Telugu Global
Sports

ఒలింపిక్స్ హాకీ క్వార్టర్ ఫైనల్స్ లో భారత్!

ప్రపంచ, ఒలింపిక్స్ మాజీ చాంపియన్ భారత్ వరుసగా రెండోసారి ఒలింపిక్ గేమ్స్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకొంది.

ఒలింపిక్స్ హాకీ క్వార్టర్ ఫైనల్స్ లో భారత్!
X

ప్రపంచ, ఒలింపిక్స్ మాజీ చాంపియన్ భారత్ వరుసగా రెండోసారి ఒలింపిక్ గేమ్స్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకొంది. గ్రూప్ లీగ్ లో రెండోవిజయంతో నాకౌట్ రౌండ్లో చోటు ఖాయం చేసుకొంది.

పారిస్ ఒలింపిక్స్ ఐదోరోజు పోటీలలో భారత్ కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. బ్యాడ్మింటన్, విలువిద్య వ్యక్తిగత విభాగాలతో పాటు..పురుషుల హాకీలో భారత్ మెరుగైన ఫలితాలు సాధించింది.

ఐర్లాండ్ పై 2-0 గోల్స్ తో విజయం...

హర్మన్ ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారతజట్టు వరుసగా రెండో ఒలింపిక్స్ లో ఏదో ఒక పతకం సాధించాలన్న పట్టుదలతో పారిస్ ఒలింపిక్స్ బరిలో నిలిచింది.

ఆస్ట్ర్రేలియా, బెల్జియం, న్యూజిలాండ్, అర్జెంటీనా, ఐర్లాండ్ లాంటి హేమాహేమీజట్లతో కూడిన పూల్ -బీ లీగ్ మొదటి మూడురౌండ్ల మ్యాచ్ ల్లో భారత్ రెండు విజయాలతో అజేయంగా నిలిచింది.

గ్రూప్ తొలిమ్యాచ్ లో న్యూజిలాండ్ పై గట్టిపోటీ ఎదుర్కొని విజయం సాధించిన భారత్..రెండోరౌండ్లో పవర్ ఫుల్ అర్జెంటీనాతో హోరాహోరీగా సాగిన పోరులో ఆఖరి నిముషం గోలుతో మ్యాచ్ ను 1-1తో డ్రాగా ముగించడం ద్వారా ఊపిరిపీల్చుకోగలిగింది.

హర్మన్ ప్రీత్ డబుల్ ధమాకా...

ఐర్లాండ్ తో జరిగిన గ్రూపు మూడవ రౌండ్ పోటీలో సైతం భారత్ స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయింది. మిగిలినజట్లతో పోల్చిచూస్తే అత్యెంత బలహీనంగా ఉన్న ఐర్లాండ్ ను ఓడించడానికి భారత్ తుదివరకూ పోరాడాల్సి వచ్చింది.

ఆట మొదటి భాగం 11, 19 నిముషాలలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ అందించిన పెనాల్టీ కార్నర్ గోల్స్ తో 2-0తో పైచేయి సాధించినా ..రెండో భాగంలో ఒక్కగోలూ చేయలేకపోయింది. పైగా ..ప్రత్యర్థి ఐర్లాండ్ కు 10 పెనాల్టీకార్నర్ లు సమర్పించుకొని..పటిష్టమైన డిఫెన్స్ తో కాచుకోవాల్సి వచ్చింది. భారత దిగ్గజ గోల్ కీపర్ శ్రీజేష్ మరోసారి తన అనుభవాన్నంతా ఎదుర్కొని ప్రత్యర్ధిజట్టుకు గోల్ కాకుండా నిలువరించగలిగాడు. దీంతో భారత్ 2-0 గోల్స్ తో రెండో విజయం సాధించడం ద్వారా తన పాయింట్ల సంఖ్యను 7కు పెంచుకొంది.

నాలుగు గోల్స్ తో హర్మన్ అగ్రస్థానంలో

భారతజట్టు మొదటి మూడు గేమ్ ల్లో సాధించిన మొత్తం 6 గోల్స్ లో భారత కెప్టెన్ కమ్ పెనాల్టీకార్నర్ స్పెషలిస్ట్ హర్మన్ ప్రీత్ సింగ్ ఒక్కడే నాలుగు గోల్స్ చేయడం ద్వారా టాపర్ గా నిలిచాడు.

ఆడిన మొదటి మూడురౌండ్ల మ్యాచ్ ల్లోనూ అజేయంగా నిలవడం ద్వారా భారత్ 7 పాయింట్లతో పూల్ -బీ నుంచి క్వార్టర్ ఫైనల్స్ నాకౌట్ రౌండ్లో చోటు సంపాదించగలిగింది.

గ్రూప్ ఆఖరి రెండు రౌండ్ల పోటీలలో దిగ్గజ ఆస్ట్ర్రేలియా, బెల్జియం జట్లతో భారత్ పోటీపడాల్సి ఉంది.

ఒలింపిక్ విజేత బెల్జియం, రన్నరప్ ఆస్ట్ర్రేలియాజట్ల నుంచి భారతజట్టుకు అసలు సిసలు పరీక్ష ఎదురుకానుంది.

ప్రి-క్వార్టర్ పైనల్లో పీవీ సింధు...

బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ కు రెండు ఒలింపిక్స్ పతకాల విజేత, తెలుగుతేజం పీవీ సింధు అలవోకగా చేరుకొంది. గ్రూపులీగ్ లో వరుసగా రెండో గెలుపుతో నాకౌట్ రౌండ్లో అడుగుపెట్టింది.

తన గ్రూపు ప్రారంభమ్యాచ్ లో మాల్దీవ్స్ ప్లేయర్ ఫతిమాత్ ను 21-9, 21-6తో చిత్తు చేయడం ద్వారా పతకం వేట ప్రారంభించిన సింధు..రౌండో మ్యాచ్ లో ఎస్తోనియా ప్లేయర్ క్రిస్టిన్ కుబాను కేవలం 32 నిముషాలలోనే ఓడించింది. 21-5, 21-10 పాయింట్లతో సింధు వరుసగా రెండో విజయం సాధించింది.

క్వార్టర్ ఫైనల్స్ లో చోటు కోసం జరిగే ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ పోరులో చైనా యువచాంపియన్ బింగ్ జియావోతో సింధు తలపడనుంది. గత ఒలింపిక్స్ కాంస్య పతకం పోటీలో బింగ్ జియావోను 21-13, 21-15తో అధిగమించిన సింధు ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ లో మాత్రం ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ దశలోనే అదే ప్రత్యర్థితో తలపడనుంది.

2016 రియో ఒలింపిక్స్ లో రజత, 2020 టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన సింధు..వరుసగా మూడో ఒలింపిక్స్ లో ఏదో ఒక పతకం సాధించాలన్న పట్టుదలతో ఉంది.

సత్తాచాటిన భారత యువఆర్చర్లు....

విలువిద్య టీమ్ విభాగాలలో విఫలమైన భారత ఆర్చర్లు వ్యక్తిగత విభాగం పోటీలలో మాత్రం రాణించారు. మహిళల రికర్వ్ విభాగంలో భజన్ కౌర్, పురుషుల రికర్వ్ విభాగంలో తెలుగుతేజం ధీరజ్ బొమ్మదేవర వరుస విజయాలతో ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ రౌండ్ చేరుకోగలిగారు.

తన జీవితంలో తొలిసారిగా ఒలింపిక్స్ లో పాల్గొంటున్న భజన్ కౌర్ తొలిరౌండ్లో పోలెండ్ ప్లేయర్ వియోలెటా మిస్ జోర్ ను 6-0తో చిత్తు చేసింది. రెండోరౌండ్లో ఇండోనీసియాకు చెందిన సిఫా కమల్ నూర్ పిఫాను 7-3తోను అధిగమించింది

పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర వరుస విజయాలతో ఆఖరి 16 రౌండ్ కు చేరుకొన్నాడు.

పతకాలపట్టిక 35వ స్థానంలో భారత్...

పారిస్ ఒలింపిక్స్ 5వరోజు పోటీలు ముగిసే సమయానికి భారత్ 2 కాంస్యాలతో పతకాల పట్టిక 35వ స్థానంలో కొనసాగుతోంది. చైనా 7 స్వర్ణాలతో సహా మొత్తం 15 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

జపాన్ 7 స్వర్ణ, 2 రజత, 4 కాంస్యాలతో సహా 13 పతకాలతో రెండు, ఆతిథ్య ఫ్రాన్స్ 6 స్వర్ణ, 9 రజత, 4 కాంస్యాలతో సహా 19 పతకాలతో మూడు స్థానాలలో కొనసాగుతున్నాయి.

ఆస్ట్ర్రేలియా 6 స్వర్ణ, 4 రజత, 1 కాంస్యతో సహా 11 పతకాలతో నాలుగోస్థానంలో నిలిచింది. దక్షిణ కొరియా 5, అమెరికా 6 స్థానాలలో ఉన్నాయి.

షూటింగ్ పిస్టల్ విభాగంలో భారత షూటర్ మను బాకర్ రెండు కాంస్య పతకాలు సాధించడంతో భారత్ పతకాల పట్టిక 35వ స్థానంలో నిలువగలిగింది.

First Published:  31 July 2024 4:59 PM IST
Next Story