పాక్ పై గెలుపుతో డేవిస్ కప్ ప్రపంచ గ్రూప్ లో తిరిగి భారత్!
డేవిస్ కప్ చరిత్రలోనే రెండుసార్లు ఫైనల్స్ ఆడటంతో పాటు రన్నరప్ గా నిలిచిన ఆసియా ఏకైక దేశంగా భారత్ కు పేరుంది. .
డేవిస్ కప్ మాజీ రన్నరప్ భారత్ అగ్రశ్రేణిజట్ల ప్రపంచ గ్రూపులో తిరిగి చోటు సంపాదించింది. పాకిస్థాన్ ను చిత్తు చేయడం ద్వారా ఈ ఘనత సాధించింది.
ప్రపంచ టెన్నిస్ పురుషుల టీమ్ చాంపియన్లకు ఇచ్చే డేవిస్ కప్ లో భారత్ మరోసారి ప్రత్యర్థి పాకిస్థాన్ పై తిరుగులేని ఆధిపత్యం చాటుకొంది. ప్రపంచ గ్రూపులో చోటు కోసం జరిగిన పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను పాక్ గడ్డపై చిత్తు చేసింది.
ఆరుదశాబ్దాల విరామం తరువాత....
పాకిస్థాన్ ప్రత్యర్థిగా పాక్ గడ్డపై డేవిస్ కప్ పోరులో తలపడటానికి భారతజట్టు ఆరుదశాబ్దాల సుదీర్ఘ విరామం తరువాత ఆమోదం తెలిపింది. ఇస్లామాబాద్ గ్రాస్ కోర్టు కాంప్లెక్స్ వేదికగా జరిగిన ప్లే-ఆఫ్ పోరులో పాకిస్థాన్ పై 3-0తో పైచేయి సాధించడం ద్వారా ప్రపంచ గ్రూప్-1 బెర్త్ ఖాయం చేసుకోగలిగింది.
డేవిస్ కప్ చరిత్రలోనే రెండుసార్లు ఫైనల్స్ ఆడటంతో పాటు రన్నరప్ గా నిలిచిన ఆసియా ఏకైక దేశంగా భారత్ కు పేరుంది. అయితే..గత దశాబ్దకాలంగా భారత్ ఈ టోర్నీలో వెనుకబడి పోతూ వస్తోంది.
ప్రపంచ మేటి జట్లతో కూడిన ప్రపంచ గ్రూపులో చోటు నిలుపుకోడమే భారత్ కు గగనమైపోతోంది. ఆసియా జోనల్ స్థాయికి పడిపోయిన భారత్ ప్రస్తుత 2024 టోర్నీ ప్లే-ఆఫ్ రౌండ్ ద్వారా తిరిగి ప్రపంచ గ్రూపులో చోటు దక్కించుకోగలిగింది.
వరుసగా మూడు విజయాలు...
రెండు సింగిల్స్, ఓ డబుల్స్, రివర్స్ సింగిల్స్ తో సాగే ఐదుమ్యాచ్ ల డేవిస్ కప్ పోరులో భారత్ ప్రారంభసింగిల్స్ తో పాటు..కీలక డబుల్స్ లోనూ పాకిస్థాన్ ను అధిగమించింది.
ప్రారంభసింగిల్స్ లో భారత్ 2-0తో పైచేయి సాధించిన అనంతరం జరిగిన కీలక డబుల్స్ లో భారత జోడీ యుకీ బాంబ్రీ- సాకేత్ మైనేని 6-2, 7-6తో పాక్ జోడీ ముజమ్మిల్ మోర్తాజా- అఖీల్ ఖాన్ పై విజయం సాధించారు.
సాకేత్ మైనేని బూమ్ బూమ్ సెర్వ్ కు పాక్ ఆటగాళ్ల నుంచి బదులే లేకపోయింది. ప్రత్యర్థి పాక్ జట్టుతో పోల్చుకొంటే భారత్ ఎన్నో రెట్లు బలమైన జట్టుగా నిలిచింది.
పాకిస్థాన్ ప్రత్యర్థిగా డేవిస్ కప్ చరిత్రలో భారత్ కు వరుసగా ఇది ఎనిమిదో విజయం.
పాక్ పై 3-0తో తిరుగులేని ఆధిపత్యం సాధించడం ద్వారా నెగ్గిన భారత్ ప్రపంచ గ్రూప్ -1 కు చేరుకోగా..పాకిస్థాన్ గ్రూప్-2కే పరిమితం కావాల్సి వస్తుంది.