సంక్షుభిత బంగ్లా నుంచి మహిళా ప్రపంచకప్ హుష్ కాకి!
అధికార అవామీలీగ్ ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటుతో సంక్షోభంలో పడిపోయిన బంగ్లాదేశ్ నుంచి మహిళా టీ-20 ప్రపంచకప్ వేరే దేశానికి ఎగిరిపోయింది.
అధికార అవామీలీగ్ ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటుతో సంక్షోభంలో పడిపోయిన బంగ్లాదేశ్ నుంచి మహిళా టీ-20 ప్రపంచకప్ వేరే దేశానికి ఎగిరిపోయింది.
బంగ్లాదేశ్ ఆతిథ్యంలో బంగ్లాగడ్డపై జరగాల్సిన 2024- ఐసీసీ మహిళా టీ-20 ప్రపంచకప్ ను సింధుశాఖదేశాల వేదికగా నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది.
గత కొద్దివారాలుగా అంతర్యుద్ధంలాంటి వాతావరణంతో అట్టుడికిపోతున్న బంగ్లాదేశ్ లో శాంతిభద్రతలు క్షీణించాయి. మెజారిటీ ముస్లింలు మైనారిటీ హిందువులపై దాడులకు తెగబడి అశాంతి సృష్టించడంతో పరిస్థితి అల్లకల్లోలంగా మారిపోయింది. దీంతో మహిళా టీ-20 ప్రపంచకప్ కు ఆతిథ్యమివ్వాల్సిన బంగ్లా క్రికెట్ బోర్డు చేతులెత్తేసింది. అయితే..బంగ్లా ఆతిథ్యంలోనే ఆసియాఖండంలోని మరో దేశంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.
బంగ్లాదేశ్ నుంచి ఎమిరేట్స్ కు....
అక్టోబర్ 3 నుంచి 20 వరకూ జరగాల్సిన మహిళా టీ-20 ప్రపంచకప్ ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా నిర్వహించనున్నారు. ప్రపంచకప్ లో తలపడే వివిధ జట్లకు చెందిన క్రికెటర్ల భద్రత దృష్ట్ట్యా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఐసీసీ చీఫ్ జెఫ్ అల్లార్డయిస్ తెలిపారు.
దుబాయ్, షార్జా క్రికెట్ స్టేడియాలు వేదికగా ప్రపంచకప్ మ్యాచ్ లు జరుగుతాయని, పోటీల నిర్వహణతో పాటు క్రికెటర్ల భద్రత తమకు ప్రధానమని చెప్పారు.
బంగ్లా సంక్షోభంతో పోటీల నిర్వహణకు శ్రీలంక, జింబాబ్వే క్రికెట్ బోర్డులు ముందుకు వచ్చాయని, అయితే..అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను ప్రత్యామ్నాయ వేదికగా ఎంపిక చేశామని వివరించారు.
అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రధాన కార్యాలయం ఉన్న ఎమిరేట్స్ లో మహిళా ప్రపంచకప్ ను నిర్వహించడానికి అవసరమైన సదుపాయాలు ఉన్నాయి. 2021- ఐసీసీ పురుషుల టీ-20 ప్రపంచకప్ ను ఎమిరేట్స్, ఒమాన్ సంయుక్త ఆతిథ్యంలో నిర్వహించడంతో...ఇప్పుడు మహిళా ప్రపంచకప్ ను సైతం నిర్వహించే అవకాశాన్ని దక్కించుకొంది.
దుబాయ్, షార్జా, అబుదాభీలలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి. మహిళా టీ-20 ప్రపంచకప్ ర్యాంకింగ్స్ ప్రకారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టు 16వ ర్యాంకులో కొనసాగుతోంది.
మరికొద్దివారాలలో ప్రారంభంకానున్నఐసీసీ మహిళా ప్రపంచకప్ లో ఆస్ట్ర్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ లాంటి దిగ్గజ జట్లకు భారత్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు సవాలు విసురుతున్నాయి.
ఇటీవలే ముగిసిన పురుషుల టీ-20 ప్రపంచకప్ లో విజేతగా నిలిచిన భారత్..మహిళా టీ-20 ప్రపంచకప్ ను సైతం గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉంది.