37వ పడిలో భారత క్రికెట్ హిట్ మ్యాన్!
భారత క్రికెట్ త్రీ-ఇన్- వన్ ఓపెనర్, సూపర్ హిట్ కెప్ట్టెన్ రోహిత్ శర్మ ఈ రోజు తన 37వ పుట్టినరోజును ముంబై ఇండియన్స్ జట్టు సభ్యుల సమక్షంలో జరుపుకొన్నాడు.
భారత క్రికెట్ గ్రేటెస్ట్ ఓపెనర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకొన్న హిట్ మ్యాన్ కమ్ భారత కెప్టెన్ రోహిత్ శర్మ 37వ పడిలో ప్రవేశించాడు. ఐపీఎల్ మ్యాచ్ లు ఆడుతూనే తన పుట్టినరోజు వేడుకలను ముంబై జట్టు సభ్యులతో కలసి జరుపుకొన్నాడు.
భారత క్రికెట్ త్రీ-ఇన్- వన్ ఓపెనర్, సూపర్ హిట్ కెప్ట్టెన్ రోహిత్ శర్మ ఈ రోజు తన 37వ పుట్టినరోజును ముంబై ఇండియన్స్ జట్టు సభ్యుల సమక్షంలో జరుపుకొన్నాడు.
గత 15 సంవత్సరాలుగా భారత క్రికెట్ కు మూడు ఫార్మాట్లలోనూ అసమానసేవలు అందిస్తూ ప్రతిభావంతుడైన కెప్టెన్ స్థాయికి ఎదిగిన రోహిత్ తన కెరియర్ లో పలు అరుదైన రికార్డులు నెలకొల్పాడు.
2007 టీ-20 ప్రపంచకప్ తో.....
మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో 2007 ప్రారంభ టీ-20 ప్రపంచకప్ లో భారత్ విజేతగా నిలవడంలో ప్రధానపాత్ర వహించడం ద్వారా వెలుగులోకి వచ్చిన తెలుగుమూలాలున్న ముంబై కుర్రాడు రోహిత్ శర్మ..గత 17 సంవత్సరాల కాలంలో అంతైఇంతై అంతింతై అన్నట్లుగా ఎదిగిపోయాడు.
ఎటాకింగ్ ఓపెనర్ గా, గ్రౌండ్ నలుమూలలకూ సిక్సర్లు బాదడంలో మొనగాడిగా గుర్తింపు సంపాదించిన రోహిత్ ఆధునిక క్రికెట్ లో అత్యంత విజయవంతమైన ప్రపంచ మేటి ఓపెనర్లలో ఒకడిగా మన్ననలు పొందాడు.
వన్డే క్రికెట్లో తిరుగులేని ఓపెనర్....
50 ఓవర్ల వన్డే క్రికెట్లో అత్యంత భీకరమైన ఓపెనర్ గా రోహిత్ కు తిరుగులేని రికార్డులు ఉన్నాయి. 264 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరుతో 49.12 సగటుతో 10వేల పరుగులు సాధించిన తొలి ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రమే.
2023 వన్డే ప్రపంచకప్ ..రోహిత్ కెరియర్ లో మేలిమలుపుగా నిలిచిపోతుంది. భారతజట్టును రన్నరప్ గా నిలపడంతో పాటు ఓపెనర్ గా పలు కీలక ఇన్నింగ్స్ లో భారత టాపార్డర్ కే శిఖరంగా నిలిచాడు.
ఐపీఎల్ లో 6 టైటిల్స్ విజేత...
2008లో ప్రారంభమైన ఐపీఎల్ లో రెండు ఫ్రాంచైజీల జట్లలో తరపున ఆడిన రోహిత్ ఆరు చాంపియన్ ట్రోఫీలు సాధించాడు. 2009 సీజన్లో డెక్కన్ చార్జర్స్ తరపున, ఆ తరువాత ముంబై ఇండియన్స్ సారథిగా ఐపీఎల్ ట్రోఫీలు సాధించాడు.
తెలివైన కెప్టెన్ గా, సహఆటగాళ్లలో స్ఫూర్తిని నింపే సారథిగా కూడా రోహిత్ కు గుర్తింపు ఉంది.
వైట్ బాల్ క్రికెట్లో మాత్రమే కాదు...సాంప్రదాయ టెస్టు క్రికెట్లో సైతం రోహిత్ సత్తా చాటుకొన్నాడు. 4వేలకు పైగా పరుగులతో 45.46 సగటుతో విజయవంతమైన భారత టెస్టు ఓపెనర్లలో ఒకడిగా నిలిచాడు.
హిట్ మ్యాన్ కెరియర్ లో హైలైట్స్.....
1. 262 వన్డేలలో 10709 పరుగులు. 31 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలతో 49.12 సగటు.
2. వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెట్ దిగ్గజాల వరుసలో 15వ స్థానం.
3. వన్డే క్రికెట్లో అత్యధిక శతకాలు బాదిన భారత మూడో క్రికెటర్. విరాట్ కొహ్లీ 50, సచిన్ 49 శతకాలు
4. 59 టెస్టులు, 101 ఇన్నింగ్స్ లో 4137 పరుగులు. 45.46 సగటు, 57.05 స్ట్ర్రయిక్ రేటు.
5. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన నాలుగో బ్యాటర్ గా రోహిత్. 252 మ్యాచ్ లు, 247 ఇన్నింగ్స్ లో 29. 92 సగటు, 2 సెంచరీలు, 42 హాఫ్ సెంచరీలు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 109 నాటౌట్.
6. ఐపీఎల్ లో ఐదు ట్రోఫీలు సాధించిన తొలి కెప్టెన్ రోహిత్ శర్మ.
2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో భారత్ ను కెప్టెన్ గా రోహిత్ శర్మ మరోసారి విజేతగా నిలపాలని కోరుకొందాం.