Telugu Global
Sports

ఐపీఎల్ ప్లే-ఆఫ్ రౌండ్లో హైదరాబాద్ సన్ రైజర్స్!

ఐపీఎల్ 17వ సీజన్ ప్లే-ఆఫ్ రౌండ్ చేరిన మూడోజట్టుగా మాజీ చాంపియన్ హైదరాబాద్ సన్ రైజర్స్ నిలిచింది. ఆఖరి బెర్త్ కోసం చెన్నైతో బెంగళూరు అమీతుమీ తేల్చుకోనుంది.

ఐపీఎల్ ప్లే-ఆఫ్ రౌండ్లో హైదరాబాద్ సన్ రైజర్స్!
X

ఐపీఎల్ 17వ సీజన్ ప్లే-ఆఫ్ రౌండ్ చేరిన మూడోజట్టుగా మాజీ చాంపియన్ హైదరాబాద్ సన్ రైజర్స్ నిలిచింది. ఆఖరి బెర్త్ కోసం చెన్నైతో బెంగళూరు అమీతుమీ తేల్చుకోనుంది.

ఐపీఎల్ 17వ సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ సమరం సస్పెన్స్ థ్రిల్లర్లా సాగుతోంది. ఆఖరి రౌండ్ మ్యాచ్ ల ఫలితాలు మాత్రమే కాదు..వరుణదేవుడు సైతం జట్ల తలరాతను మార్చేస్తున్నాడు.

హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్- సన్ రైజర్స్ జట్ల మధ్య జరగాల్సిన 13వ రౌండ్ మ్యాచ్ వానదెబ్బతో రద్దు కావడంతో..

రెండుజట్లు చెరో పాయింటు పంచుకోడంతో...ప్లే-ఆఫ్ రేస్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ నిష్క్ర్రమించక తప్పలేదు. అయితే..లీగ్ దశ ముగియటానికి మరో రౌండ్ పోరు మిగిలి ఉండగానే మాజీ చాంపియన్ సన్ రైజర్స్ హైదరాబాద్ 15 పాయింట్లతో లీగ్ టేబుల్ 3వ స్థానంలో నిలవడం ద్వారా ప్లే-ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకోగలిగింది.

3వ జట్టుగా హైదరాబాద్ సన్ రైజర్స్...

ప్రస్తుత సీజన్ ఐపీఎల్ ప్లే-ఆఫ్ తొలి బెర్త్ ను టేబుల్ టాపర్ గా కోల్ కతా నైట్ రైడర్స్ కైవసం చేసుకొంటే..మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ రెండో బెర్త్ ను దక్కించుకొంది.

అయితే మిగిలిన రెండు బెర్త్ ల కోసం ఐదుజట్లు పోటీపడితే..వానదెబ్బతో ఢిల్లీ క్యాపిటల్స్ ఆశలు అడియాసలుగా మిగిలిపోయాయి. కోల్ కతా 13 రౌండ్లలో 9 విజయాలు, 3 పరాజయాలతో 19 పాయింట్లు సాధించడం ద్వారా నంబర్ వన్ జట్టుగా నిలిచింది.

రాజస్థాన్ రాయల్స్ 13 రౌండ్లలో 8 విజయాలు, 5 పరాజయాలతో 16 పాయింట్లతో రెండోస్థానం, సన్ రైజర్స్ 13 రౌండ్లలో 7 విజయాలు, 5 పరాజయాలతో సహా 15 పాయింట్లు సాధించడం ద్వారా 3వ స్థానం సాధించింది.

ఆఖరి బెర్త్ కోసం దిగ్గజాల సమరం...

ప్లే-ఆఫ్ రౌండ్లోని మొదటి మూడు బెర్త్ లను కోల్ కతా, జైపూర్, హైదరాబాద్ జట్లు ఖాయం చేసుకోడంతో ...ఆఖరి బెర్త్ రేస్ లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు మాత్రమే మిగిలాయి.

చెన్నై 13 రౌండ్లలో 7 విజయాలు, 6 పరాజయాలతో 14 పాయింట్లతో లీగ్ టేబుల్ 4వ స్థానంలోనూ, రాయల్ చాలెంజర్స్ 13 రౌండ్లలో 6 విజయాలు 7 పరాజయాలతో సహా 12 పాయింట్లు సాధించడం ద్వారా 6వ స్థానంలోనూ కొనసాగుతున్నాయి.

బెంగళూరు నెగ్గినా బెర్త్ కష్టమే...

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగాల్సిన ఆఖరిరౌండ్ మ్యాచ్ కు వానముప్పు పొంచి ఉంది. ఒకవేళ వరుణదేవుడు కరుణించి..ఓవర్లను కుదించి మ్యాచ్ ను నిర్వహించినా...ఆతిథ్య బెంగళూరు జట్టు విజయం సాధించినా 14 పాయింట్లతో సమఉజ్జీగా నిలువగలిగినా...నెట్ రన్ రేట్ లో వెనుకబడిపోయిన కారణంగా ప్లే-ఆఫ్ రౌండ్ చేరడం అంతతేలికగా కనిపించడం లేదు.

నెట్ రన్ రేట్ లోనూ చెన్నైని అధిగమించాలంటే బెంగళూరుజట్టు తన ఆఖరి రౌండ్ పోరులో చెన్నైపై 18 పరుగుల తేడాతో నెగ్గితీరాల్సి ఉంది. ఒకవేళ చెన్నైజట్టు ముందుగా బ్యాటింగ్ కు దిగి 200 పరుగుల స్కోరు సాధించితే..చేజింగ్ కు దిగిన బెంగళూరు జట్టు విజయలక్ష్యాన్ని 18.1 ఓవర్లలోనే సాధించాల్సి ఉంది.

రాజస్థాన్ రాయల్స్ కు రెండోస్థానం దక్కేనా?

ప్రస్తుతం లీగ్ టేబుల్ రెండోస్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్ ను గత ఐదుమ్యాచ్ ల్లో నాలుగు పరాజయాలు గట్టి దెబ్బే తీశాయి. టేబుల్ టాపర్ కోల్ కతాతో జరిగే ఆఖరిరౌండ్ పోరులో రాజస్థాన్ నెగ్గితేనే ప్రస్తుత రెండోస్థానాన్ని నిలుపుకోగలుగుతుంది. లేదంటే మూడోస్థానానికి పడిపోడం ద్వారా ఎలిమినేటర్ రౌండ్లో తలపడే ప్రమాదం లేకపోలేదు.

ఆఖరి రౌండ్లో సైతం రాజస్థాన్ ఓడితే..లీగ్ టేబుల్ రెండోస్థానాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకొనే అవకాశం ఉంది. తన ఆఖరి రౌండ్ పోరులో పంజాబ్ కింగ్స్ తో సన్ రైజర్స్ తలపడాల్సి ఉంది.

ప్లే-ఆఫ్ రౌండ్ చేరే అవకాశాలను లక్నో సూపర్ జెయింట్స్..-0.787. నెట్ రన్ రేట్ కారణంగా చేజార్చుకోవాల్సి వచ్చింది. ఆదివారం జరిగే ఆఖరి ( 14వ ) రౌండ్ మ్యాచ్ ల్లో పంజాబ్ తో హైదరాబాద్, కోల్ కతాతో జైపూర్ జట్లు తలపడనున్నాయి.

శనివారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఆఖరిరౌండ్ పోరులో బెంగళూరుతో చెన్నై పోటీపడనుంది. భారీవర్షాల కారణంగా బెంగళూరు తడిసి ముద్దకావడంతో.. మ్యాచ్ ఎంతవరకూ జరుగుతుందన్నది అనుమానమే.

ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఈ రోజు రాత్రి 7-30కి జరిగే 14వ రౌండ్ పోరులో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఢీ కొంటాయి.

లక్నో 13 రౌండ్లలో 6 విజయాలు, 7 పరాజయాలతో 12 పాయింట్లతో లీగ్ టేబుల్ 7వ స్థానంలో ఉంటే..ఐదుసార్లు విజేత ముంబై 13 రౌండ్లలో 4 విజయాలు, 9 పరాజయాలతో సహా 8 పాయింట్లు మాత్రమే సాధించి అట్టడుగుకు పడిపోయింది.

First Published:  17 May 2024 5:15 PM IST
Next Story