Telugu Global
Sports

నాన్నతిట్లు భరించి...అమ్మత్యాగం ఫలించి....!

భారత యువవికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ 22 సంవత్సరాల వయసుకే భారత టెస్టు క్యాప్ సాధించాడు. 312వ భారత టెస్టు క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు.

నాన్నతిట్లు భరించి...అమ్మత్యాగం ఫలించి....!
X

భారత యువవికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ 22 సంవత్సరాల వయసుకే భారత టెస్టు క్యాప్ సాధించాడు. 312వ భారత టెస్టు క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు.

ధృవ్ జురెల్..కేవలం 22 సంవత్సరాల వయసులోనే భారత వికెట్ కీపర్ బ్యాటర్ గా టెస్టు క్యాప్ అందుకొన్నాడు. ఇంగ్లండ్ తో రాజకోట నిరంజన్ షా స్టేడియం వేదికగా ప్రారంభమైన మూడోటెస్టు ద్వారా అరంగేట్రం చేశాడు.

భరత్ వైఫల్యం..జురెల్ కు వరం...!

సాంప్రదాయ టెస్టు క్రికెట్లో భారత్ కు గత 7 మ్యాచ్ ల్లో ప్రధాన వికెట్ కీపర్ బ్యాటర్ గా వ్యవహరించిన ఆంధ్రప్రదేశ్ ఆటగాడు కెఎస్ భరత్ వరుస వైఫల్యాలు ఉత్తరప్రదేశ్ కుర్రాడు ధృవ్ జురెల్ పాలిట వరంగా మారాయి.

భరత్ వికెట్ కీపర్ గా అసాధారణంగా రాణిస్తున్నా..మిడిలార్డర్ బ్యాటర్ గా వరుసగా విఫలం కావడంతో టీమ్ మేనేజ్ మెంట్ యువఆటగాడు జురెల్ కు అవకాశం కల్పించింది.

సరఫ్రాజ్ ఖాన్ తో కలసి జురెల్ ను సైతం టెస్టు అరంగేట్రం చేయించింది.

భారత 312వ క్రికెటర్....

రాజకోట టెస్టు ప్రారంభానికి ముందు జరిగిన కార్యక్రమంలో భారత మాజీ వికెట్ కీపర్, ప్రస్తుత కామెంటీటర్ దినేశ్ కార్తీక్ చేతుల మీదుగా టెస్టు క్యాప్ అందుకొన్న ధృవ్ జురెల్ భారత టెస్టు రికార్డుల్లో 312వ క్రికెటర్ గా చోటు సంపాదించాడు.

జూనియర్ స్థాయి నుంచే నిలకడగా రాణిస్తు, అండర్ -19 ప్రపంచకప్ లో భారత్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించడంతో పాటు..ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు, రంజీట్రోఫీ లో ఉత్తరప్రదేశ్ తరపున నిలకడగా రాణించడం ద్వారా జురెల్ ..సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. తాను క్రికెటర్ గా నిలదొక్కుకోడానికి అనుదినం నాన్నతిట్లు భరిస్తూ వచ్చినా చివరకు భారత టెస్ట్ క్యాప్ అందుకోడం ద్వారా తన జీవితానని చరితార్థం చేసుకోగలిగాడు.

కష్టాలు, పేదరికం నడుమ....

పేదరికం, కష్టాల నడుమ పెరిగిన క్రికెట్ వీరుడు ధృవ్ జురెల్. క్రికెటర్ కావాలంటే బ్యాటు, బంతి ఉండితీరాలి. అదే భారతజట్టులో చోటు సంపాదించే క్రికెటర్ గా ఎదగాలంటే మాత్రం సొంత క్రికెట్ కిట్ ఉండి తీరాలి . అయితే..ప్రాధమిక దశలో బ్యాటు, కిట్ ల కోసం నాన్నఅమ్మలతో పోరాడి..ఆ తరువాత భారతజట్టులో చోటు కోసం పోటీపడి సఫలమయ్యాడు . ధృవ్ జురెల్. కేవలం 22 సంవత్సరాల వయసుకే భారత టెస్టు జట్టులో చోటు సంపాదించడం ద్వారా వార్తల్లో నిలిచాడు.

14 ఏళ్ల వయసు నుంచే...

ఉత్తరప్రదేశ్ లోని ఓ దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ధృవ్ జురెల్ 14 సంవత్సరాల చిరుప్రాయంలో క్రికెట్ అంటే మక్కువ పెంచుకొన్నాడు. చేతిలో బ్యాటు, భుజానికి కిట్ బ్యాగు లేకుండానే క్రికెటర్ కావాలని కలలు కన్నాడు. అయితే..కార్గిల్ యుద్ధవీరుడు, భారత మాజీ సిపాయి నేమ్ సింగ్ జురెల్ కు మాత్రం తన కొడుకు క్రికెట్ అంటూ సమయం వృధా చేయడం ఏమాత్రం ఇష్టం కాలేదు. బుద్ధిగా చదువుకొని ఓ చిన్న ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకొంటే చాలునని భావించారు. కొడుకు ధృవ్ క్రికెట్ అన్న ప్రతిసారీ తిట్లదండకం అందుకోడం నిత్యకృత్యమైపోయింది.

తానే క్రికెట్ ఆడితీరుతానంటూ జురెల్ మంకుపట్టు పట్టడంతో 800 రూపాయలు చేబదులు తెచ్చి మరీ తన తండ్రి బ్యాటు కొనిచ్చినా తనకు సొంతంగా కిట్ బ్యాగ్ కావాలంటూ ధృవ్ మారాం చేశాడు. కిట్ బ్యాగ్ కొనటానికి 3వేల రూపాయలు తమదగ్గర లేవంటూ తండ్రి తెగేసి చెప్పడంతో ఇంటినుంచి పారిపోరాడానికి సిద్ధమయ్యాడు. ధృవ్ తల్లి మాత్రం తన మెడలోని బంగారు గొలుసు అమ్మి కిట్ బ్యాగు కొనివ్వడంతో తన క్రికెట్ జీవితాన్ని మొదలు పెట్టాడు.

జూనియర్ ప్రపంచకప్ రన్నరప్ గా...

సబ్ జూనియర్ స్థాయి నుంచి నిలకడగా రాణిస్తూ వచ్చిన ధృవ్ నమ్మదగిన వికెట్ కీపర్ బ్యాటర్ గా గుర్తింపు తెచ్చుకొన్నాడు. అండర్ -19 ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టులో చోటు సంపాదించాడు. వైస్ కెప్టెన్ గా సేవలు అందించాడు.

యశస్వి జైశ్వాల్, రవి బిష్నోయ్ లాంటి ఇండియా ప్లేయర్లతో కలసి జూనియర్ ప్రపంచకప్ రన్నరప్ గా నిలిచిన భారతజట్టులో సభ్యుడిగా ధృవ్ గుర్తింపు తెచ్చుకొన్నాడు.

భారత-ఏ జట్టుతో పాటు ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టులోనూ ధృవ్ చోటు సాధించాడు. సీజన్ కు 20 లక్షల రూపాయల కాంట్రాక్టు పై 'ఇంపాక్ట్ ప్లేయర్' కోటాలో జైపూర్ ఫ్రాంచైజీకి ఆడుతూ వస్తున్నాడు.

ఐపీఎల్ ద్వారా వచ్చే ఆదాయంతో ధృవ్ ఆర్థిక కష్టాలు ఒక్కసారిగా తీరిపోయాయి. పైగా రంజీట్రోఫీలో యూపీ జట్టుకు ఆడుతూ దండిగానే ఆర్జించే స్థాయికి ధృవ్ చేరుకొన్నాడు.

సఫారీగడ్డపై సత్తా చాటిన ధృవ్...

దక్షిణాఫ్రికా గడ్డపై దక్షిణాఫ్రికా- ఏ జట్టుతో జరిగిన రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో ధృవ్ నిలకడగా రాణించాడు. కీలక రెండోటెస్టులో 69 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

2024 రంజీసీజన్ ప్రారంభమ్యాచ్ లో కేరళపై 63 పరుగులు సాధించడం ద్వారా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. చివరకు భారత టెస్టుజట్టులో బ్యాకప్ వికెట్ కీపర్ గా చోటు సంపాదించుకోగలిగాడు.

గతేడాది విదర్బతో రంజీమ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన ధృవ్ జురెల్ కు ఇప్పటి వరకూ ఆడిన 15 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 790 పరుగులతో 46 సగటు సాధించిన రికార్డు ఉంది. ఓ సెంచరీతో పాటు ఐదు హాఫ్ సెంచరీలు సైతం ధృవ్ ఖాతాలో చేరాయి.

తనకు అవకాశం దొరికితే భారత్ సీనియర్ జట్టులో సభ్యుడిగా సత్తా చాటుకోడానికి సిద్ధమని ధృవ్ ప్రకటించాడు. తాను క్రికెటర్ గా ఎదగడం వెనుక అమ్మానాన్నల ప్రోత్సాహం, కృషి, పట్టుదల ఉన్నాయని, అమ్మత్యాగాన్ని తాను వృధాపోనివ్వనని తెలిపాడు.

జైపూర్ ఫ్రాంచైజీ సభ్యుడిగా కెప్టెన్ సంజు శాంసన్, సీనియర్ ప్లేయర్ జోస్ బట్లర్ తనను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని, తమ టీమ్ డైరెక్టర్ కుమార సంగక్కర తనకు కొండంత అండని ఈ యువవికెట్ కీపర్ బ్యాటర్ చెబుతున్నాడు.

భారత టెస్టు వికెట్ కీపర్ గా రిషభ్ పంత్ స్థానంలో చేరిన ఇషాన్ కిషన్ అందుబాటులో లేకపోడం, స్పెషలిస్ట్ వికెట్ కీపర్ బ్యాటర్ భరత్ వరుస వైఫల్యాలు... ధృవ్ జురెల్ కు కలసి వచ్చాయి.

చిరుప్రాయంలోనే టెస్టు క్యాప్ సాధించిన జురెల్ కీపర్ గా మాత్రమే కాదు..బ్యాటర్ గాను సత్తా చాటుకోగలిగితేనే జట్టులో నిలదొక్కుకోగలుగుతాడు.

First Published:  16 Feb 2024 10:45 AM IST
Next Story