కార్ల్‌సన్ నిరభ్యంతరంగా టోర్నీలో కొనసాగొచ్చు
డ్రెస్ కోడ్ గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నఫిడే సీఈవో ఎమిల్ స్కుటోవ్క్సీ
ప్రపంచ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన చెస్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్‌సన్ వ్యవహారంపై ఫిడే సీఈవో ఎమిల్ స్కుటోవ్క్సీ స్పందించారు. జీన్స్ వేసుకొని వచ్చి డ్రెస్ కోడ్‌ను ఉల్లఘించడంతో తనపై వేటు వేసినట్లు మాగ్నస్ తెలిపాడు. దీంతో తాను టోర్నీ నుంచి వైదొలిగినట్లు వెల్లడించాడు. ఇప్పుడు సుటోవ్క్సీ వివరణ ఇస్తూ.. కార్ల్‌సన్ పోటీల్లో పాల్గొనవచ్చని స్పష్టం చేశాడు. డ్రెస్ మార్చుకోవడానికి ఆయనకు అవకాశం ఇచ్చినట్లు తెలిపారు.
ఈ టోర్నీలో ఆడకుండా మాగ్నస్ ను ఫిడే నిషేధించలేదు. ఆదివారం కొనసాగేందుకు వీలున్నది. డ్రెస్ లను మార్చుకోవడానికి సమయం ఇచ్చాం. కానీ ఇంటర్వ్యూల్లో మాత్రం వేరేగా స్పందించాడు. అతడినే టార్గెట్ చేస్తున్నట్లుగా మాట్లాడాడు. కానీ నిబంధనలు అందరికీ ఒకేలా ఉంటాయి. డ్రెస్ కోడ్ గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. గతంలోనూ డ్రెస్ కోడ్‌ను ఉల్లంఘించిన వారికి జరిమానా విధించాం. ఇదేమీ తాము వేయడం లేదు. అథ్లెట్ కమిషన్ సూచన మేరకు ఉంటుంది. ఈ కమిషన్ లో గ్రాండ్ మాస్టర్లు ఉంటారు అని ఫిడే సీఈవో వెల్లడించారు.
ఇలాంటి పరిణామాలు ఎదురైనందుకు విచారం వ్యక్తం చేస్తున్నాం. మాగ్నస్‌ను అతడి ఫ్యామిలీని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అతడి కుటుంబం పట్ల మాకు గౌరవం ఉన్నది. అయితే చీఫ్ ఆర్బిటర్ అలెక్స్ తీసుకున్న నిర్ణయానికి పూర్తి మద్దతు తెలుపుతున్నా. అదే సమయంలో కార్ల్‌సన్ నిరభ్యంతరంగా టోర్నీలో కొనసాగొచ్చు అని సుటోవ్క్సీ స్పష్టం చేశారు. అంతకుముందు రష్యా గ్రాండ్ మాస్టర్ ఇయాన్ నెపోమ్‌నియాట్చికి జరిమానా పడింది. వెంటనే తన డ్రెస్‌లను మార్చుకొంటానని కోరాడు. ఆ తర్వాత టోర్నీలో కొనసాగాడు.