Telugu Global
Sports

2024లో ఊపిరి సలపని భారత క్రికెట్ !

కొత్తసంవత్సరంలో భారత క్రికెట్ జట్టు కోసం ఊపిరి సలుపని రీతిలో బిజీబిజీ షెడ్యూల్ ఎదురుచూస్తోంది. ఐసీసీ టీ-20 ప్రపంచకప్ సన్నాహాలే ప్రధానభాగం కానున్నాయి.

2024లో ఊపిరి సలపని భారత క్రికెట్ !
X

కొత్తసంవత్సరంలో భారత క్రికెట్ జట్టు కోసం ఊపిరి సలుపని రీతిలో బిజీబిజీ షెడ్యూల్ ఎదురుచూస్తోంది. ఐసీసీ టీ-20 ప్రపంచకప్ సన్నాహాలే ప్రధానభాగం కానున్నాయి.

రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టుకు గత ఏడాదికాలం వన్డే ప్రపంచకప్ చుట్టూ తిరగడంతోనే సరిపోయింది. అయితే..2024 సీజన్లో సైతం అదే పరిస్థితి పునరావృతం కానుంది.

కరీబియన్ ద్వీపాలు, అమెరికా సంయుక్త ఆతిథ్యంలో జరుగనున్న ఐసీసీ టీ-20 ప్రపంచకప్ కు సన్నాహాలే భారతజట్టు షెడ్యూలులో ప్రధానభాగంగా ఉన్నాయి.

మరో టీ-20 ప్రపంచకప్ టైటిలే లక్ష్యంగా...

టీ-20 ఫార్మాట్లో ప్రపంచనంబర్ వన్ ర్యాంక్ జట్టుగా ఉన్న భారత్ 2007 ప్రారంభ టీ-20 ప్రపంచకప్ ను మాత్రమే గెలుచుకొన్నా..మరో టైటిల్ కోసం గత 16 సంవత్సరాలుగా ఎదురుచూస్తూ వస్తోంది. 2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ను గెలుచుకోడం ద్వారా ఆలోటును పూడ్చుకోవాలని భావిస్తోంది.

గత పుష్కరకాలంగా ఒక్క ఐసీసీ ట్రోఫీని గెలుచుకోలేని భారత్ కు గత ఏడాదికాలంలో రెండుట్రోఫీలు చేతికి చిక్కినట్లే చిక్కి చేజారిపోయాయి.

ఇంగ్లండ్ వేదికగా ముగిసిన ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్లో మాత్రమే కాదు..సొంతగడ్డపై జరిగిన 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్లో సైతం భారతజట్టు ఆస్ట్ర్రేలియా చేతిలోనే పరాజయాలు పొంది రన్నరప్ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. లీగ్ దశలో చెలరేగిపోడం, ఆఖరిమెట్టుపై బోల్తా కొట్టడం భారతజట్టుకు పట్టిన పీడలా మారిపోయింది.

గతాన్ని పక్కన పెట్టి 2024 సీజన్లో స్పష్టమైన వ్యూహాలతో భారత్ సమాయత్తం కానుంది. ఐసీసీ టీ-20 ప్రపంచకప్ నెగ్గడంతోపాటు..2025 ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్స్ చేరడమే భారత్ ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి

2024 క్రికెట్ సీజన్లో....

ఇంగ్లండ్ తో ఐదుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ నుంచి 2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ వరకూ భారతజట్టు ఊపిరిసలుపని క్రికెట్ షెడ్యూలతో ఈ ఏడాదికాలాన్ని గడుపనుంది.

దక్షిణాఫ్రికాతో కేప్ టౌన్ వేదికగా రెండోటెస్టు ముగిసిన వెంటనే అప్ఘనిస్థాన్ తో టీ-20 సిరీస్ లో పాల్గోనుంది. ఆ తరువాత ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా సొంతగడ్డపై న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లతో కీలక సిరీస్ లు ఆడాల్సి ఉంది.

జనవరి 3 నుంచి కేప్ టౌన్ న్యూలాండ్స్ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగే రెండోటెస్టు నుంచి భారతజట్టు 2024 సీజన్ కు తెరలేవనుంది.

జనవరి 24 నుంచి అప్థనిస్థాన్ తో మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో భారత్ పోటీపడనుంది.

జూన్ 24 నుంచి టీ-20 ప్రపంచకప్...

మార్చి 24 నుంచి స్వదేశంలో ఇంగ్లండ్ ప్రత్యర్థిగా జరిగే ఐదుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భారత్ తలపడనుంది. మార్చి 24 నుంచి మే 24 వరకూ 58 రోజులపాటు ఐపీఎల్-2024 సీజన్ పోటీలు జరుగనున్నాయి.

జూన్ 2024 నుంచి వెస్టిండీస్, అమెరికా దేశాల సంయుక్త ఆతిథ్యంలో 2024 ఐసీసీ టీ-20 కప్ మ్యాచ్ లు మూడువారాలపాటు నిర్వహించనున్నారు.

ఆ తరువాత శ్రీలంక పర్యటనలో భారతజట్టు తీన్మార్ వన్డే, టీ-20 సిరీస్ ల్లో పాల్గోనుంది.

2024 సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో స్వదేశంలో రెండుమ్యాచ్ ల టెస్టు, మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ ల్లో భారత్ పోటీపడనుంది. అక్టోబర్, నవంబర్ మాసాలలో జరిగే స్వదేశీ మూడుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో న్యూజిలాండ్ తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.

2024-2025 సీజన్ ను డిసెంబర్- జనవరి మాసాలలో న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా కివీ జట్టుతో ఐదుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భారత్ పోటీపడాల్సి ఉంది.

ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా భారత్ రానున్న 12మాసాల కాలంలో 12 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. సగటున నెలకో టెస్టుమ్యాచ్ చొప్పున భారత్ ఆడనుంది.

First Published:  1 Jan 2024 12:42 PM GMT
Next Story