Telugu Global
Sports

టెస్టు క్రికెట్ పరిరక్షణ కోసం ఐసీసీ భారీనిధి!

సాంప్రదాయ టెస్టు క్రికెట్ పరిరక్షణ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి నడుం బిగించింది. భారీ మొత్తంలో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది.

టెస్టు క్రికెట్ పరిరక్షణ కోసం ఐసీసీ భారీనిధి!
X

సాంప్రదాయ టెస్టు క్రికెట్ పరిరక్షణ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి నడుం బిగించింది. భారీ మొత్తంలో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది.

ముందొచ్చిన చెవులకన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నసామెత నవతరం క్రికెట్ కు అతికినట్లు సరిపోతుంది. దశాబ్దాల చరిత్ర కలిగిన సాంప్రదాయ (ఐదురోజుల ) టెస్టు క్రికెట్ మనుగడకే ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ సవాలు విసురుతోంది. టీ-20 తుపానులో కొట్టుకుపోతున్న సాంప్రదాయ టెస్టు క్రికెట్ పరిరక్షణ కోసం ఐసీసీ ( అంతర్జాతీయ క్రికెట్ మండలి) భారీప్రణాళికతో సిద్ధమయ్యింది.

టెస్టు క్రికెట్ తోనే క్రికెట్ మనుగడ....

18వ శతాబ్దం నుంచి నిరంతరాయంగా జరుగుతూ వస్తున్న ఐదురోజుల సాంప్రదాయ టెస్టు క్రికెట్ క్రికెటర్ల నేర్పు, ఓర్పు, సత్తాలకు పరీక్షగా నిలుస్తూ వస్తోంది.రోజుకు 90 ఓవర్ల చొప్పున ..నాలుగు ఇన్నింగ్స్ గా, ఆధిక్యత చేతులు మారుతూ వచ్చే సాంప్రదాయ టెస్టు క్రికెట్ నే అసలు సిసలు క్రికెట్ గా అందరూ పరిగణిస్తూ ఉంటారు.

అయితే..మూడుగంటల్లో 20 ఓవర్ల ఇన్నింగ్స్ తో ముగిసి పోయే టీ-20 క్రికెట్ తో ఆటగాళ్ల పరిస్థితి శ్రమతక్కువ, ఆర్జన ఎక్కువ అన్నట్లుగా పరిస్థితి తయారయ్యింది.

ప్రపంచ వ్యాప్తంగా లీగ్ క్రికెట్ ఓ లాభసాటి వ్యాపారంగా మారిపోడంతో టెస్టు క్రికెట్ ఆడేవారి సంఖ్య రానురాను తగ్గిపోడం ఆందోళన కలిగిస్తోంది.

4 ఓవర్ల బౌలింగ్, 20 ఓవర్ల బ్యాటింగ్ తో కేవలం కొద్దివారాలలో కోట్ల రూపాయలు సంపాదించడానికే నేటితరం క్రికెటర్లు మొగ్గు చూపడాన్ని నివారించడం కోసం, టెస్టు క్రికెట్ మనుగడను కాపాడటంకోసం ఐసీసీ ప్రత్యేక వ్యూహాలతో , భారీ నిధితో ముందుకు వచ్చింది.

120 కోట్ల రూపాయలతో ఊపిరి...

టెస్టు క్రికెట్ ను పరిరక్షించుకోవాలంటే ప్రత్యేక నిధి ఉండితీరాలన్న బీసీసీఐ కార్యదర్శి జే షా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుల ప్రతిపాదనల్ని ఐసీసీ ఆమోదించడమే కాదు..ఆచరణలో పెట్టడం కోసం 120 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది.

15 మిలియన్ డాలర్ల నిధితో పరిరక్షణ చర్యలకు శ్రీకారం చుట్టింది.ఈ మొత్తాన్ని భారత్, ఆస్ట్ర్రేలియా, ఇంగ్లండ్ దేశాలు మినహా..మిగిలిన టెస్టు హోదా పొందిన దేశాలలో జరిగే టెస్టు మ్యాచ్ ల కోసం ఖర్చు చేయనుంది.

అంతర్జాతీయ క్రికెట్ ధనిక దేశాలుగా పేరుపొందిన భారత్, ఆస్ట్ర్రేలియా, ఇంగ్లండ్ క్రికెటర్లు కోట్లాది రూపాయలు వేతనాలుగా అందుకొంటున్నారు. ఈ మూడు దేశాలు మినహా మిగిలిన దేశాలలోని క్రికెటర్లకు అరకొరవేతనాలు మాత్రమే అందుతున్నాయి. ఈ పరిస్థితిని నివారించడం కోసం...పాకిస్థాన్, న్యూజిలాండ్, శ్రీలంక, జంబాబ్వే, అప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఐర్లాండ్ దేశాలలోని టెస్టు క్రికెటర్లకు భారీగా మ్యాచ్ ఫీజులు చెల్లించడం కోసం 120 కోట్ల రూపాయల ప్రత్యేక నిధిని వినియోగించాలని ఐసీసీ నిర్ణయించింది.

విదేశీ పర్యటనల కోసం....

ఆర్థికంగా నిలదొక్కుకోలేని క్రికెట్ బోర్డులు తమ టెస్టు క్రికెటర్లకు సకాలంలో తగిన మొత్తంలో మ్యాచ్ ఫీజులు అందించడంతో పాటు..ద్వైపాక్షిక సిరీస్ లు నిర్వహించడానికి సైతం ఐసీసీ నిధులు అందచేయనుంది.

ప్రస్తుతం భారత్ లో టెస్టు మ్యాచ్ లు ఆడే ఆటగాళ్లకు ఐదురోజుల టెస్టుకు 15 లక్షల రూపాయల చొప్పున మ్యాచ్ ఫీజుగా చెల్లిస్తున్నారు. అయితే..భారత్, ఆస్ట్ర్రేలియా, ఇంగ్లండ్ దేశాలు మినహా మిగిలిన టెస్టు హోదాపొందిన జట్ల ఆటగాళ్లకు కనీసం మ్యాచ్ కు 8 లక్షల రూపాయలు ( 10వేల డాలర్లు ) చెల్లించేలా ఐసీసీ నిధులు సమకూర్చనుంది.

భారత్ లో టెస్టు కు 60 లక్షల మ్యాచ్ ఫీజు....

భారత్ లో సాంప్రదాయ టెస్టు క్రికెటర్ల రొట్టెవిరిగి నేతిలో పడింది. కనీవినీ ఎరుగని రీతిలో మ్యాచ్ కు 60 లక్షల రూపాయలు మ్యాచ్ ఫీజు, ప్రోత్సాహకంగాను అందుకోబోతున్నారు....

ఏటా రెండుమాసాలపాటు సాగే ఐపీఎల్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్న క్రికెటర్లకు.. సాంప్రదాయ టెస్టుమ్యాచ్ ల్లో పాల్గొనడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదించే అవకాశాన్ని బీసీసీఐ కల్పించింది.

టెస్టు క్రికెట్ ఆడే క్రికెటర్లకు భారీగా ప్రోత్సాహం అందించడానికి..2022-23 సీజన్ నుంచి' టెస్టు క్రికెట్ ప్రోత్సాహక పథకాన్ని' ప్రవేశ పెట్టింది.

టెస్టుమ్యాచ్ లు ఆడటానికి ఆసక్తి చూపడంతో పాటు ప్రాధాన్యమిచ్చే ఆటగాళ్లకు 2022-23 సీజన్ నుంచి ఆడిన ఒక్కో టెస్టుకు 45 లక్షల రూపాయల వంతున అదనంగా చెల్లించనున్నట్లు బోర్డు ప్రకటించింది.

ఇప్పటి వరకూ ఆడిన ఒక్కో టెస్టుమ్యాచ్ కు 15 లక్షల రూపాయలు మాత్రమే మ్యాచ్ ఫీజుగా బీసీసీఐ అందచేస్తూ వచ్చింది.

ఏడాదికి 4 కోట్ల 50 లక్షల రూపాయలు....

భారతజట్టు ఓ సీజన్లో ఆడే మొత్తం 10 టెస్టుమ్యాచ్ ల్లో 75 శాతం మ్యాచ్ లు ఆడే ఆటగాళ్లకు ఏడాదికి 4 కోట్ల 50 లక్షల రూపాయలు చొప్పున చెల్లిస్తారు. మ్యాచ్ కు 15 లక్షల మ్యాచ్ ఫీజుతో పాటు ప్రోత్సాహకంగా 45 లక్షల రూపాయలు అదనంగా అందచేయనున్నారు.

రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, జడేజా, బుమ్రా, అశ్విన్, పూజారా, ఉమేశ్ యాదవ్ లాంటి ఆటగాళ్లు 2022-23 సీజన్ నుంచి 4 కోట్ల 50 లక్షల రూపాయల చొప్పున అందుకోనున్నారు.

భారత్ ఆడే మొత్తం టెస్టుమ్యాచ్ ల్లో పాల్గొనే ప్లేయర్లకు మ్యాచ్ ఫీజు కోటీ 50 లక్షలరూపాయలతో పాటు 4 కోట్ల 50 లక్షల రూపాయలు వంతున ప్రోత్సాహకంగా అందచేస్తారు.

సీజన్ కు 45 కోట్ల బడ్జెట్....

టెస్టు క్రికెటర్ల ప్రోత్సాహక పథకం కోసం బీసీసీఐ సీజన్ కు 45 కోట్ల రూపాయలు అదనంగా నిధులు కేటాయించింది. 2023-24 సీజన్ కు సైతం ఈ పథకాన్ని వర్తింప చేస్తారు.

భారత అగ్రశ్రేణి క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, జడేజా, బుమ్రా వార్షిక కాంట్రాక్టు కింద ప్రస్తుతం ఏడాదికి 7 కోట్ల రూపాయలు చొప్పున గ్యారెంటీమనీగా అందచేస్తూ వస్తోంది. దీనికి అదనంగా టెస్టు క్రికెటర్ల ప్రోత్సాహక పథకం కింద మ్యాచ్ ఫీజుతో కలుపుకొని మరో 6 కోట్ల రూపాయలు చొప్పున చెల్లిస్తారు. అంటే..ఐపీఎల్ కాంట్రాక్టుల ప్రమేయం లేకుండా సీజన్ కు 13 కోట్ల రూపాయలు అగ్రశ్రేణి ఆటగాళ్లకు దక్కనున్నాయి.

2023-24 సీజన్లో భారత్ ఆడిన మొత్తం 10 టెస్టుల్లో పాల్గొన్న రోహిత్ శర్మ 13 కోట్ల రూపాయలు అందుకోనున్నాడు. కేవలం టెస్టు క్రికెట్ ఆడటం ద్వారానే 6 కోట్ల రూపాయలు అందుకొనేలా బీసీసీఐ చర్యలు చేపట్టింది.

సీజన్ కు 5 నుంచి 6 టెస్టు మ్యాచ్ లు ఆడే ఆటగాళ్లకు కోటీ 80 లక్షల రూపాయల చొప్పున చెల్లిస్తారు. ఈ పథకం కేవలం భారత పురుషుల టెస్టు జట్టుకు మాత్రమే వర్తిస్తుందని బీసీసీఐ స్పష్టం చేసింది.

ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఈ తరహా పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక క్రికెట్ బోర్డు బీసీసీఐ మాత్రమే. మొత్తంమీద టెస్టు క్రికెటర్ల రొట్టె విరిగి నేతిలో పడిందనే చెప్పాలి.

దేశవాళీ క్రికెట్లో రోజుకు 50 వేలు.....

దేశవాళీ ( రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ తో సహా ) క్రికెట్ మ్యాచ్ ల్లో పాల్గొనే క్రికెటర్ల మ్యాచ్ ఫీజులను సైతం బీసీసీఐ భారీగా పెంచింది. క్రికెట్ నే వృత్తిగా చేసుకొని జీవించే ఆటగాళ్లు గౌరవంగా బతకటానికి ఏడాదికి 25 లక్షల రూపాయలు మ్యాచ్ ఫీజుగా సంపాదించుకొనే అవకాశం కల్పించింది.

దేశవాళీ క్రికెట్ మ్యాచ్ ఏదైనా ఆడిన ఆటగాడికి రోజుకు 50వేల రూపాయల చొప్పున చెల్లించనున్నారు.

మహిళా క్రికెటర్లకు సైతం పురుషులతో సమానంగా బీసీసీఐ మ్యాచ్ ఫీజులు చెల్లించడం విశేషం. ఏదిఏమైనా రోజుకు 3 రూపాయలు బేటాగా రంజీ క్రికెటర్లు తీసుకొనే రోజులు పోయి..రోజుకు 50వేల రూపాయలు చొప్పున అందుకొనే స్థాయికి భారత క్రికెట్ ఎదగడం వెనుక ఆటగాళ్లతో పాటు బీసీసీఐ కృషి, ప్రపంచీకరణ పాత్ర అంతాఇంతాకాదు. ప్రతిభ ఉంటే చాలు...క్రికెట్ ద్వారా కోటీశ్వరులు కావడం ఏమాత్రం కష్టంకాదు.

First Published:  24 Aug 2024 5:22 PM IST
Next Story