Telugu Global
Sports

భారత క్రికెట్ నయా కోచ్ గా గౌతం గంభీర్?

భారతక్రికెట్ ప్రధాన శిక్షకుడి పదవి రేస్ లో గౌతం గంభీర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. బీసీసీఐతో గంభీర్ చర్చలు దాదాపు ముగింపుదశకు చేరినట్లు క్రికెట్ వర్గాలు అంటున్నాయి.

భారత క్రికెట్ నయా కోచ్ గా గౌతం గంభీర్?
X

భారతక్రికెట్ ప్రధాన శిక్షకుడి పదవి రేస్ లో గౌతం గంభీర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. బీసీసీఐతో గంభీర్ చర్చలు దాదాపు ముగింపుదశకు చేరినట్లు క్రికెట్ వర్గాలు అంటున్నాయి.

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు సరికొత్త ప్రధాన శిక్షకుడి కోసం వేట మొదలు పెట్టింది. ప్రస్తుత చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం జూన్ నెలతో ముగియనుండడంతో జూలై 1న సరికొత్త కోచ్ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది.

విదేశీ శిక్షకులకు బీసీసీఐ 'నో'!

భారత క్రికెట్ ప్రస్తుత చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ వారసుడిగా స్వదేశీ కోచ్ ను మాత్రమే నియమిస్తామని, విదేశీకోచ్ లకు అవకాశమే లేదని బీసీసీఐ కార్యదర్శి జే షా కొద్దిరోజుల క్రితమే ప్రకటించడంతో..వీవీఎస్ లక్ష్మణ్ తో సహా పలువురు ప్రముఖ స్వదేశీ శిక్షకుల పేర్లు వినిపించాయి.అయితే..ఐపీఎల్ -17 సీజన్ విజేతగా కోల్ కతా నైట్ రైడర్స్ నిలవడంలో ప్రధానపాత్ర వహించిన భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ పేరు హఠాత్తుగా బయటకు వచ్చింది.

కోల్ కతా మెంటార్ గా సూపర్ హిట్...

భారత క్రికెట్ ఓపెనర్ గా టెస్టు, వన్డే ఫార్మాట్లలో తనజట్టుకు ఎన్నో విజయాలు అందించిన గంభీర్ 2011 వన్డే ప్రపంచకప్ విజయంలోనూ ప్రధానపాత్ర పోషించాడు.

విపరీతమైన క్రికెట్ పరిజ్ఞానం, వ్యూహాత్మకంగా ఆలోచించడంలో దిట్టగా పేరుపొందిన గంభీర్ ను ప్రత్యర్థులుగా కొరకరాని కొయ్యగా, గట్టి క్రికెట్ పిండంగానూ పరిగణిస్తారు.

అంతేకాదు..కోల్ కతా ఫ్రాంచైజీని రెండుమార్లు విజేతగా నిలిపిన ఘనత.. కెప్టెన్ గా గౌతం గంభీర్ కు మాత్రమే దక్కుతుంది. అంతేకాదు..దశాబ్దకాలం విరామం తరువాత

మరోసారి కోల్ కతాను ఐపీఎల్ విన్నర్ గానూ నిలపడంలో మెంటార్ స్థానంలో గంభీర్ కీలకపాత్ర పోషించాడు.

ఆటగాళ్లలోని ప్రతిభను గుర్తించడం, స్థాయికి తగ్గట్టుగా రాణించేలా చేయటంలో గంభీర్ కు ఎంతో నైపుణ్యం ఉంది. 2024 ఐపీఎల్ విజేతగా కోల్ కతా నైట్ రైడర్స్ నిలవడంలో తెరముందు శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని ఆటగాళ్లు ఎంతో..తెరవెనుక జట్టుకు మార్గదర్శుకుడిగా గౌతం గంభీర్ అంతే భూమికను నిర్వహించాడు.

కోల్ కతా మెంటార్ నుంచి భారత కోచ్ గా...

గౌతం గంభీర్ కు క్రికెట్ శిక్షకుడిగా ఎలాంటి అనుభవం లేకున్నా..మెంటార్ గా మాత్రం గొప్ప గుర్తింపే ఉంది. ప్రత్యర్థిజట్లు, ఆటగాళ్ల బలాబలాలను పసిగట్టడం, దానికి తగ్గట్టుగా వ్యూహాలు పన్నడంలో గంభీర్ కు గంభీర్ మాత్రమే సాటి. ఐపీఎల్ విజేతజట్టుకు ట్రోఫీ ప్రధాన సమయంలో బీసీసీఐ కార్యదర్శితో కోల్ కతా మెంటార్ గా గంభీర్ మాట్లాడుతూ కనిపించాడు.

కోల్ కతాను విజేతగా నిలపడంలో ప్రధానపాత్ర వహించిన గంభీర్ ను బోర్డు కార్యదర్శి జే షా, అధ్యక్షుడు రోజర్ బిన్నీ సైతం అభినందించారు. ఇదే సమయంలో..భారత జట్టు చీఫ్ కోచ్ పదవిని చేపట్టాలని గంభీర్ ను కోరినట్లు ప్రచారం జరుగుతోంది. భారతజట్టు ప్రధాన శిక్షకుడి పదవి కోసం దరఖాస్తు చేసుకోడానికి గడువు సైతం సోమవారమే ముగిసింది.

గంభీర్ తో బీసీసీఐ చర్చలు ముగిసినట్లే..

భారత కోచ్ పదవి చేపట్టడానికి గౌతం గంభీర్ బీసీసీఐ ముందు కొన్ని షరతులు, ప్రతిపాదనలు ఉంచినట్లు తెలిసింది. అయితే..క్రికెట్ విశ్లేషకుడిగా, మెంటార్ గా బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహించిన గంభీర్ కు భారతజట్టు ప్రధాన శిక్షకుడిగా వ్యవహరించడం అంతతేలిక కాదని అంటున్నారు. నెలల తరబడి కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుందని, కుటుంబం కంటే భారతజట్టుకే అధికప్రాధాన్యమివ్వాల్సి ఉంటుందని, అందుకు గంభీర్ సుముఖంగా ఉన్నాడో లేదో తెలియదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

భార్య, ఇద్దరు కుమార్తెలను నెలల తరబడి విడిచి పెట్టి..భారతజట్టునే అంటిపెట్టుకోక తప్పని పరిస్థితి భారత చీఫ్ కోచ్ గా గంభీర్ కు ఎదురుకానుంది.

రెండునెలలపాటు జరిగిన ఐపీఎల్ లో..గౌతం గంభీర్ కోల్ కతా మెంటార్ గా ఐదుసార్లు బ్రేక్ తీసుకోడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. భారత చీఫ్ కోచ్ సవాలును గంభీర్ స్వీకరించగలడా? అన్నదానికి జవాబు రానున్న రోజుల్లో దొరకనుంది.

నెలకు కోటి రూపాయల వేతనం..

భారత క్రికెట్ ప్రధాన శిక్షకుడికి బీసీసీఐ ప్రస్తుతం నెలకు కోటి రూపాయలు వేతనంగా చెల్లిస్తోంది. ఏడాదికి 12 కోట్ల రూపాయల కాంట్రాక్టు పై రెండుసంవత్సరాలుగా పదవీకాలాన్ని నిర్ణయించింది.

గతంలో భారతజట్టుకు జాన్ రైట్, డంకన్ ఫ్లెచర్, గ్యారీ కిర్ స్టెన్, గ్రెగ్ చాపెల్ లాంటి విదేశీ కోచ్ లు సేవలు అందించినా .. గ్యారీ కిర్ స్టెన్ మినహా మిగిలిన వారు ..ఆశించిన ఫలితాలు అందించలేకపోయారు.

ఆ తరువాత.. అనీల్ కుంబ్లే, రవి శాస్త్రి చీఫ్ కోచ్ లు గా భారతజట్టుకు పలు చిరస్మరణీయమైన విజయాలు అందించారు. గత మూడేళ్లుగా భారతజట్టు ప్రధాన శిక్షకుడిగా ఉన్న రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో వన్డే ప్రపంచకప్, టెస్టు లీగ్ ఫైనల్స్ లో భారత్ రన్నరప్ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

జూన్ 2 నుంచి 29 వరకూ జరిగే 2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో టాప్ ర్యాంకర్ భారత్ కు రాహుల్ ద్రావిడ్ చీఫ్ కోచ్ గా వ్యవహరిస్తున్నారు. 2011 తరువాత మరో ఐసీసీ ట్రోఫీ గెలుచుకోడంలో విఫలమైన భారత్ కు.. విశ్వవిజేతగా నిలవటానికి ప్రస్తుత ప్రపంచకప్ ను మించిన సువర్ణఅవకాశం మరొకటిలేదని అందరూ భావిస్తున్నారు.

చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తో పాటు సీనియర్ స్టార్లు విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలకు సైతం దేశానికి ప్రపంచకప్ సాధించి పెట్టే ఆఖరి అవకాశం ఇదేననటంలో ఏమాత్రం సందేహం లేదు.

టీ-20 ప్రపంచకప్ ముగిసిన కొద్దిరోజులకే భారత క్రికెట్ ప్రధానశిక్షకుడి బాధ్యతల్ని రాహుల్ ద్రావిడ్ నుంచి మరో వ్యక్తి అందుకోనున్నారు. ఇంతకూ ..ఎవరా మొనగాడు?

అన్న ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలంటే మరికొద్దివారాలపాటు వేచిచూడక తప్పదు.

First Published:  29 May 2024 6:30 AM GMT
Next Story