Telugu Global
Sports

శ్రీలంకతో సిరీస్ లో భారత్ కు జంట కెప్టెన్లు!

శ్రీలంకతో జరిగే వన్డే, టీ-20 సిరీస్ ల్లో పాల్గొనే భారతజట్లకు వేర్వేరు కెప్టెన్లు సారథ్యం వహించనున్నారు. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.

శ్రీలంకతో సిరీస్ లో భారత్ కు జంట కెప్టెన్లు!
X

శ్రీలంకతో జరిగే వన్డే, టీ-20 సిరీస్ ల్లో పాల్గొనే భారతజట్లకు వేర్వేరు కెప్టెన్లు సారథ్యం వహించనున్నారు. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.

గత కొద్దిమాసాలుగా ఏకనాయక సారథ్యంలో సాగిన భారత క్రికెట్ త్వరలో శ్రీలంకతో జరిగే వన్డే, టీ-20 సిరీస్ ల్లో మాత్రం వేర్వేరు కెప్టెన్లతో జోడు గుర్రాల స్వారీ చేయనుంది.

ఇటీవలే అమెరికా- వెస్టిండీస్ క్రికెట్ బోర్డుల సంయుక్త ఆతిథ్యంలో ముగిసిన 2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ వరకూ మూడు ఫార్మాట్లలోనూ భారత్ కు రోహిత్ శర్మే నాయకత్వం వహిస్తూ వచ్చాడు.

ప్రపంచకప్ విజయం తరువాత.....

టీ-20 ప్రపంచకప్ లో భారత్ విజేతగా నిలిచిన రోజునే కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు..గత ఆరుమాసాలుగా తీరికలేకుండా సిరీస్ వెంట సిరీస్ ఆడుతూ వచ్చిన ఈ సీనియర్ దిగ్గజాలు ఎక్కువరోజులపాటు విశ్రాంతి తీసుకొంటూ తమకుటుంబంతో గడపాలని నిర్ణయించారు.

శ్రీలంకతో జరిగే టీ-20, వన్డే సిరీస్ లకు సైతం తాము అందుబాటులో ఉండబోమని ప్రకటించడంతో...బీసీసీఐ ఎంపిక సంఘం రెండు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను ప్రకటించింది.

హార్థిక్ పాండ్యా చేతిలో టీ-20 జట్టు పగ్గాలు...

శ్రీలంకతో జరిగే తీన్మార్ టీ-20 సిరీస్ లో పాల్గొనే భారతజట్టుకు ప్రపంచ మాజీ నంబర్ వన్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా నాయకత్వం వహించనున్నాడు. భారత్ ప్రపంచకప్ గెలుచుకోడంలో తనవంతు పాత్ర నిర్వర్తించిన హార్థిక్ ఆల్ రౌండర్ గా స్థాయికి తగ్గట్టుగా రాణించాడు. 6 ఇన్నింగ్స్ లో 144 పరుగులతో 48.00 సగటుతో 151.57 స్ట్ర్రయిక్ రేట్ నమోదు చేశాడు. మీడియం పేసర్ గా 11 వికెట్లు పడగొట్టడంతో పాటు 7.64 ఎకానమీతో 17.36 సగటు సాధించాడు. ఏడాది విరామం తరువాత తిరిగి భారత టీ-20 కెప్టెన్ గా తన ఇన్నింగ్స్ ను కొనసాగించనున్నాడు.

వన్డేజట్టు కెప్టెన్ గా కెఎల్ రాహుల్...

టీ-20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోడంలో విఫలమైన వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్...శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ లో పాల్గొనే భారతజట్టుకు నాయకత్వం వహించనున్నాడు.

ప్రధాన కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోడంతో రాహుల్ కు వన్డే జట్టు నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పినట్లు బీసీసీఐ తెలిపింది. ప్రతిభావంతుడైన బ్యాటర్ గా పేరున్న రాహుల్ శ్రీలంకతో సిరీస్ లో వికెట్ కీపర్ గా కూడా వ్యవహరించనున్నాడు.

భారతజట్టు చీఫ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ నుంచి బాధ్యతలు స్వీకరించిన గౌతం గంభీర్ ప్రస్థానం శ్రీలంక సిరీస్ తోనే ప్రారంభంకానుంది. మరికొద్ది మాసాలలో జరుగనున్న

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ( మినీ ప్రపంచకప్ )కి సన్నాహాలలో భాగంగా భారతజట్టు శ్రీలంకతో సిరీస్ ఆడాలని నిర్ణయించింది.

2013 వన్డే మినీ ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత్ త్వరలో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ నాయకత్వంలో తన అదృష్టం పరీక్షించుకోనుంది.

First Published:  12 July 2024 10:26 AM IST
Next Story