Telugu Global
Sports

అరుదైన టెస్టు క్రికెట్ వేదిక హైదరాబాద్!

భారత క్రికెట్లో ...రెండుటెస్టు వేదికలున్న అతికొద్ది నగరాలలో హైదరాబాద్ ఒకటి. గొప్ప చరిత్ర కలిగిన అరుదైన భారత టెస్టు వేదికల్లో ఒకటైన హైదరాబాద్ ఘనత అంతాఇంతా కాదు.

అరుదైన టెస్టు క్రికెట్ వేదిక హైదరాబాద్!
X

భారత క్రికెట్లో ...రెండుటెస్టు వేదికలున్న అతికొద్ది నగరాలలో హైదరాబాద్ ఒకటి. గొప్ప చరిత్ర కలిగిన అరుదైన భారత టెస్టు వేదికల్లో ఒకటైన హైదరాబాద్ ఘనత అంతాఇంతా కాదు.

తెలుగు రాష్ట్ర్రాల సౌభాగ్యనగరం హైదరాబాద్ అంటే ఇరానీ చాయ్, బిర్యానీ మాత్రమే కాదు...గొప్ప చరిత్ర కలిగిన క్రికెట్ కూడా. పెద్దమనుషుల క్రీడ క్రికెట్ కే సొగసును, దర్జాను, హుందా తన్నాన్ని, కళాత్మకతను తెచ్చిన మన్సూర్ అలీఖాన్ పటౌడీ, ఎంఎల్ జైసింహా, మణికట్టు మాంత్రికులు మహ్మద్ అజరుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్ లాంటి ఎందరో విలక్షణ, సొగసరి క్రికెటర్లను ప్రపంచానికి అందించిన ఘనత హైదరాబాద్ కు మాత్రమే సొంతం.

అప్పుడు ఎల్బీ స్టేడియం..ఇప్పుడు రాజీవ్ ఇంటర్నేషనల్ స్టేడియం...

క్రికెట్ క్రేజీ భారత్ లో రెండు అంతర్జాతీయ టెస్ట్ వేదికలున్న నగరాలలో ముంబై తర్వాత...హైదరాబాద్ మాత్రమే ప్రముఖంగా కనిపిస్తుంది. ముంబైలో బ్రబోర్న్ స్టేడియం, వాంఖెడీ స్టేడియాలు టెస్ట్ వేదికలుగా ఉంటే..హైదరాబాద్ లో లాల్ బహదూర్ స్టేడియం, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియాలు అంతర్జాతీయ టెస్ట్ వేదికలుగా ఉన్నాయి.

1955లో మొట్టమొదటి టెస్టుమ్యాచ్...

భారత గడ్డపై మొట్టమొదటి అధికారిక టెస్ట్ మ్యాచ్ కు 1933లో ముంబై నగరం ఆతిథ్యమిస్తే...హైదరాబాద్ నగరంలో మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ 1955లో ..లాల్ బహదూర్ స్టేడియం ( ఫతే మైదాన్ ) వేదికగా జరిగింది.

1955 నవంబర్ 19 నుంచి న్యూజిలాండ్ ప్రత్యర్థిగా జరిగిన మ్యాచ్ లో సెంచరీల మోత మోగింది. భారత ఆటగాళ్లు పాలీ ఉమ్రీగర్ 223 పరుగులు, విజయ్ మంజ్రేకర్ 118 పరుగులు, క్రిపాల్ సింగ్ 100 పరుగుల స్కోర్లతో తమజట్టుకు 498 పరుగుల భారీస్కోరు అందించారు.

సమాధానంగా న్యూజిలాండ్ 326 స్కోరు సాధించింది. గే 102 పరుగులతో ఫైటింగ్ సెంచరీ సాధించినా ..కివీస్ కు ఫాలోఆన్ తప్పలేదు.

రెండోఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ బ్రెట్ సట్ క్లిఫ్ 137 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

లాల్ బహదూర్ స్టేడియం వేదికగానే...చివరిసారిగా 1988లో నిర్వహించిన టెస్ట్ మ్యాచ్ లో సైతం...భారత్ ప్రత్యర్థిగా న్యూజిలాండ్ జట్టే నిలవటం విశేషం. రిచర్డ్ హాడ్లీ, ఇవాన్ చాట్ ఫీల్డ్ లాంటి స్వింగ్ బౌలింగ్ గ్రేట్లున్నా...ఈ టెస్టులో న్యూజిలాండ్ కు ..10 వికెట్ల పరాజయం తప్పలేదు.

మహ్మద్ అజరుద్దీన్ 81 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిస్తే...బౌలర్లలో అర్షద్ అయూబ్...రెండుఇన్నింగ్స్ లో కలసి ఏడు వికెట్లు పడగొట్టాడు.

ఆ తర్వాత...మరో టెస్ట్ మ్యాచ్ కోసం...హైదరాబాద్ నగరం...రెండుదశాబ్దాల కాలంపాటు ఎదురుచూడాల్సి వచ్చింది.

రాజీవ్ స్టేడియంలో 2010లో తొలిటెస్టు...

అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పుణ్యమా అంటూ హైదరాబాద్ క్రికెట్ సంఘం ఉప్పల్ లో సొంతంగా సకలహంగులతో కూడిన ఓ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించుకోగలిగింది.

బ్యాటింగ్ స్వర్గధామంగా పేరుపొందిన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో..మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ ను 2010 నవంబర్ 12 నుంచి 16 వరకూ...భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య నిర్వహించారు.డ్రాగా ముగిసిన ఈ మ్యాచ్ లో బ్రెండన్ మెకల్లమ్ 225 పరుగులతో డబుల్ సెంచరీ నమోదు చేశాడు.

భారత ఆటగాళ్లలో ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 96, మిడిలార్డర్ ఆటగాడు హర్భజన్ సింగ్ 111 పరుగులు సాధించారు. న్యూజిలాండ్ స్పిన్నర్ వెట్టోరీ 5 వికెట్లు పడగొడితే...రెండు ఇన్నింగ్స్ లోనూ కలసి...పేసర్ జహీర్ ఖాన్ ఏకంగా ఎనిమిది వికెట్లు సాధించాడు.

స్పిన్నర్ల అడ్డా..భారతవిజయాల గని....

హైదరాబాద్ రాజీవ్ స్టేడియం భారత విజయాల అడ్డాగా, స్పిన్ బౌలర్ల స్వర్గధామంగా పేరుతెచ్చుకొంది. 2013 బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో భాగంగా భారత్, ఆస్ట్రేలియాజట్ల టెస్ట్ కు సైతం హైదరాబాద్ రాజీవ్ స్టేడియం వేదికగా నిలిచింది.

2013 మార్చి 2 నుంచి 5 వరకూ జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ కు ఎదురేలేకపోయింది. కంగారూ టీమ్ తొలిఇన్నింగ్స్ లో 237, రెండోఇన్నింగ్స్ లో 131 పరుగులకు కుప్పకూలింది.

భారత ఓపెనర్ మురళీ విజయ్ 167, వన్ డౌన్ చతేశ్వర్ పూజారా 204 పరుగుల స్కోర్లతో పరుగుల పండుగ చేసుకొన్నారు.

భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 63 పరుగులిచ్చి 5 వికెట్లు, జడేజా 33 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి..తమజట్టుకు ఇన్నింగ్స్ 135 పరుగుల భారీవిజయం అందించారు.

మొత్తం మీద....హైదరాబాద్ వేదికగా ముగిసిన ఐదుటెస్టుల్లో మూడు డబుల్ సెంచరీలు, మూడు సెంచరీలు నమోదు కాగా...ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లపైన భారత్ భారీవిజయాలు నమోదు చేయగలిగింది.

ఆ తర్వాత 2017లో బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టుమ్యాచ్ లో సైతం భారత్ కు ఎదురేలేకపోయింది. 2010 నుంచి 2018 వరకూ హైదరాబాద్ రాజీవ్ స్టేడియం వేదికగా జరిగిన మొత్తం ఐదుటెస్టుల్లో భారత్ 4 విజయాలు సాధించింది.

ఈనాటి క్రికెట్ బంధం ఆనాటిది.....

ఇంగ్లండ్- భారతజట్ల క్రికెట్ బంధం బ్రిటీష్ వలస పాలన కాలం నాటినుంచి బలంగా పెనవేసుకొంటూ వచ్చింది. ఇంగ్లండ్ దగ్గర క్రికెట్ ఓనమాలు దిద్దుకొన్న భారత్ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ నే శాసిస్తూ వస్తోంది.

1930 దశకంలో క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా తెలుగుతేజం కర్నల్ కఠారి కనకయ్యనాయుడు నాయకత్వంలో ఇంగ్లండ్ ప్రత్యర్థిగా తన తొలి అధికారిక టెస్టుమ్యాచ్ ఆడిన భారత్ ఆ తర్వాత నుంచి అంతైఇంతై అన్నట్లుగా ఎదుగుతూ వచ్చింది. టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ గా, రెండుసార్లు టెస్టు లీగ్ ఫైనల్స్ చేరి రన్నరప్ గా నిలిచిన ఏకైకజట్టుగా భారత్ అరుదైన ఘనతను సొంతం చేసుకోగలిగింది.

అయితే..భారత్ ప్రత్యర్థిగా గత తొమ్మిది దశాబ్దాల కాలంలో ఆడిన టెస్టులు, సిరీస్ ల్లో ఇంగ్లండ్ దే పైచేయిగా ఉంది. ఈ రెండుజట్లూ 2023 వరకూ ఆడిన మొత్తం 131 టెస్టుల్లో ఇంగ్లండ్ 51 విజయాలతో పైచేయి సాధించింది.

హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మాత్రం ఇంగ్లండ్ తొలిసారిగా టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఐదురోజులపాటు హోరాహోరీగా, స్పిన్నర్ల యుద్ధంలా సాగే ఈ పోరులో ఎన్ని సరికొత్త రికార్డులు నమోదవుతాయో మరి.!

First Published:  25 Jan 2024 9:30 AM IST
Next Story