సెంచరీ మిస్సయినా జురెల్.. జిగేల్
ఒక్క రజత్ పటీదార్ తప్ప కొత్త ఆటగాళ్లంతా అవకాశాల్ని రెండు చేతులతో ఒడిసిపట్టేసుకుంటున్నారు.
ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో అరంగేట్రం చేసిన ఆటగాళ్లంతా సూపర్ హిట్టవుతున్నారు. ఒక్క రజత్ పటీదార్ తప్ప కొత్త ఆటగాళ్లంతా అవకాశాల్ని రెండు చేతులతో ఒడిసిపట్టేసుకుంటున్నారు. మొన్న సర్పరాజ్, నిన్న ఆకాశ్‌దీప్, నేడు ధ్రువ్ జురెల్ ఈ లైన్‌లో ఉన్నారు. నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో వీరోచితంగా పోరాడిన ధ్రువ్ జురెల్ 90 పరుగులతో జిగేల్ మన్నాడు. సెంచరీ మిస్ చేసుకున్నా కూడా సూపర్ ఇన్నింగ్స్‌తో శభాష్ అనిపించుకున్నాడు.
177కి 7 వికెట్ల నుంచి 307 ఆలౌట్
353 పరుగుల ఇంగ్లాండ్ స్కోరుకు సమాధానంగా బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా ఓ దశలో 177 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అశ్విన్, జడేజా కూడా వెనుదిరగడంతో ఇండియా 200లోపే ఆలౌటవడం ఖాయం అనిపించింది. కానీ యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ సహనంతో ఆడాడు. కుల్‌దీప్ యాదవ్‌తో కలిసి ఒక్కో పరుగూ పేర్చుకుంటూ జట్టు స్కోరును 300 దాకా లాక్కెళ్లాడు. చక్కటి స్ట్రోకులతోనూ అలరించిన జువ్ 90 పరుగుల వద్ద వెనుదిరిగాడు. చివరికి 307 పరుగులకు భారత్ ఆలౌటయింది.