క్రికెట్ అభిమానులకు రేపు పండగే పండగ
మధ్యాహ్నం వరకు పెర్త్ టెస్ట్ లో ఇండియా బ్యాటింగ్.. మధ్యాహ్నం నుంచి ఐపీఎల్ మెగా వేలం
క్రికెట్ అభిమానులు ఆదివారం పండగే పండగ. అసలే హాలిడే.. రోజంతా క్రికెట్ కనువిందు చేసేందుకు సిద్ధంగా ఉంది. బోర్డర్ గవస్కర్ ట్రోఫిలో మొదటి టెస్ట్ (పెర్త్) మూడో రోజు ఆట ఉదయం 7.50 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై భారత జట్టు స్పష్టమైన ఆదిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 150 పరుగుల స్వల్ప స్కోర్ కే ఆలౌట్ అయిన టీమిండియా ఆస్ట్రేలియాను 104 పరుగులకే ఆలౌట్ చేసి 46 పరుగుల లీడ్ సొంతం చేసుకుంది. మూడు సెషన్ లుగా 90 ఓవర్ల పాటు టీమిండియానే ఆదివారం మొత్తం బ్యాటింగ్ చేసే అవకాశముంది. సాయంత్రం 3.20 గంటల వరకు పెర్త్ టెస్ట్ కొనసాగుతుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఇండియా వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసి ఓవరాల్ గా ఆస్ట్రేలియాపై 218 పరుగుల ఆదిక్యంలో ఉంది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ 90, కేఎల్ రాహుల్ 62 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఐపీఎల్ మెగా వేలం ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ వేలంలో ఏ క్రికెటర్ ను ఫ్రాంచైజీలు ఎంత ధర చెల్లించి దక్కించుకునేందుకు పోటీ పడుతాయనే ఆసక్తి క్రికెట్ అభిమానులకు ఉంది. రాత్రి వరకు వేలం కొనసాగనుంది. వివిధ దేశాలకు చెందిన క్యాప్డ్, అన్ క్యాప్డ్ ప్లేయర్స్ 575 మంది వేలంలో భాగం కానున్నారు. పది జట్ల ఫ్రాంచైజీల యాజమాన్యాలు వేలంలో పాల్గొని క్రికెటర్లను దక్కించుకోనున్నాయి. టీమిండియా స్టార్ క్రికెటర్లు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, యజువేంద్ర చాహల్ సహా వివిధ దేశాలకు చెందిన లివింగ్ స్టోన్, డేవిడ్ మిల్లర్, జోస్ బట్లర్, కసిగో రబాడ, మిచెల్ స్టార్క్‌తో పాటు పలువురు క్రికెటర్లు వేలంలో పోటీ పడుతున్నారు. ఆదివారం, సోమవారం ఐపీఎల్ మెగా వేలం కొనసాగుతుంది.