అరే జస్సూ.. గల్లీ క్రికెట్ ఆడుతున్నావా ఏంటీ?
మూడు క్యాచ్‌లను డ్రాప్ చేసి కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహానికి గురైన యశస్వీ జైస్వాల్
క్రికెట్‌లో క్యాచ్‌లు ఇచ్చినప్పుడు పట్టుకోవాలి. వదిలేస్తే అవే మ్యాచ్‌లను మలుపుతిప్పుతాయి. ఇది అనేకసార్లు రుజువైంది. తాజాగా టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో సూర్యకుమార్ యాదవ్ ప్రపంచానికి చూపాడు. ఈ విషయాన్ని టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ మరిచిపోయినట్లు ఉన్నాడు.. ఒకటి కాదు.. ఏకంగా మూడు క్యాచ్‌లను డ్రాప్ చేసి కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహానికి గురయ్యాడు.
ఆసీస్ రెండో ఇన్నింగ్స్ మొదలైన తర్వాత ఉస్మాన్ ఖవాజా కోసం గల్లీలో జైస్వాల్‌ను ఫీల్డింగ్‌కు పెట్టారు. బూమ్రా వేసిన బంతిని ఖవాజా ప్లిక్ చేసి అటువైపు కొట్టాడు. కానీ జైస్వాల్ మాత్రం క్యాచ్‌ను నేలపాలు చేశాడు. అప్పటికి ఆసీస్ ఇన్నింగ్స్ మొదలై మూడు ఓవర్లే అయింది. ఆ క్యాచ్ డ్రాప్‌ను చూసి బూమ్రా అవాక్కయ్యాడు.
ఇక 40 ఓవర్లో ఆకాశ్‌దీప్ వేసిన లెంగ్త్ బాల్‌ను లబుషేన్ ఫేస్‌ను ఓపెన్ చేసి ఆడటానికి ప్రయత్నించగా గల్లీలోని జైస్వాల్ దిశగా వెళ్లింది. మళ్లీ చేజార్జాడు. అప్పటికి అతను హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేయలేదు. మ్యాచ్‌లో అతను 70 రన్స్ చేశాడు. ఇక ఆసీస్ కెప్టెన్ కమిన్స్ 20 రన్స్ వద్ద ఉండగా సిల్లీ పాయింట్‌లో ఇచ్చిన క్యాచ్‌ను కూడా చేజార్చాడు. వాస్తవానికి లబుషేన్ క్యాచ్ వదిలిన సమయంలోనే జైస్వాల్‌పై రోహిత్ అసహనం వ్యక్తం చేశాడు.
ఇక మొదటి ఇన్సింగ్స్‌లోనూ సిల్లీ పాయింట్‌లో ఫీల్డింగ్‌కు వచ్చిన జైస్వాల్ బ్యాటర్ స్మిత్ బాల్‌ను కొట్టకముందే గాల్లోకి ఎగరడాన్ని రోహిత్ గమనించాడు. 'అరే జస్సూ.. గల్లీ క్రికెట్ ఆడుతున్నావా ఏంటీ? బాల్ ఆడేదాకా కిందే ఉండు.. అంటూ సీరియస్‌గా రోహిత్ చెప్పాల్సి వచ్చింది. ఈ మాటలు స్టంప్ మైక్‌లో స్పష్టంగా వినిపించాయి.
మరోవైపు ఫాక్స్ క్రికెట్ వ్యాఖ్యత, ఆసీస్ మాజీ బ్యాటర్ మైక్ హస్సీ స్పందిస్తూ..' క్యాచ్‌లను ఎవరూ కావాలని వదిలేయరు. ఇప్పటికే జైస్వాల్ అందుకు సిగ్గుపడుతున్నాడు. ఈ సమయంలో అతడిని ఏమీ అనకుండా మౌనంగా ఉంటూ ప్రోత్సహించాలి. ముఖ్యంగా కెప్టెన్ ఈ పనిచేయాలి. ఎందుకంటే నాయకుడి స్పందన చాలా కీలకం. అతి జట్టును ఒత్తిడి నుంచి బైటపడేసేట్లు ఉండాలి కానీ.. ఇంకా అందులోకి నెట్టేట్లు కాదు అని జైస్వాల్‌కు మద్దతు ప్రకటించాడు.
బుమ్రా @200
భారత స్టార్ పేసర్ బుమ్రా మరో మైలురాయిని అందుకున్నాడు. వేగంగా 200 వికెట్లు సాధించిన భారత బౌలర్లలో జడేజాతో కలిసి ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచాడు. అశ్విన్ (33 టెస్టులు), ముందున్నాడు. టెస్టుల్లో 200 వికెట్లు తీసిన బౌలర్లలో 20 కన్నా తక్కువ సగటు ఉన్నది బుమ్రా (19.56) కు మాత్రమే