Telugu Global
Sports

ప్రపంచ చెస్ లో భారత కుర్రాళ్ల 'గ్రాండ్' షో!

2024- ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ లో భారత కుర్రగ్రాండ్మాస్టర్ల త్రయం అంచనాలకు మించి రాణించారు. ప్రపంచ మేటి ఆటగాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.

ప్రపంచ చెస్ లో భారత కుర్రాళ్ల గ్రాండ్ షో!
X

2024- ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ లో భారత కుర్రగ్రాండ్మాస్టర్ల త్రయం అంచనాలకు మించి రాణించారు. ప్రపంచ మేటి ఆటగాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.

కెనడాలోని టొరాంటో వేదికగా జరుగుతున్న 2024- ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ సమరం రసపట్టుగా సాగుతోంది. ఎనిమిదిమంది ప్రపంచ మేటి గ్రాండ్మాస్టర్లతో పురుషుల విభాగంలో సాగుతున్న 14 రౌండ్ల డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పోరులో ముగ్గురు భారత కుర్రగ్రాండ్మాస్టర్లు ముప్పేటదాడితో సంచలనాల పరంపర కొనసాగిస్తున్నారు.

10వ రౌండ్ పోటీలు ముగిసే సమయానికి భారత్ కు చెందిన 17 ఏళ్ల గ్రాండ్మాస్టర్ గుకేశ్ 6 పాయింట్లతో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు ఇయాన్ నెపోమెనిచ్ తో కలసి సంయుక్త ఆధిక్యంలో కొనసాగుతున్నాడు.

ముగ్గురూ ముగ్గురే!

ప్రపంచ క్యాండిడేట్స్ చదరంగ చరిత్రలో గతంలో భారత్ కు చెందిన సూపర్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ మాత్రమే పాల్గొన్నాడు. అయితే..ప్రస్తుత 2024 టోర్నీలో మాత్రం ఒక్కరు కాదు..ఏకంగా ముగ్గురు భారత గ్రాండ్మాస్టర్లు తమ అదృష్టం పరీక్షించుకొంటున్నారు.

చైనా గ్రాండ్ మాస్టర్,విశ్వవిజేత డింగ్ లిరెన్ తో 2025 ప్రపంచ చెస్ టైటిల్ పోరులో తలపడే ఆటగాడి ఎంపిక కోసం అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఈ క్యాండిడేట్స్ టోర్నీని నిర్వహిస్తోంది.

మొత్తం 8మంది గ్రాండ్ మాస్టర్ల నడుమ జరిగే 14 గేమ్ ల పోరులో అత్యధిక పాయింట్లు సాధించిన ఆటగాడే క్యాండిడేట్స్ ( చాలెంజర్ ) టైటిల్ దక్కించుకోగలుగుతాడు.

నెపోమినిచ్- గుకేశ్ గేమ్ డ్రా....

నువ్వానేనా అన్నట్లుగా సాగుతున్న ఈ టోర్నీ 10వ రౌండ్ లో లీగ్ టేబుల్ టాపర్లు ఇయాన్ నెపోమినిచ్- గుకేశ్ ల గేమ్ హోరాహోరీగా సాగి డ్రాగా ముగియడంతో ఇద్దరూ ఆటగాళ్లు పాయింటును చెరి సగం పంచుకోవాల్సి వచ్చింది.

10వ రౌండ్ పోటీలు ముగిసే సమయానికి ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ఆటగాడు నెపోమినిచ్ 6 పాయింట్లు, భారత కుర్రగ్రాండ్మాస్టర్ గుకేశ్ 6 పాయింట్లు చొప్పున సాధించి సంయుక్త ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

రెండోస్థానంలో ప్రజ్ఞానంద్...

భారత మరో యువ ఆటగాడు, 18 సంవత్సరాల గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద్ 5.5 పాయింట్లు సాధించడం ద్వారా అమెరికా గ్రాండ్మాస్టర్ నకమురాతో కలసి సంయుక్త ద్వితీయ స్థానంలో నిలిచాడు.

10వ గేమ్ లో నిజత్ అబ్సోవ్ ను హికారు నకమురా చిత్తు చేయడం ద్వారా తన పాయింట్ల సంఖ్యను 5.5కు పెంచుకోగలిగాడు. తనదేశానికే చెందిన విదిత్ గుజరాతీతో జరిగిన 10వ గేమ్ ను ప్రజ్ఞానంద్ డ్రాతో సరిపెట్టుకొని 5.5 పాయింట్లతో మరో ఇద్దరితో కలసి ద్వితీయ స్థానంలో కొనసాగుతున్నాడు.

మరో 10వ గేమ్ లో ఫేబియానో కరునా..ఫ్రెంచ్ గ్రాండ్ మాస్టర్ అలీరెజా ఫిరోజాకు చెక్ చెప్పి తన పాయింట్ల సంఖ్యను 5.5కు పెంచుకోగలిగాడు.

ఫేబియానో కరునా, ప్రజ్ఞానంద్, నకమురా తలో 5.5 పాయింట్లతో ద్వితీయస్థానంలో పోరాడుతున్నారు.

టోర్నీ 9వ గేమ్ లో నకమురాపై భారత గ్రాండ్ మాస్టర్ విదిత్ గుజరాతీ సంచలన విజయం సాధించాడు. రౌండ్ రాబిన్ లీగ్ రెండుకు రెండుగేమ్ ల్లోనూ తనకంటే మెరుగైన ర్యాంకులో నిలిచిన నకమురాకు విదిత్ గుజరాతీ చెక్ చెప్పడం గొప్ప ఘనతగా మిగిలిపోతుంది.

హంపి గేమ్ డ్రా..వైశాలీ ఓటమి...

మహిళల విభాగంలో నూర్గుల్ సాలిమోవ్ చేతిలో వైశాలీ పరాజయం చవిచూసింది. టాన్ జోంగ్వీతో జరిగిన గే్మ్ ను భారత సీనియర్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి డ్రాగా ముగించగలిగింది.

హంపి 4.5 పాయింట్లు, వైశాలీ 3.5 పాయింట్లతో తమ పోరాటం కొనసాగిస్తున్నారు.

ఒకరోజు విశ్రాంతి అనంతరం జరిగే 11వ రౌండ్ పోరులో హికారు నకమురాతో ప్రజ్ఞానంద్, ఇయాన్ నెపోమినిచ్ తో విదిత్ గుజరాతీ, ఫేబియానో కరునాతో గుకేశ్, అలీరెజా తో నిజత్ అబ్సోవ్ తలపడనున్నారు.

మహిళల విభాగంలో టాన్ జోంగ్యీతో కాథరీనా లాగ్నో, కోనేరు హంపితో నూర్గుల్ సాలిమోవ్, వైశాలితో అలెగ్జాండ్రా, లీ టింగ్ జీ తో అన్నా ముజిచుక్ తలపడాల్సి ఉంది.

చివరి నాలుగు రౌండ్లలో నిలకడగా రాణించిన గ్రాండ్మాస్టర్లకు మాత్రమే క్యాండిడేట్స్ టైటిల్ దక్కించుకొనే అవకాశాలు ఉంటాయి.

ఇప్పటి వరకూ జరిగిన 10 రౌండ్లలో ..ఏ మాత్రం ప్రపంచ పోటీల అనుభవం లేకున్నా..భారత కుర్ర గ్రాండ్మాస్టర్ల త్రయం గుకేశ్, ప్రజ్ఞానంద్, విదిత్ గుజరాతీ స్థాయికి మించి ఆడటం అభినందనీయమే.

First Published:  18 April 2024 9:51 AM IST
Next Story