Telugu Global
Sports

భారత్- ఇంగ్లండ్ జట్లకు నేటినుంచే హైదరాబాద్ ' టెస్ట్ ' !

ఆరేళ్ల తరువాత హైదరాబాద్ గడ్డపై తొలిటెస్టుమ్యాచ్ కు రంగం సిద్ధమయ్యింది. రాజీవ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా నేటినుంచి 5రోజులపాటు జరిగే పోరులో రెండోర్యాంకర్ భారత్‌, మూడోర్యాంకర్ ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.

భారత్- ఇంగ్లండ్ జట్లకు నేటినుంచే హైదరాబాద్  టెస్ట్  !
X

ఆరేళ్ల తరువాత హైదరాబాద్ గడ్డపై తొలిటెస్టుమ్యాచ్ కు రంగం సిద్ధమయ్యింది. రాజీవ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా నేటినుంచి 5రోజులపాటు జరిగే పోరులో రెండోర్యాంకర్ భారత్‌, మూడోర్యాంకర్ ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.

ఐసీసీ టెస్టు (2023-2025 ) లీగ్ లో భాగంగా ఈరోజు నుంచి నెలరోజులపాటు జరిగే ఓ కీలక సిరీస్ కు భారత్ ఆతిథ్యమిస్తోంది. బెన్ స్టోక్స్ నాయకత్వంలోని ఇంగ్లండ్ నేలవిడిచి సాము చేయటానికి సిద్ధమయ్యింది. భారత్ ను భారతగడ్డపై చిత్తు చేయాలన్న పట్టుదలతో ..16 మంది సభ్యులజట్టుతో సవాలు విసురుతోంది.

సొంతగడ్డపై తిరుగులేని భారత్...

స్వదేశీ స్పిన్ పిచ్ లపైన గత 16 సిరీస్ లు గా అజేయంగా నిలుస్తూ వస్తున్న ఐసీసీ టెస్టు లీగ్ రన్నరప్ హాట్ ఫేవరెట్ గా ప్రస్తుత ఐదుమ్యాచ్ ల సిరీస్ లో పోటీపడుతోంది.

డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు అనుభవజ్ఞులు, యువత మేళవింపుతో కూడిన జట్టుతో ఇంగ్లండ్ పని పట్టడానికి ఎదురుచూస్తోంది.

సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, రన్ మెషీన్ విరాట్ కొహ్లీ లాంటి ఇద్దరు కీలక ఆటగాళ్లు లేకుండానే సిరీస్ లోని మొదటి రెండుటెస్టులకు భారత్ కసరత్తు చేసింది.

ఇటు'స్పిన్ బాల్'...అటు 'బజ్ బాల్'...!

సాంప్రదాయ టెస్టు క్రికెట్లో ఒక్కోజట్టు ఒక్కో వ్యూహంతో టైటిల్ వేటను కొనసాగిస్తోంది. మూడోర్యాంకర్ ఇంగ్లండ్ జట్టు దూకుడు, బాదుడే ప్రధానంగా 'బజ్ బాల్' వ్యూహంతో ప్రత్యర్థిజట్లను చిత్తు చేస్తుంటే...స్వదేశీగడ్డపై జరిగే స్పిన్ పిచ్ లపైన మాత్రం రెండోర్యాంకర్ భారత్ 'స్పిన్ బాల్' వ్యూహంతో అజేయంగా నిలుస్తూ వస్తోంది.

2011 సిరీస్ లో చివరిసారిగా ఇంగ్లండ్ చేతిలో పరాజయం పొందిన భారత్ ఆ తర్వాత నుంచి సొంతగడ్డపై వరుసగా 14 పూర్తి సిరీస్ లు, బంగ్లాదేశ్, అప్ఘనిస్థాన్ జట్లతో సింగిల్ మ్యాచ్ టెస్టు సిరీస్ లు కైవసం చేసుకోడమే కాదు..ఇంట్లో పులిగా చాటుకొంది.

రెండోడౌన్లో కెఎల్ రాహుల్...

భారత టెస్టు జట్టులో కీలక రెండోడౌన్ అంటే రన్ మెషీన్ విరాట్ కొహ్లీ పేరు మాత్రమే గుర్తుకు వస్తుంది. అయితే..100 టెస్టుల మొనగాడు విరాట్ వ్యక్తిగత కారణాలతో ప్రస్తుత సిరీస్ లోని మొదటి రెండుటెస్టులకు అందుబాటులో లేకపోడంతో..రెండోడౌన్ స్థానాన్ని కెఎల్ రాహుల్ తో భర్తీ చేయాలని టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయించింది.

ప్రస్తుత ఈ సిరీస్ లో రాహుల్ కేవలం స్పెషలిస్ట్ బ్యాటర్ గా మాత్రమే బాధ్యతలు నిర్వర్తిస్తాడని చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఇప్పటికే ప్రకటించడంతో సస్పెన్స్ వీడిపోయింది.

జట్టులోని ఇద్దరు స్పెషలిస్ట్ వికెట్ కీపర్ బ్యాటర్లలో..ఆంధ్ర ఆటగాడు కెఎస్ భరత్ కు తుదిజట్టులో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. యువవికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ మాత్రం టెస్టు అరంగేట్రం కోసం ఒకటి లేదా రెండుమ్యాచ్ లపాటు వేచిచూడక తప్పదు.

అక్షర్ పటేల్ తో కుల్దీప్ యాదవ్ పోటీ...

ప్రస్తుత సిరీస్ లోని తొలిటెస్టు నుంచే ఇంగ్లండ్ నలుగురు స్పిన్నర్లను తుదిజట్టులోకి తీసుకొంటే..ఆతిథ్య భారత్ మాత్రం ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్ల వ్యూహంతో పోటీకి దిగుతోంది.

ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, లెఫ్టామ్ స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాలకు తుదిజట్టులో చోటు ఇప్పటికే ఖాయమైపోయింది. మూడో స్పిన్నర్ స్థానం కోసం అక్షర్ పటేల్, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పోటీపడుతున్నారు.

ఫాస్ట్ బౌలర్ల జోడీ జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ సైతం భారత బౌలింగ్ ఎటాక్ కు కీలకంగా మారారు.

యువఆటగాళ్ల పైనే భారత్...

అపారఅనుభవం కలిగిన విరాట్ కొహ్లీ అందుబాటులో లేకపోడంతో ఆ లోటును పూడ్చాల్సిన బాధ్యత యువబ్యాటర్లు యశస్వి జైశ్వాల్, శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ లపైన పడింది.

సీనియర్ బ్యాటర్లుగా రోహిత్ , రాహుల్, జడేజా, అశ్విన్ మరింత బాధ్యతతో బ్యాటింగ్ చేయకతప్పని పరిస్థితి ఏర్పడింది.

స్పిన్ ను స్పిన్ తోనే......

ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్ నాయకత్వంలోని ఇంగ్లండ్ స్పిన్ ను స్పిన్ వ్యూహంతోనే తిప్పికొట్టడానికి సిద్ధమయ్యింది. తుదిజట్టులో నలుగురు స్పిన్నర్లు, సింగిల్ ఫాస్ట్ బౌలర్ తో సమరానికి సై అంటోంది.

లెఫ్టామ్ స్పిన్నర్ల జోడీ జాక్ లీచ్, టామ్ హార్ట్ లీ, లెగ్ స్పిన్నర్ రేహాన్ అహ్మద్ లతో పాటు జో రూట్ సైతం ఆఫ్ స్పిన్నర్ గా బౌలింగ్ కు దిగనున్నాడు.

భారత జాదూ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుత సిరీస్ లోనే 500 వికెట్ల మైలురాయిని చేరాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటి వరకూ ఆడిన టెస్టుల్లో 490 వికెట్లు పడగొట్టిన అశ్విన్ కు హైదరాబాద్ వేదికగా కళ్లు చెదిరే రికార్డే ఉంది. రండుసార్లు 5కు పైగా వికెట్లు పడగొట్టిన ఏకైక స్పిన్నర్ అశ్విన్ మాత్రమే. అంతేకాదు..ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ ను 11సార్లు పడగొట్టిన ఏకైక స్పిన్నర్ గా అశ్విన్ కు తిరుగులేని రికార్డే ఉంది.

పాఠశాల విద్యార్థులకు ఉచిత ప్రవేశం...

ఆరుసంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత హైదరాబాద్ వేదికగా జరుగనున్న ఈ టెస్ట్ మ్యాచ్ జరిగే ఐదురోజులూ..రోజుకు 5వేలమంది చొప్పున జంట నగరాలలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు మ్యాచ్ ను ఉచితంగా చూసే అవకాశం కల్పించాలని నిర్వాహక హైదరాబాద్ క్రికెట్ సంఘం నిర్ణయించింది. ముందస్తు అనుమతి తీసుకొని స్టేడియానికి తరలి వచ్చే విద్యార్థులకు ఆహారం, మంచినీరు ఉచితంగానే అందచేయనున్నారు.

టాస్ నెగ్గినజట్టు ముందుగా ఫీల్డింగ్ చేయటానికే మొగ్గుచూపే అవకాశం ఉంది. నేటినుంచి వరుసగా ఐదురోజులపాటు ప్రతిరోజు ఉదయం 9-30 గంటలకు టెస్ట్ మ్యాచ్

ప్రారంభంకానుంది. రోజుకు 90 ఓవర్ల చొప్పున మ్యాచ్ కొనసాగుతుంది.

First Published:  25 Jan 2024 9:36 AM IST
Next Story