Telugu Global
Sports

క్రికెటర్లకు బ్రహ్మరథమా...చిరాగ్ చిటపటలు!

భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ చిరాగ్ షెట్టి చిటపటలాడాడు. ఇదేమీ వివక్ష అంటూ మహారాష్ట్ర్ర ప్రభుత్వంపై విరుచుకు పడ్డాడు.

క్రికెటర్లకు బ్రహ్మరథమా...చిరాగ్ చిటపటలు!
X

భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ చిరాగ్ షెట్టి చిటపటలాడాడు. ఇదేమీ వివక్ష అంటూ మహారాష్ట్ర్ర ప్రభుత్వంపై విరుచుకు పడ్డాడు.

చిరాగ్ షెట్టి...భారత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ ను ఉన్నత శిఖరాలకు చేర్చిన ఆటగాడు. తెలుగుతేజం సాత్విక్ సాయిరాజ్ తో కలసి ప్రపంచ నంబర్ వన్ ర్యాంకు సాధించడంతో పాటు భారత్ ను థామస్ కప్ బ్యాడ్మింటన్లో కాంస్య విజేతగా నిలిపిన మొనగాడు. త్వరలో జరిగే పారిస్ ఒలింపిక్స్ బరిలో భారత్ కు బంగారు పతకం సాధించిపెట్టాలన్న లక్ష్యంతో తన సాధన కొనసాగిస్తున్నాడు.

మహారాష్ట్ర్ర సూపర్ స్టార్ చిరాగ్ ...

భారత బ్యాడ్మింటన్ డబుల్స్ సూపర్ స్టార్ ప్లేయర్లలో ఒకడిగా నిరాజనాలు అందుకొంటున్న చిరాగ్ షెట్టి మహారాష్ట్ర్ర నుంచి అంతర్జాతీయ బ్యాడ్మింటన్ లోకి దూసుకొచ్చాడు.

గత కొద్ది సంవత్సరాలుగా అత్యంత నిలకడగా రాణిస్తూ భారత్ కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. అయితే..మహారాష్ట్ర్ర ప్రభుత్వం తాను సాధించిన విజయాలను పట్టించుకోకపోడం పట్ల తొలిసారిగా ఆవేదన వ్యక్తం చేశాడు.

2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ విజేత భారతజట్టులోని నలుగురు మహారాష్ట్ర్ర ఆటగాళ్లు, జట్టు సహాయక సిబ్బంది సభ్యులను మహారాష్ట్ర్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించి..11 కోట్ల రూపాయలు నజరానాగా ప్రకటించడంతో చిరాగ్ కు చిర్రెత్తుకొచ్చింది. ఇదెక్కడి వివక్ష, ఇదేమీ న్యాయమంటూ మరాఠా సర్కార్ ను నిలదీశాడు.

క్రికెటేతర ఆటలంటే అంత అలుసా?

భారత క్రికెటర్లంటే తనకు ఎంతో గౌరవమని, ప్రపంచకప్ సాధించిన మరాఠా క్రికెటర్లను సత్కరించడం అభినందనీయమని..అయితే మహారాష్ట్ర్రకే చెందిన తాను..బ్యాడ్మింటన్ టీమ్ విభాగంలో ప్రపంచకప్ లాంటి థామస్ కప్ ను సాధించానని, డబుల్స్ లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించానని, ప్రపంచ, ఆసియా క్రీడల్లో బంగారు పతకాలు, అంతర్జాతీయస్థాయిలో డజన్ల కొద్దీ పతకాలు సాధించినా మహారాష్ట్ర్ర ప్రభుత్వం తనను ఏనాడూ పట్టించుకోలేదని, అసలు గుర్తించనేలేదని చిరాగ్ వాపోయాడు. అదే ప్రపంచకప్ సాధించిన భారతజట్టులోని మహారాష్ట్ర్ర ఆటగాళ్లు, ఇతర సభ్యులను ( రోహిత్ శర్మ, శివం దూబే, సూర్యకుమార్ యాదవ్, బౌలింగ్ కోచ్ పరస్ మాంబ్రే ) ఆ రాష్ట్ర్రప్రభుత్వం 11 కోట్ల రూపాయల నజరానాతో సత్కరించింది.

ఇప్పటికే బీసీసీఐ 125 కోట్ల రూపాయలను భారతజట్టుకు ప్రోత్సాహకంగా అంద చేసింది. ఇప్పుడు మహారాష్ట్ర్ర ప్రభుత్వం సైతం 11 కోట్ల రూపాయలు..భారతజట్టులోని ఆ రాష్ట్ర్ర ఆటగాళ్లకు ప్రకటించడంతో..చిరాగ్ లో అసహన పెరిగింది. క్రికెటర్లనే అక్కున చేర్చుకొంటూ..మిగిలిన క్రీడలకు చెందినవారిని పట్టించుకోకపోడం పట్ల అసహనం వ్యక్తం చేశాడు.

బ్యాడ్మింటన్లో ప్రపంచకప్ సాధించిన తనను ఏమాత్రం పట్టించుకోని మహారాష్ట్ర్ర ప్రభుత్వం..క్రికెటర్లను ఘనంగా సత్కరించడం విడ్డూరంగా ఉందని, క్రికెట్ ను ఒకరకంగా..మిగిలిన క్రీడలను మరో రకంగా చూడటం తగదని వాపోయాడు.

First Published:  8 July 2024 12:51 PM IST
Next Story