ఆట తగ్గినా..సంపాదన తగ్గని పీవీ సింధు!
తెలుగుతేజం పీవీ సింధు సంపాదన ఏడాది ఏడాదికీ పెరిగిపోతోంది. 2023లో అత్యధికంగా ఆర్జించిన అంతర్జాతీయ మహిళా క్రీడాకారుల జాబితాలో చోటు సంపాదించింది.
తెలుగుతేజం పీవీ సింధు సంపాదన ఏడాది ఏడాదికీ పెరిగిపోతోంది. 2023లో అత్యధికంగా ఆర్జించిన అంతర్జాతీయ మహిళా క్రీడాకారుల జాబితాలో చోటు సంపాదించింది....
బ్యాడ్మింటన్ క్రీడను కెరియర్ గా ఎంచుకొని వందలకోట్లు సంపాదించవచ్చునని తెలుగుతేజం పీవీ సింధు చాటి చెప్పింది. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ లో గత దశాబ్దకాలంలో మొదటి 10 మంది అంతర్జాతీయ మహిళా బ్యాడ్మింటన్ స్టార్లలో తన స్థానాన్ని నిలుపుకొంటూ వస్తున్న 28 ఏళ్ల సింధు వివిధ రూపాలలో తన సంపాదనను ఏడాది ఏడాదికీ పెంచుకొంటూనే వస్తోంది.
సిమోన్ బైల్స్ సరసన సింధు...
2023 సంవత్సరంలో అత్యధికంగా ఆర్జించిన మహిళా క్రీడాకారుల జాబితాలో పీవీ సింధు 16వ స్థానంలో నిలిచింది. అమెరికన్ జిమ్నాస్టిక్స్ ఆల్ టైమ్ గ్రేట్ సిమోన్ బైల్స్ తో కలసి సంయుక్త 16వ స్థానం సంపాదించింది.
అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలలో గత రెండేళ్లుగా విఫలమవుతూ..వరుస వైఫల్యాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న సింధు..తన బ్రాండ్ వాల్యూతో పాటు..ప్రైజ్ మనీ, ఎండార్స్ మెంట్ల రూపంలో ఇబ్బడిముబ్బడిగా సంపాదిస్తోంది.
2023 సంవత్సరంలో వివిధ రూపాలలో సింధు ఆర్జన 60 కోట్ల రూపాయలు ( 7.1 మిలియన్ డాలర్లు )గా ఉన్నట్లు పోర్బ్స్ సంస్థ ప్రకటించింది. సంపాదనలో మొదటి 20 మంది అగ్రశ్రేణి మహిళా క్రీడాకారుల వివరాలను ఫోర్బ్స్ వెల్లడించింది.
199 కోట్లతో స్వియాటెక్ టాప్.....
ప్రస్తుత (2023) సంవత్సరంలో అత్యధిక సంపాదన కలిగిన క్రీడాకారిణిగా పోలిష్ టెన్నిస్ సంచలనం ఇగా స్వియాటెక్ అగ్రస్థానంలో నిలిచింది. గ్రాండ్ స్లామ్ సింగిల్స్ లో ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా మాత్రమే నిలిచిన స్వియాటెక్ 199 కోట్ల రూపాయల ఆర్జనతో వారేవ్వా అనిపించుకొంది. స్వియాటెక్ వివిధ రూపాలలో 23.9 మిలియన్ డాలర్లు ఆర్జించినట్లు ఫోర్బ్స్ బయటపెట్టింది.
గత కొద్దిసంవత్సరాలుగా సంపాదనలో టాపర్లుగా ఉన్న అమెరికన్ టెన్నిస్ స్టార్లు సెరెనా విలియమ్స్, నవోమీ ఒసాకా వివిధ కారణాలతో ఆటకు దూరం కావడంతో..స్వియాటెక్ వారిని అధిగమించడం ద్వారా అత్యధిక సంపాదన కలిగిన మహిళా క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది.
టాప్ -10లో చైనా స్కీయింగ్ క్వీన్...
అత్యధిక సంపాదన కలిగిన ప్రపంచ మొదటి 10 మంది మహిళా క్రీడాకారిణుల జాబితాలో చైనాకు చెందిన ఫ్రీ-స్టయిల్ స్కీయింగ్ క్వీన్ ఈలీన్ గు సైతం నిలిచింది.
మొత్తం 20 మందిలో సింధు, సిమోన్ కలసి సంయుక్త 16వ స్థానంలో నిలిచారు.
గాయంతో బ్యాడ్మింటన్ కు దూరంగా ఉన్న పీవీ సింధు ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్ 10వ స్థానంలో కొనసాగుతోంది. వరుస వైఫల్యాలతో కుదేలైన సింధు ప్రస్తుతం బెంగళూరులోని ప్రకాశ్ పడుకోన్ అకాడమీలో శిక్షణ పొందుతూ సాధన చేస్తోంది.
వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించడం కోసం సింధు...బ్యాడ్మింటన్ గ్రేట్ ప్రకాశ్ పర్యవేక్షణలో శ్రమిస్తోంది, ఎడమకాలి మడమగాయంతో సింధు గత కొద్దివారాలుగా ఆటకు దూరమయ్యింది.
హైదరాబాద్ గోపీచంద్ అకాడమీ నుంచి బెంగళూరు ప్రకాశ్ పడుకోన్ అకాడమీకి తన శిబిరాన్ని మార్చిన సింధు గత పదేళ్ల కాలంలో కేవలం బ్యాడ్మింటన్ కెరియర్ గా 500 కోట్లకు పైగా ఆర్జించినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సబ్-కలెక్టర్ గా ఉంటూనే సింధు తన బ్యాడ్మింటన్ ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది.