Telugu Global
Sports

ఐపీఎల్ -17లో ఎగసి' పడిన' హైదరాబాద్ సన్ రైజర్స్!

ఐపీఎల్ -17వ సీజన్ విజేతగా నిలవాలన్న హైదరాబాద్ సన్ రైజర్స్ ఆశలు అడియాసలయ్యాయి. కోల్ కతా చేతిలో ఘోరపరాజయంతో రన్నరప్ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఐపీఎల్ -17లో ఎగసి పడిన హైదరాబాద్ సన్ రైజర్స్!
X

ఐపీఎల్ -17వ సీజన్ విజేతగా నిలవాలన్న హైదరాబాద్ సన్ రైజర్స్ ఆశలు అడియాసలయ్యాయి. కోల్ కతా చేతిలో ఘోరపరాజయంతో రన్నరప్ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది...

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను గత ఎనిమిదివారాలుగా ఓలలాడిస్తూ వచ్చిన ఐపీఎల్ -17వ సీజన్ షోకి చెన్నై చెపాక్ స్టేడియంలో తెరపడింది. ప్రస్తుత సీజన్ లోని రెండు అత్యుత్తమ జట్ల నడుమ జరిగిన ఈ టైటిల్ పోరు అత్యంత చెత్తగా ముగిసిన ఫైనల్స్ గా రికార్డుల కెక్కింది.

ఏకపక్షంగా టైటిల్ ఫైట్...

ఐపీఎల్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో టైటిల్ సమరం అంటే ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ హోరాహోరీగా సాగుతుందని అందరూ భావించడం, టీవీల ముందు గుమికూడటం సహజమే. అయితే ప్రస్తుత 17వ సీజన్ ఫైనల్స్ మ్యాచ్ మాత్రం అత్యంత అసహజంగా, ఏకపక్షంగా ముగిసింది.

రెండుసార్లు చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ కేవలం 10.3 ఓవర్లలోనే 114 పరుగుల విజయలక్ష్యాన్ని చేరుకోడం ద్వారా 8 వికెట్ల విజయంతో విజేతగా నిలిచింది. గత 17 సీజన్లలో మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని కోల్ కతా సొంతం చేసుకొంది.

గౌతం గంభీర్ అరుదైన రికార్డు...

గతంలో గౌతం గంభీర్ కెప్టెన్ గా రెండుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన కోల్ కతా జట్టు దశాబ్దకాలం విరామం తరువాత గంభీర్ మెంటార్ గా మరో సారి ట్రోఫీ సాధించింది.

కెప్టెన్ గాను, మెంటార్ గాను కోల్ కతాను ఐపీఎల్ విన్నర్ గా నిలిపిన అరుదైన ఘనతను గంభీర్ దక్కించుకొన్నాడు.

అంతేకాదు..ట్రోఫీతో పాటు విజేతకు ఇచ్చే 20 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని సైతం కోల్ కతా అందుకొంది. కోల్ కతా నైట్ రైడర్స్ స్పిన్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్

మూడోసారి సీజన్ అత్యుత్తమ ఐపీఎల్ ప్లేయర్ అవార్డుకు ఎంపికయ్యాడు.

లీగ్ దశ నుంచి ప్లే-ఆఫ్ రౌండ్ వరకూ ఆడిన మ్యాచ్ ల్లో సునీల్ 488 పరుగులు సాధించడంతో పాటు 17 వికెట్లు పడగొట్టాడు. కోల్ కతా విజేతగా నిలవడంలో ప్రధానపాత్ర వహించాడు.

2012, 2018 సీజన్లలో సైతం సునీల్ మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ అవార్డులు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో ఈ గౌరవాన్ని మూడుసార్లు పొందిన ఏకైక క్రికెటర్ గౌతం గంభీర్ మాత్రమే.

స్పీడ్ గన్ స్టార్ రికార్డు...

ఐపీఎల్ మెగా వేలంలో అత్యధిక ధర పలికిన విదేశీ క్రికెటర్ గా రికార్డు సృష్టించిన కోల్ కతా మెరుపు ఫాస్ట్ బౌలర్ మిషెల్ స్టార్క్ స్థాయికి తగ్గట్టుగా బౌలింగ్ ప్రదర్శన చేశాడు.

తాను తీసుకొన్న ప్రతిరూపాయికీ న్యాయం చేసి..కోల్ కతా ఫ్రాంచైజీని పైసా వసూల్ అనుకొనేలా చేశాడు.

ప్లే-ఆఫ్ రౌండ్లలో రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొన్న తొలి, ఏకైక క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు.

అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫైయర్ -1లో 3 వికెట్లు, చెన్నై వేదికగా జరిగిన ఫైనల్స్ లో 3 వికెట్లు పడగొట్టడం ద్వారా...తన జట్టుకు రెండుకు రెండుసార్లు.. సన్ రైజర్స్ ప్రత్యర్థిగా 8 వికెట్ల విజయాలు అందించడంలో ప్రధాన పాత్ర వహించాడు.

పాలపొంగులా చల్లారిన సన్ రైజర్స్...

లీగ్ దశలో 277, 287 స్కోర్లతో రికార్డుల మోత మోగించిన హైదరాబాద్ సన్ రైజర్స్ టైటిల్ పోరులో కేవలం 113 పరుగులకే కుప్పకూలడం అభిమానులను తీవ్రనిరాశకు గురి చేస్తే..క్రికెట్ పండితుల్ని ముక్కుమీద వేలు వేసుకొనేలా చేసింది.

వీరబాదుడు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, యువబ్యాటర్ నితీశ్ రెడ్డి, వికెట్ కీపర్ బ్యాటర్ క్లాసెన్ కీలక ఫైనల్లో చేష్టలుడిగి పోయారు. చివరకు హైదరాబాద్ బ్యాటింగ్ పాలపొంగులా చల్లారిపోక తప్పలేదు.

కేవలం పవర్ ఫుల్ బ్యాటింగ్ తో పలు సరికొత్త రికార్డులతో ఫైనల్స్ వరకూ వచ్చిన హైదరాబాద్...అదే బ్యాటింగ్ లో పసలేని తనంతో ఘోరపరాజయం మూటగట్టు కొంది.

ఐపీఎల్ చరిత్రలోనే ..టైటిల్ పోరులో ఘోరంగా విఫలమైన, అత్యంత చెత్త పరాజయం మూటగట్టుకొన్న జట్టుగా మిగిలిపోయింది.

రన్నరప్ ట్రోఫీతో పాటు 12 కోట్ల 50 లక్షల రూపాయలతో హైదరాబాద్ సన్ రైజర్స్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మూడోస్థానంలో నిలిచిన మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ కు 7 కోట్ల రూపాయలు, నాలుగోస్థానం సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు 6 కోట్ల 50 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ దక్కింది.

విరాట్ కొహ్లీకే ఆరెంజ్ క్యాప్....

అత్యధిక పరుగులు సాధించిన అత్యుత్తమ బ్యాటర్ కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ విరాట్ కొహ్లీ మరోసారి అందుకొన్నాడు. 700కు పైగా పరుగులు సాధించిన విరాట్ కు ఆరెంజ్ క్యాప్ తో పాటు 10 లక్షల రూపాయలు నజరానాగా అందింది.

అత్యధికంగా 24 వికెట్లు పడగొట్టడం ద్వారా పంజాబ్ కింగ్స్ పేసర్ హర్షల్ పటేల్ 10 లక్షల రూపాయల నగదుతో పాటు పర్పుల్ క్యాప్ అందుకొన్నాడు.

అత్యుత్తమ యువఆటగాడికి ఇచ్చే ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును సన్ రైజర్స్ యువబ్యాటర్ నితీశ్ రెడ్డి సాధించాడు. అత్యధికంగా 42 సిక్సర్లు బాదడం ద్వారా సన్ రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ..10 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ దక్కించుకొన్నాడు.

సూపర్ స్ట్ర్రయికర్ అవార్డును జేక్ ఫ్రేజర్- మెక్ గుర్క్, అత్యుత్తమ క్యాచ్ అందుకొన్న ఫీల్డర్ అవార్డును రమణ్ దీప్ సింగ్ కైవసం చేసుకొన్నాడు.

హైదరాబాద్ కు అత్యుత్తమ గ్రౌండ్, పిచ్ అవార్డు...

హైదరాబాద్ సన్ రైజర్స్ హోంగ్రౌండ్..రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం మరోసారి అత్యుత్తమ గ్రౌండ్,పిచ్ అవార్డుకు ఎంపికయ్యింది. బ్యాటింగ్ స్వర్గధామంగా పేరుపొందిన రాజీవ్ స్టేడియానికి బీసీసీఐ 50 లక్షల రూపాయల ప్రత్యేక అవార్డు ప్రకటించింది.

మొత్తం మీద..2024 -ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ప్రారంభానికి కొద్దిరోజుల ముందే ముగిసిన ఐపీఎల్-17 వ సీజన్ కు లీగ్ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉండితీరుతుంది.

First Published:  27 May 2024 7:20 PM IST
Next Story