Telugu Global
Sports

ఇద్దరు మొనగాళ్లకు భారత నయాకోచ్ బంపరాఫర్!

భారత క్రికెట్ నయాకోచ్ గౌతం గంభీర్ వచ్చీరావడంతోనే బాంబు పేల్చాడు. సూపర్ స్టార్ జోడీ రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీలకు షరతులతో కూడిన బంపరాఫర్ ఇచ్చాడు.

ఇద్దరు మొనగాళ్లకు భారత నయాకోచ్ బంపరాఫర్!
X

భారత క్రికెట్ నయాకోచ్ గౌతం గంభీర్ వచ్చీరావడంతోనే బాంబు పేల్చాడు. సూపర్ స్టార్ జోడీ రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీలకు షరతులతో కూడిన బంపరాఫర్ ఇచ్చాడు.

భారత క్రికెట్ సరికొత్త ప్రధాన శిక్షకుడు గౌతం గంభీర్ తన తొలి మీడియా సమావేశంలోనే తన ఉద్దేశాలను బయట పెట్టాడు. పలు వివాదాస్పద అంశాలపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తో కలసి వివరణ ఇచ్చాడు. ప్రధానంగా ప్రస్తుత భారత క్రికెట్ కృష్ణార్జునులు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీలకు భలే చాన్స్ అంటూ ఊరించి, ఉడికించేలా ఓ ప్రకటన చేశాడు.

ఆ ఇద్దరూ మాకెంతో ముఖ్యం- గంభీర్..

ఇటీవలే ముగిసిన 2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో భారత్ ను విజేతగా నిలిపిన కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ ఆ వెంటనే టీ-20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. తాము వన్డే, టెస్టు క్రికెట్ ఫార్మాట్లకు మాత్రమే అందుబాటులో ఉంటామంటూ చెప్పకనే చెప్పారు.

అయితే..రాహుల్ ద్రావిడ్ స్థానంలో భారత చీఫ్ కోచ్ పగ్గాలు చేపట్టిన గౌతం గంభీర్ మాత్రం 2027 వన్డే ప్రపంచకప్ లో సైతం రోహిత్, విరాట్ లను ఆడించాలని ఉందంటూ తన మనసులో మాట బయటపెట్టాడు. అయితే 37 సంవత్సరాల రోహిత్, 36 ఏళ్ల విరాట్ లకు ఓ గట్టి షరతే విధించాడు.

తమ ఫిట్ నెస్ కాపాడుకొంటూ క్రికెట్ మూడు ఫార్మాట్లలో కొనసాగుతూ ఉండాలని, ఫిట్ నెస్ నిరూపించుకొంటే..వయసుతో సంబంధం లేకుండా ఈ ఇద్దరు మొనగాళ్లను 2027 టీ-20 ప్రపంచకప్ లో ఆడించటానికి సిద్ధమంటూ ప్రకటించాడు.


రో-కొలకు ఇష్టమైతేనే....

ఇప్పటికే టీ-20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ తమకు తాముగా ఆలోచించుకోవాలని, వారిద్దరినీ వచ్చే వన్డే ప్రపంచకప్ వరకూ ఆడించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని, ఆడేది, లేనిదీ నిర్ణయించుకోవాల్సింది రోహిత్, విరాట్ జోడీ మాత్రమేనంటూ గంభీర్ తేల్చి చెప్పాడు.

వచ్చే ప్రపంచకప్ నాటికి రోహిత్ వయసు 40, విరాట్ వయసు 39గా ఉన్నా..వారిలో అపారప్రతిభదాగుందని, సుదీర్ఘకాలం ఆటే సత్తా ఉందని గంభీర్ వివరణ ఇచ్చాడు.

భారత క్రికెట్ లోని ఇద్దరు అత్యుత్తమ బ్యాటర్లు సాధ్యమైనంత ఎక్కువకాలం జట్టుకు సేవలు అందించాలని చీఫ్ కోచ్ గా తాను కోరుకొంటానని చెప్పాడు. ప్రతిభ ఉన్న ఆటగాళ్లు తమ ఫిట్ నెస్ ను కొనసాగించినంత కాలం జట్టులో చోటు ఉండితీరుతుందని భరోసా ఇచ్చాడు.

త్వరలో జరిగే ఐసీసీ మినీ ప్రపంచకప్, బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ ల్లో రోహిత్, విరాట్ కీలకమని, వారిద్దరినీ సాధ్యమైనంతగా ఎక్కువమ్యాచ్ లు ఆడించాలని భావిస్తున్నట్లు తెలిపాడు.

బుమ్రాకు మాత్రమే మినహాయింపు......

ఆటగాళ్ల వర్క్ లోడ్ మేనేజ్ మెంట్ కు తాను అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు గంభీర్ చెప్పాడు. జస్ ప్రీత్ బుమ్రా లాంటి అసాధారణ బౌలర్ కు మాత్రమే మినహాయింపు ఇస్తామని, మిగిలిన ప్రధాన ఆటగాళ్లంతా విరామం లేకుండా మ్యాచ్ లు, సిరీస్ లు ఆడితీరాల్సిందేనంటూ స్పష్టం చేశాడు.

ప్రధానంగా..బ్యాటర్లకు విశ్రాంతి అవసరమే లేదని, అన్ని మ్యాచ్ లకూ అందుబాటులో ఉండేలా చూస్తామని, రోహిత్, విరాట్ సైతం సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్ లు ఆడక తప్పదని అన్నాడు.

టెస్టు, వన్డే ఫార్మాట్లకే పరిమితమైన రోహిత్, కొహ్లీ ఇకముందు జరిగే ప్రతి సిరీస్ లోనూ ఆడాల్సిందేనని భారత నయాకోచ్ చెప్పాడు.

ఫిట్ నెస్ సమస్యల కారణంగానే....

భారత టీ-20 కెప్టెన్ గా హార్థిక్ పాండ్యాను కాదని సూర్యకుమార్ యాదవ్ ను నియమించడం పై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వివరణ ఇచ్చారు. పేస్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా..భారతజట్టుకు అత్యంత కీలకమైన ఆటగాడని, తరచూ గాయాలతో జట్టుకు దూరంకావాలని తాము కోరుకోడం లేదని, జట్టుకు కెప్టెన్ గా కంటే ఆల్ రౌండర్ గానే పాండ్యా సేవలు ప్రధానమని తెలిపాడు.

కెప్టెన్ గా ఉన్న ఆటగాడు తగిన ఫిట్ నెస్ లేకపోతే దాని ప్రభావం జట్టుపైన ఉండితీరుతుందని, పాండ్యాను కెప్టెన్సీకి దూరంగా ఉంచడానికి ప్రధానకారణం ఫిట్ నెస్ మాత్రమేనని అగార్కర్ వివరించాడు.

రవీంద్ర జడేజాను పక్కన పెట్టలేదు.....

స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను..శ్రీలంకతో జరిగే తీన్మార్ వన్డే సిరీస్ కు ఎంపిక చేయకపోడానికి ఓ కారణం ఉందని, త్వరలో భారత్ ఆడే మొత్తం 10 టెస్టుమ్యాచ్ ల్లోనూ

జడేజా ఆడాలంటే తగిన విశ్రాంతి అవసరమని చీఫ్ కోచ్ వివరించాడు. జడేజా వన్డే కెరియర్ కు తాము తెరవేయలేదని, జట్టు అవసరాల దృష్ట్యా తగిన విరామం మాత్రమే ఇచ్చామని తెలిపాడు.

మిస్టర్ టీ-20 సూర్యకుమార్ యాదవ్ ను వన్డే సిరీస్ లకు దూరంగా ఉంచడానికి..రాహుల్, పంత్, శ్రేయస్ అయ్యర్ అందుబాటులోకి రావడం ప్రధానకారణంగా కనిపిస్తోంది

భవిష్య కెప్టెన్ శుభ్ మన్ గిల్....

రానున్న సంవత్సరాలలో భారతజట్టుకు నాయకత్వం వహించే సత్తా శుభ్ మన్ గిల్ లో తమకు కనిపించిందని, అందుకే వైస్ కెప్టెన్ గా నియమించినట్లు అగార్కర్ వివరణ ఇచ్చాడు.

సహఆటగాళ్లతో కలుపుగోలుగా ఉండే గిల్ సహజసిద్ధమైన నాయకుడని, భారత క్రికెట్ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని వైస్ కెప్టెన్ గా తగిన అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు చెప్పాడు. క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ భారత్ కు సుదీర్ఘకాలం అసమానసేవలు అందించే ప్రతిభ శుభ్ మన్ గిల్ లో దాగి ఉందని అగార్కర్ గుర్తు చేశాడు.

షమీకి తలుపులు మూసివేయలేదు...

వెటరన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి తాము తలుపులు మూసివేయలేదని, తగిన ఫిట్ నెస్ తో భారతటెస్టు జట్టులో చేరే అవకాశం కల్పించామని, సెప్టెంబర్ లో బంగ్లాదేశ్ తో జరిగే టెస్టు సిరీస్ కు షమీ అందుబాటులోకి రావాలన్నదే తమ ఉద్దేశమని తెలిపాడు.

మరోవైపు..విరాట్ కొహ్లీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, తామిద్దరమూ క్రికెట్ కోసం, జట్టు ప్రయోజనాల కోసమే పోరాడినట్లు గంభీర్ వివరణ ఇచ్చాడు. విరాట్ కు, తనకు మధ్య ఉన్న సంబంధం వ్యక్తిగతమని..అది మీడియా ముందుంచాల్సిన పనిలేదని, తాను టీవీ చానెళ్లు టీఆర్పీరేటింగ్ పెంచుకోడానికి తగిన మసాలా ఇవ్వలేనని గంభీర్ తనదైన శైలిలో చెప్పాడు.

శ్రీలంకతో జరిగే తీన్మార్ టీ-20 సిరీస్ ద్వారా 41 సంవత్సరాల గౌతం గంభీర్ భారత ప్రధాన శిక్షకుడిగా అరంగేట్రం చేయనున్నాడు.

First Published:  22 July 2024 12:17 PM GMT
Next Story