Telugu Global
Sports

2022 లో భారత్...2024లో ఆస్ట్ర్రేలియా!

50 ఓవర్ల వన్డే క్రికెట్లో ఆస్ట్ర్రేలియా ఓ అరుదైన, అసాధారణ రికార్డు నెలకొల్పడం ద్వారా భారత్ సరసన నిలిచింది.

2022 లో భారత్...2024లో ఆస్ట్ర్రేలియా!
X

50 ఓవర్ల వన్డే క్రికెట్లో ఆస్ట్ర్రేలియా ఓ అరుదైన, అసాధారణ రికార్డు నెలకొల్పడం ద్వారా భారత్ సరసన నిలిచింది.

అంతర్జాతీయ వన్డే ఫార్మాట్లో వెయ్యి మ్యాచ్ లు ఆడిన రెండోజట్టుగా ఆస్ట్ర్రేలియా రికార్డుల్లో చేరింది. వెస్టిండీస్ తో కాన్ బెర్రా వేదికగా జరిగిన మూడుమ్యాచ్ ల సిరీస్ లోని ఆఖరి వన్డే ద్వారా కంగారూ టీమ్ ఈ ఘనత సాధించింది.

185 బంతుల్లోనే ముగిసిన వన్డేమ్యాచ్...

వన్డే మ్యాచ్ అంటే 100 ఓవర్లు, 600 బంతులపాటు సాగే పోరు. అయితే..2024 సిరీస్ లో భాగంగా ఆస్ట్ర్రేలియా- వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన ఆఖరివన్డే మ్యాచ్ మాత్రం కేవలం 185 బంతుల్లోనే ముగిసిపోయింది. వన్డే చరిత్రలోనే అతితక్కువ బంతుల్లో ముగిసిన 6వ మ్యాచ్ గా రికార్డుల్లో నిలిచింది.

ఈమ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ 24.1 ఓవర్లలో 86 పరుగులు మాత్రమే చేయగలిగింది.

కరీబియన్ బ్యాటర్లలో అలిక్ అత్నాజే 60 బంతుల్లో 32 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కంగారూ బౌలర్లలో జేవియర్ బార్ట్ లెట్ 21 పరుగులిచ్చి 4 వికెట్లు, లాన్స్ మోరిస్ 13 పరుగులిచ్చి 2 వికెట్లు, ఆడం జంపా 14 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టారు.

సమాధానంగా 87 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్ర్రేలియా కేవలం 6.5 ఓవర్లలోనే చేరుకోగలిగింది. ఓపెనర్లు జాకే ఫ్రేజర్ మెక్ గుర్క్ 18 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 పరుగులతోను, జోష్ ఇంగ్లిస్ 16 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్ తో 35 పరుగుల నాటౌట్ స్కోర్లు సాధించారు.

ఈమ్యాచ్ కేవలం 185 బంతుల్లోనే ముగిసిపోడం విశేషం. ఆస్ట్ర్రేలియా వేదికగా అతితక్కువ బంతుల్లోనే ముగిసిన వన్డే మ్యాచ్ గా రికార్డుల్లో చేరింది.

వన్డే చరిత్రలో అతితక్కువ ( 104 )బంతుల్లో ముగిసిన మ్యాచ్ లో నేపాల్- అమెరికా భాగస్వాములుగా ఉన్నాయి. 2020లో జరిగిన ఈ మ్యాచ్ లో అమెరికా 12 ఓవర్లలో 35 పరుగులకే కుప్పకూలగా..నేపాల్ 5.2 ఓవర్లలోనే విజయలక్ష్యాన్ని సాధించగలిగింది.

1000వ మ్యాచ్ లో 609వ గెలుపు...

ప్రస్తుత ఈ మూడుమ్యాచ్ ల సిరీస్ లోని ఆఖరి వన్డే ఆస్ట్ర్రేలియా 1000 మ్యాచ్ గా నిలిచింది. వన్డే చరిత్రలోనే వెయ్యి అంతర్జాతీయమ్యాచ్ లు ఆడిన రెండోజట్టుగా ఆస్ట్ర్రేలియా భారత్ తరువాతి స్థానంలో నిలిచింది.

మొత్తం వెయ్యి వన్డేలలో ఆస్ట్ర్రేలియా 609 విజయాలు, 348 పరాజయాల రికార్డుతో ఉంది. 9 మ్యాచ్ ల టై కాగా.34 మ్యాచ్ లు ఫలితం తేలకుండా ముగిశాయి. కంగారూజట్టు 60.90 విజయశాతం నమోదు చేసింది. ఇందులో ఆరు ఐసీసీ ప్రపంచకప్ ట్రోఫీలతో ఆస్ట్ర్రేలియా అత్యంత విజయవంతమైన వన్డే జట్టుగా నిలిచింది.

వెయ్యి వన్డేల తొలిజట్టుగా భారత్...

ఆస్ట్ర్రేలియా కంటే ముందే 1000 అంతర్జాతీయ వన్డేమ్యాచ్ లు ఆడిన తొలి, ఏకైకజట్టుగా భారత్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. భారత్ ఇప్పటి వరకూ ఆడిన 1055 వన్డేలలో 559 విజయాలు, 443 పరాజయాలు, 9 టై మ్యాచ్ లు, ఫలితం తేలని మ్యాచ్ లు 44 ఉన్నాయి. భారత్ విజయశాతం 52.98 మాత్రమే కావడం విశేషం.

భారత 100వ వన్డేలో కపిల్ దేవ్ నాయకత్వం వహించగా..500వ వన్డేలో సౌరవ్ గంగూలీ కెప్టెన్ గా వ్యవహరించాడు. 1000వ వన్డేలో రోహిత్ శర్మ భారత్ కు సారథ్యం వహించాడు.

First Published:  7 Feb 2024 4:00 PM IST
Next Story