్తుత 2024 టెస్టు సిరీస్ లోని రెండో మ్యాచ్ వరకూ పలు అంతర్జాతీయమ్యాచ్ లకు ఆతిథ్యమిచ్చిన విశాఖ స్టేడియం వేదికగా మొట్టమొదటి టెస్టుమ్యాచ్ ను 2016లో ఇంగ్లండ్ ప్రత్యర్థిగా నిర్వహించారు.
భారత్ ఆధిపత్యంతో కొనసాగిన ఈ టెస్టులో ఇంగ్లండ్ 246 పరుగుల భారీఓటమి చవిచూసింది. భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ 167, 81 స్కోర్లతో బ్యాటింగ్ లో చెలరేగిపోతే...
తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్ 5 వికెట్లతో బౌలింగ్ లో రాణించాడు.
ఆ తర్వాత మూడేళ్లకు 2019 అక్టోబర్ లో మరోసారి టెస్టుమ్యాచ్ కు వేదికగా నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టుమ్యాచ్ లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ సాధిస్తే..రోహిత్ శర్మ 176 పరుగులతో వీరవిహారం చేశాడు..
బౌలింగ్ విభాగంలో అశ్విన్ 7 వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ 5 వికెట్లు పడగొట్టడంతో భారత్ 203 పరుగుల భారీవిజయం సాధించింది.
ఇప్పటి వరకూ ఆడిన మూడుకు మూడుటెస్టుల్లోనూ భారత్ అజేయంగా నిలువగలిగింది.
ఆంధ్ర వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్ కు హోంగ్రౌండ్ విశాఖ వేదికగా టెస్టు మ్యాచ్ ఆడే అరుదైన అవకాశం ప్రస్తుత ఈ మ్యాచ్ ద్వారానే దక్కడం విశేషం.విశాఖ వేదికగా టెస్టు మ్యాచ్ జరిగిన నాలుగురోజులూ..రోజుకు 5వేల మంది విద్యార్థులకు నిర్వాహక ఆంధ్ర క్రికెట్ సంఘం ఉచితంగా మ్యాచ్ ను చూసే అవకాశం కల్పించడం తో పాటు..అత్యంత సమర్థవంతంగా టెస్టుమ్యాచ్ ను నిర్వహించడమే కాదు..విజయవంతం చేయగలిగింది.