Telugu Global
Sports

హైదరాబాద్ రాజీవ్ స్టేడియానికి విద్యుత్ పునరుద్దరణ!

హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం పరువు దక్కింది. విద్యుత్ పునరుద్దరణతో సన్ రైజర్స్- చెన్నై సూపర్ కింగ్స్ జట్ల ఐపీఎల్ మ్యాచ్ నిర్వహణకు రంగం సిద్ధమయ్యింది.

హైదరాబాద్ రాజీవ్ స్టేడియానికి విద్యుత్ పునరుద్దరణ!
X

హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం పరువు దక్కింది. విద్యుత్ పునరుద్దరణతో సన్ రైజర్స్- చెన్నై సూపర్ కింగ్స్ జట్ల ఐపీఎల్ మ్యాచ్ నిర్వహణకు రంగం సిద్ధమయ్యింది.

ఆర్థిక అవకతవకలకు, వివాదాలకు చిరునామాగా నిలిచిన హైదరాబాద్ క్రికెట్ సంఘానికి చావుతప్పి కన్నులొట్టబోయింది. తెలంగాణా విద్యుత్ శాఖకు 3 కోట్ల రూపాయల కరెంటు బిల్లు బకాయి ఉండడంతో నగరం నడిబొడ్డునే ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియానికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో ఐపీఎల్ -2024 సీజన్ పోరులో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్- హైదరాబాద్ సన్ రైజర్స్ జట్ల నడుమ శుక్రవారం జరగాల్సిన మ్యాచ్ నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది.

కనికరించిన విద్యుత్ శాఖ....

లక్షకాదు..వంద లక్షలు కాదు..ఏకంగా 3 కోట్ల రూపాయల విద్యుత్ బిల్లు చెల్లించకుండా తాత్సారం చేస్తున్న హైదరాబాద్ క్రికెట్ సంఘానికి షాక్ ఇవ్వాలని తెలంగాణా విద్యుత్ శాఖ నిర్ణయించింది. ప్రస్తుత సీజన్లో సన రైజర్స్ కు హోం గ్రౌండ్ హోదాలో హైదరాబాద్ రాజీవ్ స్టేడియం ఐదుమ్యాచ్ లకు ఆతిథ్యమివ్వాల్సి ఉంది. ఇప్పటికే ముంబైతో జరిగిన మ్యాచ్ ను విజయవంతంగా నిర్వహించింది. అయితే..శుక్రవారం సన్ రైజర్స్ హైదరాబాద్- చెన్నై సూపర్ కింగ్స్ జట్ల నడుమ జరగాల్సిన మ్యాచ్ కు ఒక్కరోజు ముందు నుంచి స్టేడియానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఫ్లడ్ లైట్ల వెలుగులో ప్రాక్టీస చేసే అవకాశం రెండుజట్లకూ లేకుండాపోయింది.

అసలు మ్యాచ్ జరుగుతుందా? లేదా అన్న సందేహం నెలకొంది.

అయితే.. హైదరాబాద్ క్రికెట్ సంఘం పెద్దల ప్రయత్నాలు, విజ్ఞప్తి మేరకు విద్యుత్ శాఖ మనసు మార్చుకొంది. విద్యుత్ ను పునరుద్దరించడంతో క్రికెట్ అభిమానులు మాత్రమే కాదు..నిర్వాహక సంఘం పెద్దలు సైతం ఊపిరి పీల్చుకోగలిగారు.

క్రికెట్ సంఘానికి సర్ చార్జి మోత....

విద్యుత్ శాఖకు హైదరాబాద్ క్రికెట్ సంఘం బకాయి పడిన 3 కోట్ల రూపాయల మొత్తంలో కోటీ 60 లక్షల రూపాయ వరకూ సర్ చార్జి ఉంది. తమకు సర్ చార్జి నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ హైదరాబాద్ క్రికెట్ సంఘం వేడుకొంటోంది. అయితే..సర్ చార్జి మొత్తంతో సహా బకాయి 3 కోట్ల రూపాయలు కట్టితీరాల్సిందేనంటూ విద్యుత్ శాఖ తేల్చి చెప్పింది.

అయితే..ప్రస్తుత సీజన్లో హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ మరో నాలుగుమ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈరోజు జరిగే కీలక పోరులో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో మాజీ చాంపియన్ సన్ రైజర్స్ తలపడనుంది.

రాత్రి 7-30కి ప్రారంభంకానున్న ఈ మ్యాచ్ లో విజయమే లక్ష్యంగా రెండుజట్లూ బరిలోకి దిగుతున్నాయి. సన్ రైజర్స్ కు పాట్ కమిన్స్, సూపర్ కింగ్స్ కు రుతురాజ్ గయక్వాడ్ నాయకత్వం వహిస్తున్నారు.

హైదరాబాద్ వేదికగా కొద్దిరోజుల క్రితం ముగిసిన ముంబై- సన్ రైజర్స్ జట్ల మ్యాచ్ లో రికార్డుల మోత మోగిన సంగతి తెలిసినదే. 35వేల మంది అభిమానులు సైతం ఆ మ్యాచ్ కు హాజరయ్యారు.

బీసీసీఐ నుంచి భారీగా నిధులు అందుకొంటున్న హైదరాబాద్ క్రికెట్ సంఘం అస్తవ్యస్త విధానాలు, అవినీతి, అక్రమాల కారణంగా విద్యుత్ శాఖకు సైతం బకాయి పడిపోయ పరిస్థితికి దిగజారిపోడాన్ని అభిమానులు తప్పుపడుతున్నారు.

First Published:  5 April 2024 3:34 PM IST
Next Story