Telugu Global
Sports

ప్రపంచకప్ లో బుమ్రా బూమ్ బూమ్ రికార్డు!

భారత యార్కర్లకింగ్ జస్ ప్రీత్ బుమ్రా మరో అరుదైన ఘనత సాధించాడు. పేసర్ హార్థిక్ పాండ్యా రికార్డును అధిగమించాడు.

ప్రపంచకప్ లో బుమ్రా బూమ్ బూమ్ రికార్డు!
X

భారత యార్కర్లకింగ్ జస్ ప్రీత్ బుమ్రా మరో అరుదైన ఘనత సాధించాడు. పేసర్ హార్థిక్ పాండ్యా రికార్డును అధిగమించాడు.

భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా ప్రపంచకప్ లీగ్ మ్యాచ్ ల్లో చెలరేగిపోతున్నాడు. పదునైన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు.

గ్రూప్- ఏ ప్రారంభమ్యాచ్ లో ఐర్లాండ్ ను, రెండోమ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ బ్యాటర్లను ఓ ఆటాడుకొన్నాడు. మొదటి రెండుమ్యాచ్ ల్లోనే 5 వికెట్లు పడగొట్టడం ద్వారా మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు.

64 టీ-20 మ్యాచ్ ల్లో 79 వికెట్లు...

న్యూయార్క్ లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరిగిన కీలక లోస్కోరింగ్ పోరులో బుమ్రా విశ్వరూపమే ప్రదర్శించాడు. తనజట్టు 119 పరుగుల స్కోరును కాపాడుకోడంలో ప్రధానపాత్ర వహించాడు.

తన కోటా 4 ఓవర్లలో కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి..పాక్ ఓపెనింగ్ జోడీ రిజ్వాన్, బాబర్ ల వికెట్లతో పాటు ఇఫ్తీకర్ అహ్మద్ ను సైతం అవుట్ చేయడం ద్వారా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. 3.50 ఎకానమీతో వారేవ్వా అనిపించుకొన్నాడు.

ఈ క్రమంలో భారత మూడవ అత్యుత్తమ బౌలర్ గా రికార్డుల్లో చేరాడు. టీ-20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ రికార్డు లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్ పేరుతో ఉంది. 80 మ్యాచ్ ల్లో చహాల్ 96 వికెట్లతో 25.09 సగటు, 8.19 ఎకానమీ నమోదు చేశాడు.

రెండోస్థానంలో స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ 87 మ్యాచ్ ల్లో 90 వికెట్లతో ఉన్నాడు. బుమ్రా కేవలం 64 మ్యాచ్ ల్లోనే 79 వికెట్లు పడగొట్టడం ద్వారా మూడో స్థానం సాధించాడు.

ఇప్పటి వరకూ 3వ స్థానంలో ఉంటూ వచ్చిన హార్థిక్ పాండ్యా 94 మ్యాచ్ ల్లో 78 వికెట్లతో 4వ స్థానానికి పడిపోయాడు. టీ-20 చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ రికార్డు మాత్రం న్యూజిలాండ్ వెటరన్ పేసర్ టిమ్ సౌథీ పేరుతో ఉంది. టిమ్ 123 మ్యాచ్ ల్లో 157 వికెట్లతో టాపర్ గా నిలిచాడు. 13 పరుగులకే 5 వికెట్ల అత్యుత్తమ ప్రదర్శనతో పాటు..8.13 ఎకానమీ, 23.15 సగటు సాధించాడు.

మేడిన్ ఓవర్లలో బుమ్రా భారత రికార్డు...

టీ-20 క్రికెట్ చరిత్రలో అత్యధిక మేడిన్ ఓవర్లు వేసిన బౌలర్ గా బుమ్రా మరో రికార్డు నెలకొల్పాడు. ఓవర్ ఆరు బంతుల్లో కనీసం ఒక్క పరుగు ఇవ్వకుండా కట్టిడి చేయటమే మేడిన్ ఓవర్.

న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్ తో జరిగిన ప్రపంచకప్ ప్రారంభ గ్రూపు లీగ్ మ్యాచ్ లో బుమ్రా ఓ మేడిన్ ఓవర్ వేయటం ద్వారా తన కెరియర్ లో 12వసారి ఈ ఘనత సాధించాడు. ఇప్పటి వరకూ భువనేశ్వర్ పేరుతో ఉన్న 11 మేడిన్ ఓవర్ల రికార్డును బుమ్రా అధిగమించాడు.

బుమ్రా కంటే అత్యధిక మేడిన్లు వేసిన మరో ఇద్దరు బౌలర్లున్నారు. ఉగాండాకు చెందిన ఫ్రాంక్ సుబుగా 14 మేడిన్ ఓవర్లలో ప్రపంచ నంబర్ వన్ గా ఉంటే..కెన్యా బౌలర్ షెమ్ గోచీ 14 మేడిన్ ఓవర్లలో రెండోస్థానంలో కొనసాగుతున్నాడు.

టెస్టు హోదా పొందిన దేశాల బౌలర్లలో మాత్రం బుమ్రా పేరుతోనే 12 మేడిన్ ఓవర్ల ప్రపంచ రికార్డు ఉండటం విశేషం. ప్రపంచకప్ గ్రూపు లీగ్ లో భాగంగా పసికూన అమెరికా, కెనడాజట్లతో జరిగే పోటీలతో పాటు..సూపర్-8 రౌండ్లోనూ బుమ్రా ..భారతజట్టుకు కీలకంకానున్నాడు.

First Published:  10 Jun 2024 9:15 AM IST
Next Story