Telugu Global
Sports

ధ‌ర్మ‌శాల టెస్ట్‌.. భార‌త్‌ను ఊరిస్తున్న 112 ఏళ్ల రికార్డు

ఈ మ్యాచ్ నెగ్గితే భార‌త్ గ‌త 112 ఏళ్ల‌లో ఏ జ‌ట్టుకూ ద‌క్క‌ని అద్భుత‌మైన రికార్డును సొంతం చేసుకోబోతుంది.

ధ‌ర్మ‌శాల టెస్ట్‌.. భార‌త్‌ను ఊరిస్తున్న 112 ఏళ్ల రికార్డు
X

ఇంగ్లాండ్‌తో 5 టెస్ట్‌ల సిరీస్‌లో 3-1తో ఇప్ప‌టికే సిరీస్ కైవ‌సం చేసుకున్న భార‌త జ‌ట్టు ఇప్పుడు ధ‌ర్మ‌శాల‌లో జ‌రిగే చివ‌రి టెస్టులోనూ విజ‌యంపై క‌న్నేసింది. ఈ మ్యాచ్ నెగ్గితే భార‌త్ గ‌త 112 ఏళ్ల‌లో ఏ జ‌ట్టుకూ ద‌క్క‌ని అద్భుత‌మైన రికార్డును సొంతం చేసుకోబోతుంది. అందుకే ఈ మ్యాచ్‌లో బుమ్రాను కూడా ర‌ప్పించి బౌలింగ్ విభాగానికి మ‌రింత ప‌దునుపెట్ట‌బోతోంది.

తొలి మ్యాచ్‌లో ఓడి త‌ర్వాత నాలుగు టెస్ట్‌ల్లో గెలిస్తే

ఐదు టెస్ట్‌ల సిరీస్లో తొలి మ్యాచ్‌లో ఓడి, త‌ర్వాత పుంజుకుని వ‌రుస‌గా మూడు మ్యాచ్‌లు గెలిచింది ఇండియా. చివ‌రి టెస్ట్ కూడా గెలిస్తే 1-4తో గెలిచిన‌ట్ల‌వుతుంది. అంటే మొద‌టి మ్యాచ్ ఓడి, త‌ర్వాత నాలుగు గెలుపుల‌తో సిరీస్ ప‌ట్టేయ‌డం. ఇలాంటి రికార్డు చివ‌రిసారిగా 1912లో ఇంగ్లాండ్ న‌మోదు చేసింది. దానికంటే ముందు ఆస్ట్రేలియా రెండుసార్లు ఆ ఫీట్ సాధించింది. కానీ 1912 త‌ర్వాత మ‌ళ్లీ ఇన్నేళ్ల‌లో ఎవ‌రూ చేధించ‌లేదు. శ‌తాధిక సంవ‌త్స‌రాల ఆ రికార్డును చేధించే అవ‌కాశం ఇప్పుడు మ‌న‌వాళ్ల ముందుంది.

పోటాపోటీగా మ్యాచ్‌!

ధ‌ర్మ‌శాల పిచ్ ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలిస్తుంద‌ని భావిస్తున్నారు. అదే జ‌రిగితే ఈ మ్యాచ్ పోటాపోటీగా సాగుతుంది. సిరీస్‌లో ప్ర‌తి మ్యాచులోనూ ఇంగ్లాండ్ ఎంత పోరాడినా మ‌న‌వాళ్లు సాధికారికంగా ఆడి గెలిచారు. చివ‌రి మ్యాచ్‌లోనూ అదే ఆట‌తీరుతో వందేళ్లకు పైగా చెక్కుచెద‌రని రికార్డును బ‌ద్ద‌లుగొట్టాలి.

First Published:  29 Feb 2024 1:46 PM IST
Next Story