Telugu Global
Sports

ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ లో విదిత్ సంచలనం!

కెనడా వేదికగా జరుగుతున్న ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ రౌండ్ రాబిన్ లీగ్ లో భారత గ్రాండ్మాస్టర్ విదిత్ గుజరాతీ సంచలన విజయం సాధించాడు.

ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ లో విదిత్ సంచలనం!
X

కెనడా వేదికగా జరుగుతున్న ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ రౌండ్ రాబిన్ లీగ్ లో భారత గ్రాండ్మాస్టర్ విదిత్ గుజరాతీ సంచలన విజయం సాధించాడు.

టొరాంటో వేదికగా ప్రారంభమైన 2024 ప్రపంచ చెస్ కాండిడేట్స్ టోర్నీ పురుషుల, మహిళల విభాగాలలో భారత్ కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ప్రపంచ చదరంగ టైటిల్ కోసం చైనా గ్రాండ్మాస్టర్లు డింగ్ లీరెన్, జు వెన్ జున్ లతో తలపడే చాలెంజర్ల కోసం ప్రపంచ చెస్ సమాఖ్య కెనడాలోని టొరాంటో వేదికగా క్యాండిడేట్స్ టోర్నీ నిర్వహిస్తోంది.

పురుషుల, మహిళల విభాగాలలో మొత్తం ఎనిమిది మంది చొప్పున ప్రపంచ మేటి గ్రాండ్మాస్టర్లు పోటీపడుతున్నారు. ఏప్రిల్ 3 నుంచి 22 వరకూ జరిగే ఈ టోర్నీని డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు. ఒక్కోగ్రాండ్మాస్టర్ మూడువారాల వ్యవధిలో 14 రౌండ్లు ఆడాల్సి ఉంది.

ప్రజ్ఞానంద్ కు గుకేశ్ చెక్...

పురుషుల రెండోరౌండ్ పోరులో ప్రపంచ 3వ ర్యాంక్ ఆటగాడు, అమెరికా గ్రాండ్మాస్టర్ హికారు నకామురాను భారత్ కు చెందిన 26వ ర్యాంకర్ విదిత్ సంతోష్ గుజరాతీ కంగు తినిపించాడు.

గత 47 మ్యాచ్ లుగా ఓటమిలేని నకామురాకు ఇదే తొలి ఓటమి కావడం విశేషం. క్లాసికల్ ఫార్మాట్లో జరుగుతున్న ఈ పోరులో విదిత్ ఎత్తులకు నకామురా చిత్తు కాక తప్పలేదు.

గ్రాండ్మాస్టర్ గుకేశ్ తో జరిగిన తొలిరౌండ్ మ్యాచ్ ను డ్రాగా ముగించిన విదిత్..రెండో రౌండ్ విజయంతో పుంజుకోగలిగాడు. నల్లపావులతో ఆడిన నకామురాను విదిత్ ముప్పతిప్పలు పెట్టి మరీ ఓడించాడు.

మరో రెండోరౌండ్ పోరులో భారత గ్రాండ్మాస్టర్లు ప్రజ్ఞానంద్ తో గుకేశ్ తలపడటమే కాదు..విజయం సైతం సాధించాడు. 17 సంవత్సరాల గుకేశ్ తెల్లపావులతో ప్రజ్ఞానంద్ కు చెక్ చెప్పాడు.

ఫిడే తాజా ర్యాంకింగ్స్ ప్రకారం ప్రజ్ఞానంద్ 2747 పాయింట్లతో ప్రపంచ 14వ ర్యాంకులోనూ, గుకేశ్ 2743 పాయింట్లతో 16వ ర్యాంకులోనూ, విదిత్ గుజరాతీ 2727 పాయింట్లతో 25వ ర్యాంక్ లో కొనసాగుతున్నారు.

18 సంవత్సరాల ప్రజ్ఞానంద్, 17 ఏళ్ల గుకేశ్, 29 ఏళ్ళ గ్రాండ్ మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతీ తొలిసారిగా క్యాండిడేట్స్ టోర్నీలో తమ అదృష్టం పరీక్షించుకొంటున్నారు.

ప్రపంచ చాంపియన్ రన్నరప్ ఇయాన్ నెపోమినిచీ, ప్రపంచ రెండోర్యాంక్ ఆటగాడు ఫేబియానో కరూనా, 3వ ర్యాంకర్ హికారు నకమురా, 20 సంవత్సరాల అలీరెజాల నుంచి భారత గ్రాండ్మాస్టర్ల త్రయానికి గట్టిపోటీ ఎదురుకానుంది.

హంపీ మ్యాచ్ డ్రా, వైశాలి ఓటమి...

మహిళల విభాగంలో మొత్తం 8 మంది గ్రాండ్మాస్టర్లు తలపడుతుంటే..అందులో ఇద్దరు మాత్రమే భారత్ కు చెందినవారు కావడం విశేషం. రెండోరౌండ్ పోరులో గ్రాండ్మాస్టర్ కాథిరీనా లగానోతో జరిగిన మ్యాచ్ ను వెటరన్ కోనేరు హంపి డ్రాగా ముగించింది.

అయితే..భారత గ్రాండ్మాస్టర్ వైశాలికి మాత్రం చైనాకు చెందిన టాన్ జోంగ్వీ చేతిలో పరాజయం తప్పలేదు.

ప్రపంచ మహిళా చెస్ విజేతగా చైనా గ్రాండ్మాస్టర్ వెన్ జున్ ప్రస్తుత చాంపియన్ గా ఉంది. 36 సంవత్సరాల కోనేరు హంపితో పాటు..22 ఏళ్ల వైశాలీ సైతం క్యాండిడేట్స్ సమరానికి పూర్తిస్థాయిలో సిద్ధమై వచ్చినా..మొదటి రెండు రౌండ్లలో మిశ్రమఫలితాలను ఎదుర్కొనాల్సి వచ్చింది.

14 రౌండ్ల ఈ సుదీర్ఘ సమరంలో నిలకడగా రాణించిన గ్రాండ్మాస్టర్లకు మాత్రమే క్యాండిడేట్స్ టోర్నీ విజేతగా నిలిచే అవకాశం ఉంటుంది. కేవలం మూడు వారాల వ్యవధిలో 14 రౌండ్ల మ్యాచ్ లు ఆడటం యువగ్రాండ్మాస్టర్ల శారీరక, మానసిక సత్తాకు సవాలు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

First Published:  7 April 2024 8:34 AM GMT
Next Story