Telugu Global
Sports

యూరోకప్ ఫైనల్లో ఇంగ్లండ్, స్పెయిన్!

2024- యూరోపియన్ ఫుట్ బాల్ చాంపియన్షిప్ ఫైనల్స్ కు ప్రపంచ మాజీ చాంపియన్లు ఇంగ్లండ్, స్పెయిన్ చేరుకొన్నాయి. ఫ్రాన్స్, నెదర్లాండ్స్ జట్ల పోరు సెమీస్ లోనే ముగిసింది.

యూరోకప్ ఫైనల్లో ఇంగ్లండ్, స్పెయిన్!
X

2024- యూరోపియన్ ఫుట్ బాల్ చాంపియన్షిప్ ఫైనల్స్ కు ప్రపంచ మాజీ చాంపియన్లు ఇంగ్లండ్, స్పెయిన్ చేరుకొన్నాయి. ఫ్రాన్స్, నెదర్లాండ్స్ జట్ల పోరు సెమీస్ లోనే ముగిసింది.

జర్మనీవేదికగా గత నాలుగువారాలుగా జరుగుతున్న 2024-యూరోకప్ ఫుట్ బాల్ సమరం పతాకస్థాయికి చేరింది. గ్రూప్ లీగ్ నుంచి సెమీఫైనల్స్ నాకౌట్ వరకూ జరిగిన మ్యాచ్ లు..ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది సాకర్ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ వచ్చాయి. ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ నాకౌట్ రౌండ్ నుంచి పలు సంచలనాలు నమోదయ్యాయి.

జర్మనీ, పోర్చుగల్, బెల్జియం లాంటి మేటి జట్లు సెమీస్ చేరడంలో విఫలంకాగా..సంచలన విజయాలతో సెమీస్ వరకూ వచ్చిన ఫ్రాన్స్, నెదర్లాండ్స్ ఫైనల్స్ చేరకుండానే ఇంటిదారి పట్టాయి.

వరుసగా రెండోసారి ఫైనల్లో ఇంగ్లండ్....

భారీఅంచనాలతో బరిలోకి దిగిన గత టోర్నీ రన్నరప్ ఇంగ్లండ్ స్థాయికి తగ్గట్టుగా ఆడి వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. డార్ట్మండ్ సిగ్నల్ ఇడునా పార్క్ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ ఆఖరి నిముషం గోలుతో మాజీ చాంపియన్ నెదర్లాండ్స్ ను కంగు తినిపించింది. హోరాహోరీగా సాగిన ఈ పోరు నువ్వానేనా అన్నట్లుగా సాగింది. రెండుజట్ల ఆటగాళ్లు, అభిమానులు తీవ్రఉద్వేగానికి గురయ్యారు.

ఆట ప్రారంభంలో నెదర్లాండ్స్ తొలిగోలుతో 1-0 తో పైచేయి సాధించింది. ఇంగ్లండ్ డిఫెండర్ డెక్లాన్ రైస్ చేసిన తప్పిదాన్ని డచ్ ఆటగాడు జేవీ సిమోన్స్ పూర్తిస్థాయిలో సొమ్ము చేసుకోగలిగాడు. 25 అడుగుల దూరం నుంచి బుల్లెట్ లాంటి కిక్ తో ఆట 7వ నిముషంలోనే తనజట్టుకు మెరుపు గోలు అందించాడు.

ఆ తర్వాత నుంచి ఈక్వలైజర్ కోసం పోరాడటం ఇంగ్లండ్ వంతుగా మారింది.

హారికేన్ నాయకత్వంలోని ఇంగ్లండ్ ఎడతెరిపిలేని దాడులతో డచ్ డిఫెన్స్ పై ఒత్తిడి పెంచింది. అంపైర్ వివాదాస్పద నిర్ణయంతో లభించిన పెనాల్టీని హారీ కేన్ గోల్ గా మలచడంతో స్కోరు 1-1తో సమమయ్యింది.

మ్యాచ్ అదనపు సమయానికి వెళుతుందని అందరూ భావించిన తరుణంలో ....ఆట కొద్ది క్షణాలలో 1-1తో ముగిసే దశలో సబ్ స్టిట్యూట్ గా అడుగుపెట్టిన ఓల్లీ వాట్కిన్స్ సాధించిన సూపర్ గోల్ తో ఇంగ్లండ్ ఫైనల్స్ లో అడుగుపెట్టింది.

ఇంగ్లండ్ ఈ సంచలన విజయంతో వేలాదిమంది బ్రిటీష్ అభిమానుల ఆనందానికి అంతులేకపోయింది.

యమాల్ దెబ్బకు ఫ్రాన్స్ ఢమాల్...

అంతకు ముందు జరిగిన తొలి సెమీఫైనల్లో హాట్ ఫేవరెట్ స్పెయిన్ 2-1 గోల్స్ తో ఫ్రాన్స్ పై సంచలన విజయంతో ఫైనల్స్ కు అర్హత సంపాదించింది. మ్యూనిక్ లోని అలియాంజ్ ఎరీనా వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో స్పెయిన్, ఫ్రాన్స్ జట్లు కొదమసింహాల్లా తలపడ్డాయి.

ఆట ప్రారంభంలోనే కెప్టెన్ కిల్యాన్ ఎంబప్పే అందించిన సూపర్ క్రాస్ ను అందుకొన్న రాండాల్ కోలో ..హెడ్డర్ గోల్ తో తనజట్టుకు 1-0 ఆధిక్యం అందించాడు. అయితే..ఆట ప్రారంభంలో తడబాటుకు గురైన స్పెయిన్ క్రమంగా పుంజుకోగలిగింది.

లయబద్దంగా, సమన్వయంతో ఆడుతూ ఫ్రెంచ్ గోల్ పై పదేపదే దాడులు చేసింది. స్పానిష్ కుర్రాడు, 16 సంవత్సరాల లామైన్ యమాల్ సాధించిన కళ్లు చెదిరే గోలుతో స్కోరు 1-1 కి చేరింది.

16 ఏళ్ల చిరుప్రాయంలోనే గోలు సాధించిన ఆటగాడిగా యూరోకప్ లో యమాల్ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. ఇప్పటి వరకూ స్విస్ ఆటగాడు జాన్ వోన్ లాంతెన్ పేరుతో ఉన్న రికార్డును యమాల్ తిరగరాయగలిగాడు.

యమాల్ గోలుతో స్పెయిన్ దశ తిరిగిపోయింది. ఆతరువాత నాలుగు నిముషాలలోనే డానీ ఓల్మో షాట్ ను జూల్స్ కుండే రిబౌండ్ షాటుగా ఫ్రెంచ్ గోలులోకి పంపడం ద్వారా తమ జట్టు ఆధిక్యాన్ని 2-1కు పెంచాడు.

అంతేకాదు..నాకౌట్ మ్యాచ్ ల్లో స్పెయిన్ తరపున గోలు చేయటం డానీ ఓల్మోకి ఇది మూడోసారి కావడం విశేషం.

తుదివరకూ పోరాడి ఓడిన ఫ్రాన్స్...

వెంట వెంటనే స్పెయిన్ రెండుగోల్స్ చేయడంతో షాక్ లో పడిపోయిన ఫ్రాన్స్ స్కోరు సమం చేయటానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. అంది వచ్చిన రెండు అవకాశాలను కెప్టెన్ ఎంబపే సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దీంతో స్పెయిన్ 2-1 గోల్స్ విజయంతో యూరోకప్ ఫైనల్స్ కు చేరుకోగలిగింది.

ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ లో జార్జియాను, క్వార్టర్ ఫైనల్లో ఆతిథ్య జర్మనీని ఓిడించిన స్పానిష్ జట్టు..గ్రూపులీగ్ దశలో క్రొయేషియా, ఇటలీ, అల్బేనియాజట్లను చిత్తు చేసింది.

స్పెయిన్ ఆటతీరు, జోరు చూస్తుంటే..మరోసారి విజేతగా నిలిచినా ఆశ్చర్యపోనక్కరలేదు.

యూరోకప్ ఫైనల్స్ చేరడం స్పానిష్ జట్టుకు ఇది ఐదవసారి.

ఆదివారం బెర్లిన్ వేదికగా జరిగే టైటిల్ పోరులో స్పెయిన్ ను ఓడించడం ద్వారా తొలిసారి యూరోకప్ అందుకోవాలని ఇంగ్లండ్ కలలు కంటోంది.

First Published:  11 July 2024 11:15 AM GMT
Next Story