Telugu Global
Sports

తెలుగు ఆటగాడికి గిన్నిస్ ప్రపంచ రికార్డు సర్టిఫికెట్!

భారత బ్యాడ్మింటన్ బుల్లెట్, ఆంధ్రప్రదేశ్ డబుల్స్ స్టార్ సాత్విక్ సాయిరాజ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. గిన్నిస్ ప్రపంచ రికార్డు పత్రాన్ని అందుకొన్న తొలి తెలుగు, భారత ఆటగాడిగా నిలిచాడు.

తెలుగు ఆటగాడికి గిన్నిస్ ప్రపంచ రికార్డు సర్టిఫికెట్!
X

భారత బ్యాడ్మింటన్ బుల్లెట్, ఆంధ్రప్రదేశ్ డబుల్స్ స్టార్ సాత్విక్ సాయిరాజ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. గిన్నిస్ ప్రపంచ రికార్డు పత్రాన్ని అందుకొన్న తొలి తెలుగు, భారత ఆటగాడిగా నిలిచాడు....

ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లో మేటి ఆటగాడు, తెలుగుతేజం సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. తన పవర్ హిట్టింగ్ తో గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించాడు.

గంటకు 500 కిలోమీటర్లు మించిన వేగంతో బ్యాడ్మింటన్ స్మాష్ కొట్టిన ఆటగాడిగా సాత్విక్ సాయిరాజ్ నిలిచాడు. ప్రపంచ పురుషుల డబుల్స్ లో చిరాగ్ శెట్టితో జంటగా సంచలన విజయాలు సాధిస్తూ ఇప్పటికే ఎన్నో బంగారు పతకాలు, టైటిల్స్ సాధించిన ఈ అమలాపురం కుర్రోడు గిన్నిస్ ప్రపంచ రికార్డుల ధృవపత్రాన్ని సైతం అందుకొన్నాడు.

అమ్మనాన్నలతో కలసి....

బ్యాడ్మింటన్ చరిత్రలో 500 కిలోమీటర్లు మించిన వేగంతో స్మాష్ కొట్టిన ఏకైక ఆటగాడిగా సాత్విక్ సాయిరాజ్ కొద్దిమాసాల క్రితమే ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

బ్యాడ్మింటన్ పురుషులు లేదా మహిళల సింగిల్స్ లో మాత్రమే కాదు..డబుల్స్ లో సైతం కొందరు క్రీడాకారులు గాల్లోకి ఎగిరి కొట్టే జంప్ షాట్లు లేదా స్మాష్ ల వేగం గంటకు 250 నుంచి 400 కిలోమీటర్ల వరకూ నమోదైన రికార్డులు ఉన్నాయి. అయితే ..ఆ వేగాన్ని 500 కిలోమీటర్లు దాటించిన ఘనతను మాత్రం భారత డబుల్స్ స్పెషలిస్ట్, తెలుగుతేజం సాత్విక్ సాయిరాజ్ సాధించాడు.

565 కిలోమీటర్ల వేగంతో స్మాష్....

ప్రపంచ బ్యాడ్మింటన్లో 2013 వరకూ నమోదైన అత్యంత వేగవంతమైన స్మాష్ గంటకు 493 కిలోమీటర్లు మాత్రమే. గత దశాబ్దకాలంగా చెక్కుచెదరకుండా ఉన్న ఈ రికార్డును మలేసియా ఆటగాడు టాన్ బూన్ హ్యాంగ్ నెలకొల్పాడు. గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డుల్లోకి ఎక్కిన ఈ ప్రపంచ రికార్డును తెలుగు కుర్రోడు సాత్విక్ సాయిరాజ్ బద్దలు కొట్టాడు.

విఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాపరికరాల సంస్థ యోనెక్స్..టోక్యోఫ్యాక్టరీ జిమ్నాజియంలో పురుషులు, మహిళలకు వేర్వేరుగా ..ఫాస్టెస్ట్ స్మాష్ ల పరీక్ష నిర్వహించింది.

ఈ కార్యక్రమానికి గిన్నిస్ రికార్డ్ ఆఫ్ వరల్డ్ సంస్థ ప్రతినిధులు సైతం హాజరయ్యారు.

స్మాష్ ల వేగాన్ని మదింపు చేయటానికి గిన్నిస్ నిపుణులు ప్రత్యేక పరికరాలను అమర్చారు. ఫోటోగ్రాఫిక్ రికార్డింగ్ టెక్నిక్ తో ఫాస్టెస్ట్ స్మాష్ వేగాన్ని రికార్డు చేశారు.

ఇందులో సాయిసాత్విక్ 565 కిలోమీటర్ల వేగంతో కాక్ ను స్మాష్ చేశాడు. గత పదేళ్లుగా ఉన్న 493 కిలోమీటర్ల స్మాష్ రికార్డు 22 సంవత్సరాల సాయిసాత్విక్ దెబ్బతో తెరమరుగైపోయింది.దాంతో, పురుషుల బాడ్మింట‌న్‌లో కాక్‌ను బ‌లంగా కొట్టిన ఆట‌గాడిగా గుర్తింపు సాధించాడు.

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో తాజాగా చేరిన ఈ రికార్డును తాము స్పాన్సర్ చేస్తున్న సాయి సాత్విక్ సాధించడం తమకు గర్వకారణమని యోనెక్స్ సంస్థ మురిసిపోతోంది.

సాత్విక్ చేతిలో గిన్నిస్ సర్టిఫికెట్...

సాయి సాత్విక్ సాధించిన అత్యంత వేగవంతమైన షాట్ కమ్ స్మాష్ ను గిన్నిస్ ప్రపంచ రికార్డుల సంస్థ ధృవీకరించింది. 2023 ఏప్రిల్ 14న నమోదైన ఈ రికార్డును గిన్నిస్ అధికారులు పలు విధాలుగా నిర్థారించుకొన్న అనంతరం ధృవీకరించినట్లు అధికారికంగా ప్రకటించారు.

అమలాపురంలోని సాత్విక్ సాయిరాజ్ ఇంటికి కొరియర్ ద్వారా గిన్నిస్ సంస్థ ధృవీకరణ పత్రాన్ని పంపింది. తన కుమారుడి పేరుతో వచ్చిన గిన్నిస్ కవర్ ను సాత్విక్ తండ్రి తెరచి చూసి పొంగిపోయారు.

గిన్నిస్ ప్రపంచ రికార్డు పత్రాన్ని తన అమ్మానాన్నలతో కలసి అభిమానులతో పంచుకోడం ద్వారా సాత్విక్ గాల్లో తేలిపోయాడు. గంటకు 565 కిలోమీటర్ల వేగంతో తాను కొట్టిన ప్రపంచ రికార్డు స్మాష్ తన తండ్రి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందంటూ సాత్విక్ ప్రకటించాడు.

2013 మే నెలలో మలేసియా ఆటగాడు టాన్ బూన్ హియోంగ్ 493 కిలోమీటర్ల వేగం స్మాష్ తో నెలకొల్పిన ప్రపంచ రికార్డును సాత్విక్ 565 కిలోమీటర్ల వేగంతో సవరించాడు.

పారిస్ వేదికగా వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లో భారత్ కు బంగారు పతకం అందించాలన్న లక్ష్యంతో 23 ఏళ్ల సాత్విక్ సాధన చేస్తున్నాడు.

First Published:  7 Dec 2023 10:00 AM IST
Next Story