Telugu Global
Sports

రాజ్ కోటలో ఇంగ్లీష్ క్రికెటర్ల పాగా!

భారత్ తో ఐదుమ్యాచ్ ల సిరీస్ లోని మూడోటెస్టు గెలుపుకోసం బెన్ స్టోక్స్ నాయకత్వంలోని ఇంగ్లీష్ క్రికెట్ జట్టు రాజ్ కోటలో పాగావేసింది. పలు అరుదైన రికార్డులకు గురిపెట్టింది.

రాజ్ కోటలో ఇంగ్లీష్ క్రికెటర్ల పాగా!
X

భారత్ తో ఐదుమ్యాచ్ ల సిరీస్ లోని మూడోటెస్టు గెలుపుకోసం బెన్ స్టోక్స్ నాయకత్వంలోని ఇంగ్లీష్ క్రికెట్ జట్టు రాజ్ కోటలో పాగావేసింది. పలు అరుదైన రికార్డులకు గురిపెట్టింది....

భారత్- ఇంగ్లండ్ జట్ల ఐదుమ్యాచ్ ల ఐసీసీ టెస్టు లీగ్ నిర్ణయాత్మక దశకు చేరింది. సిరీస్ లోని మొదటి రెండుటెస్టుల్లో రెండుజట్లు చెరో మ్యాచ్ నెగ్గడం ద్వారా 1-1తో సమఉజ్జీగా నిలిచాయి.

హైదరాబాద్ వేదికగా ముగిసిన తొలిటెస్టులో ఇంగ్లండ్ 28 పరుగులతో భారత్ ను కంగు తినిపిస్తే..విశాఖపట్నం వేదికగా జరిగిన రెండోటెస్టులో భారత్ 106 పరుగుల తేడాతో నెగ్గడం ద్వారా దెబ్బకు దెబ్బ తీసింది.

అయితే..రెండోటెస్టు, మూడోటెస్టుకు నడుమ వారంరోజులపాటు విరామం దొరకడంతో బెన్ స్టోక్స్ నాయకత్వంలోని ఇంగ్లండ్ జట్టు సభ్యులు అబుదాబీలో సాధన చేసి వచ్చారు. ఫిబ్రవరి 15నుంచి జరిగే మూడోటెస్టులో పాల్గొనటానికి వేదిక రాజ్ కోట నిరంజన్ షా స్టేడియంలో పాగా వేశారు.

100 టెస్టుల రికార్డుకు బెన్ స్టోక్స్...

ఇంగ్లండ్ కెప్టెన్, 32 సంవత్సరాల బెన్ స్టోక్స్ 100 టెస్టుమ్యాచ్ ల రికార్డుకు తహతహలాడుతున్నాడు. తన కెరియర్ లో ఇటీవలి విశాఖ టెస్టు వరకూ 99 మ్యాచ్ లు ఆడిన బెన్ ..రాజ్ కోట వేదికగా జరిగే మూడోటెస్టు ద్వారా వందటెస్టుల మైలురాయిని చేరుకోనున్నాడు.

సాంప్రదాయ టెస్టు క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకూ 75 మంది, ఇంగ్లండ్ తరపున 15 మంది మాత్రమే 100 టెస్టులు ఆడిన క్రికెటర్లు ఉన్నారు. వందో టెస్టు ఆడటం ద్వారా టెస్టు చరిత్రలో బెన్ స్టోక్స్ 76వ ఆటగాడిగా, 16వ బ్రిటీష్ క్రికెటర్ గా రికార్డుల్లో చేరనున్నాడు.

2013 నుంచి 2024 వరకూ..

2013 లో టెస్టు అరంగేట్రం చేసిన బెన్ స్టోక్స్ కు ప్రస్తుత టెస్ట్ క్రికెట్లో దూకుడుగా ఆడే ఆల్ రౌండర్ గా పేరుంది. గత దశాబ్దకాలంలోనే 99 టెస్టుమ్యాచ్ లు ఆడిన బెన్ స్టోక్స్ 6251 పరుగులు, 197 వికెట్లు పడగొట్టడం ద్వారా అగ్రశ్రేణి ఆల్ రౌండర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు.

ఇంగ్లండ్ సారథిగా 20 టెస్టుల్లో 14 విజయాలు అందించిన రికార్డు సైతం బెన్ కు ఉంది.

2021లో జో రూట్ వందటెస్టుల మైలురాయిని చేరుకోగా..ఇప్పుడు బెన్ స్టోక్స్ అదే ఘనతను సొంతం చేసుకోబోతున్నాడు. క్రికెట్ చరిత్రలో 6వేల పరుగులు, 150కి పైగా వికెట్లు సాధించిన మూడో దిగ్గజ ఆల్ రౌండర్ గా బెన్ స్టోక్స్ ఇప్పటికే అరుదైన ఘనత సాధించాడు, సర్ గార్ ఫీల్డ్ సోబర్స్, జాక్ కలిస్ ల సరసన చోటు సంపాదించాడు.

ఫీల్డర్ గా 105 క్యాచ్ లు పట్టిన మొనగాడు బెన్ స్టోక్స్.

ప్రస్తుత భారత జట్టులోని ఆటగాళ్ల టెస్టుమ్యాచ్ ల అనుభవం కలిపితే 92గా ఉంటే..బెన్ స్టోక్స్ ఒక్కడే 99 మ్యాచ్ ల అనుభవంతో నిలవడం విశేషం. భారత కెప్టెన్ రోహిత్ శర్మకు 56, వికెట్ కీపర్ బ్యాటర్ కెఎస్ భరత్ కు 7 టెస్టులు ఆడిన అనుభవం మాత్రమే ఉంది.

41 ఏళ్ల వయసులో 185వ టెస్టు...

మరోవైపు..ఇంగ్లండ్ ఎవర్ గ్రీన్ ఫాస్ట్ బౌలర్ జిమ్మీ యాండర్సన్ 41 సంవత్సరాల వయసులో 185వ టెస్టు మ్యాచ్ ఆడటానికి ఎదురుచూస్తున్నాడు. 700 వికెట్ల అరుదైన రికార్డు సాధించడానికి ఎదురుచూస్తున్నాడు.

ప్రస్తుత సిరీస్ లో భాగంగా విశాఖ వేదికగా ముగిసిన రెండోటెస్టులో యాండర్సన్ 6 వికెట్లు పడగొట్టడం ద్వారా నాలుగుపదుల వయసులో సైతం తన బౌలింగ్ లో వాడివేడీ ఏమాత్రం తగ్గలేదని చాటుకొన్నాడు.

ఫిబ్రవరి 15 నుంచి ఐదురోజులపాటు జరిగే రాజ్ కోట టెస్టులో ఇంగ్లండ్ నెగ్గితే అది సరికొత్త చరిత్రే అవుతుంది. మూడోటెస్టులో విజేతగా నిలిచిన జట్టే సిరీస్ పై పట్టుబిగించే అవకాశం ఉంది.

First Published:  14 Feb 2024 9:56 AM IST
Next Story