మీకు ఇష్టం లేకపోతే భారత్ కు రావొద్దు!
పాక్ క్రికెట్ బోర్డుకు తేల్చిచెప్పిన హర్బజన్ సింగ్
పాకిస్థాన్ కు ఇష్టం లేకపోతే భారత్ కు రావొద్దని మాజీ హాఫ్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ తేల్చిచెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో పాక్ వేదికగా నిర్వహించే చాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాక్ గడ్డపై ఆడేందుకు ససేమిరా అన్నది. హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీ నిర్వహించాలని పట్టుబట్టింది. ఇండియా మ్యాచ్‌లు హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించేందుకు ఓకే చెప్తూనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి పలు మెలికలు పెట్టింది. 2031 వరకు నిర్వహించే అన్ని ఐసీసీ టోర్నీలకు హైబ్రిడ్ మోడల్ ను అనుసరించాలని కోరింది. పాక్‌లో క్రికెట్ ఆడేందుకు భారత్ అంగీకరించడం లేదు కాబట్టి తామూ భారత గడ్డపై క్రికెట్ ఆడబోమని చెప్తోంది. 2031 వరకు హైబ్రిడ్ మోడల్ కొనసాగించాలని ఐసీసీకి పాక్ క్రికెట్ బోర్డు కోరింది. ఈ కొర్రీలపై హర్బజన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పాక్ క్రికెట్ జట్టు భారత్‌కు రానంత మాత్రాన తమకు వచ్చే నష్టమేమి లేదని, అసలు ఆ విషయాన్ని ఎవరు పట్టించుకోబోరని స్పష్టం చేశారు. చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించేందుకు మలేషియా, శ్రీలంఖ బోర్డులు సిద్ధంగా ఉన్నాయని, పాక్ మొండి వైఖరి వీడి ముందు టోర్నీ నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని సలహా ఇచ్చారు. పాకిస్థాన్‌లో పరిస్థితులు చక్కబడేవరకు భారత జట్టు ఆ దేశంలో పర్యటించబోదని తేల్చిచెప్పారు. తాము గతంలో పాక్‌లో పర్యటించినప్పుడు అక్కడి క్రికెట్ అభిమానులు తమను చక్కగా ఆదరించారని గుర్తు చేశారు. విరాట్ కోహ్లీ సహా స్టార్ క్రికెటర్లను పాక్‌లోని క్రికెట్ అభిమానులు ప్రత్యక్షంగా చూడలేకపోతున్నందుకు తాను బాధ పడుతున్నానని తెలిపారు.