Telugu Global
Sports

భారత బల్లెంవీరుడికి రజత పతకం!

భారత బల్లెంవీరుడు నీరజ్ చోప్రా రజత పతకంతో పారిస్ ఒలింపిక్స్ సన్నాహాలు ప్రారంభించాడు. డైమండ్ లీగ్ తొలి అంచె పోటీలో 88.36 మీటర్ల రికార్డు నమోదు చేశాడు.

భారత బల్లెంవీరుడికి రజత పతకం!
X

భారత బల్లెంవీరుడు నీరజ్ చోప్రా రజత పతకంతో పారిస్ ఒలింపిక్స్ సన్నాహాలు ప్రారంభించాడు. డైమండ్ లీగ్ తొలి అంచె పోటీలో 88.36 మీటర్ల రికార్డు నమోదు చేశాడు.

జావలిన్ త్రో ( బల్లెవిసురుడు ) లో ప్రపంచ, ఒలింపిక్ విజేత, భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా..పారిస్ ఒలింపిక్స్ స్వర్ణానికి గురిపెట్టాడు. యూరోప్ కేంద్రంగా గత కొద్దివారాలుగా శిక్షణ పొందుతున్న నీరజ్ ..2024 డైమండ్ లీగ్ దోహా అంచెపోటీలతో ఒలింపిక్స్ బంగారు పతకం వేటకు శ్రీకారం చుట్టాడు.

2 సెంటీమీటర్ల తేడాతో చేజారిన స్వర్ణం..

ఖతర్ రాజధాని దోహా వేదికగా జరిగిన డైమండ్ లీగ్ తొలి అంచెపోరులో 26 సంవత్సరాల నీరజ్ స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయాడు. చెక్ రిపబ్లిక్ కు చెందిన వెటరన్ అథ్లెట్ యాకోబ్ వాడ్లిచ్ కంటే 2 సెంటీమీటర్లు తక్కువ విసిరి రజత పతకంతో సరిపెట్టుకొన్నాడు.

వాడ్లిచ్ 88. 38 మీటర్ల రికార్డుతో అగ్రస్థానంలో నిలిస్తే నీరజ్ మాత్రం 88.36 మీటర్ల దూరం మాత్రమే బల్లెం విసరగలిగాడు. వాడ్లిచ్ తన మూడో ప్రయత్నంలో 88. 38 మీటర్ల రికార్డు సాధించగలిగాడు.

గతేడాది జరిగిన దోహా డైమండ్ లీగ్ అంచె పోటీలో బంగారు పతకం నెగ్గిన నీరజ్..తన ఆఖరి ప్రయత్నంలో వాడ్లిచ్ ను అధిగమించడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు.

రెండుసార్లు ప్రపంచ చాంపియన్ యాండర్సన్ పీటర్స్ 86. 62 మీటర్ల రికార్డుతో కాంస్య పతకంతో సరిపెట్టుకొన్నాడు.

కిశోర్ కుమార్ జెనాకు 9వ స్థానం...

ఇదే టోర్నీలో తొలిసారిగా పాల్గొన్న భారత మరో అథ్లెట్ కిశోర్ కుమార్ జెనా 76. 31 మీటర్ల రికార్డుతో మూడోరౌండ్లోనే నిష్క్రమించాడు. తన ఆఖరి ప్రయత్నంలో 76. 31 మీటర్ల రికార్డుతో ఆఖరి నుంచి రెండోస్థానంలో నిలిచాడు.

ప్రపంచంలోని పదిమంది అత్యుత్తమ బల్లెం వీరుల నడుమ జరిగిన ఈ పోరులో నీరజ్ 2వ స్థానం, జెనా 9వ స్థానం సాధించారు. హాంగ్జు ఆసియాక్రీడల్లో 87. 54 మీటర్ల రికార్డుతో రజత పతకం సాధించిన కిశోర్ కుమార్ జెనా..ప్రస్తుత డైమండ్ మీట్ తొలి అంచెలో విఫలమయ్యాడు.

గతేడాది జరిగిన డైమండ్ లీగ్ తో పాటు..టోక్యో ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్షిప్ పోటీలలో నీరజ్ చోప్రా బంగారు పతకాలు సాధించగా..వాడ్లిచ్ ఒలింపిక్స్ లో రజత, ప్రపంచ మీట్ లో కాంస్య పతకాలు నెగ్గాడు.

2023- డైమండ్ లీగ్ దోహా అంచె పోటీలలో నీరజ్ చోప్రా 88.67 మీటర్ల రికార్డుతో బంగారు పతకం అందుకోగా 88.63 మీటర్లతో వాడ్లిచ్ రజత, 85.88 మీటర్ల రికార్డుతో పీటర్స్ కాంస్య పతకాలు అందుకొన్నారు.

ప్రస్తుత సీజన్ తొలి టోర్నీలో నీరజ్ తన తొలి ప్రయత్నంలో ఫౌల్ కాగా..రెండో త్రోలో 84. 93 మీటర్లు, మూడో త్రోలో 86.24 మీటర్లు నమోదు చేశాడు. తన చివరి మూడు త్రోలలో నీరజ్ 86.18, 82.28 మీటర్లు, 88.38 మీటర్ల రికార్డులు సాధించాడు.

2022 సీజన్ డైమండ్ లీగ్ మూడు అంచెల్లో బంగారు పతకాలతో ఓవరాల్ చాంపియన్ గా నిలిచిన నీరజ్...మే 12 నుంచి భువనేశ్వర్ వేదికగా జరిగే ఫెడరేషన్ కప్ టోర్నీలో పాల్గోనున్నాడు.

ఫెడరేషనకప్ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ పోటీలలో నీరజ్ మూడేళ్ల విరామం తరువాత పాల్గొనబోతున్నాడు. 2021 మార్చి 17న జరిగిన ఫెడరేషన్ కప్ మీట్ లో నీరజ్ 87. 80 మీటర్ల రికార్డుతో బంగారు పతకం అందుకొన్నాడు. ఆ తరువాత నుంచి అంతర్జాతీయ టోర్నీలకు మాత్రమే పరిమితమయ్యాడు.

జూన్ 18న ఫిన్లాండ్ వేదికగా జరిగే పావో నూర్మీ గేమ్స్,జులై 7న పారిస్ వేదికగా జరిగే డైమండ్ లీగ్ రెండో అంచె పోటీలో నీరజ్ పాల్గోనున్నాడు. బ్రసెల్స్ వేదికగా సెప్టెంబర్ 13, 14 తేదీలలో డైమండ్ లీగ్ చాంపియన్స్ ట్రోఫీని నిర్వహిస్తారు.

First Published:  11 May 2024 12:02 PM GMT
Next Story