Telugu Global
Sports

ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ లో అక్కాతమ్ముడి పోరాటం!

2024- ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ మహిళల, పురుషుల విభాగాలలో భారత్ కు చెందిన అక్కాతమ్ముడు మొదటి నాలుగురౌండ్లలో చెరో గెలుపుతో సత్తా చాటుకొన్నారు.

ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ లో అక్కాతమ్ముడి పోరాటం!
X

2024- ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ మహిళల, పురుషుల విభాగాలలో భారత్ కు చెందిన అక్కాతమ్ముడు మొదటి నాలుగురౌండ్లలో చెరో గెలుపుతో సత్తా చాటుకొన్నారు.

కెనడాలోని టొరాంటో వేదికగా జరుగుతున్న 2024- ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ పురుషుల, మహిళల విభాగాలలో మొదటి నాలుగురౌండ్ల సమరం ఆసక్తికరంగా సాగింది.

పురుషుల విభాగంలో ముగ్గురు ( ప్రజ్ఞానంద్, గుకేశ్, విదిత్ గుజరాతీ ), మహిళల విభాగంలో ఇద్దరు ( కోనేరు హంపి, వైశాలీ ) గ్రాండ్మాస్టర్లు పోటీకి దిగటమే కాదు..తమకంటే మెరుగైన ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టడం ద్వారా తమ సత్తాను చాటుకోగలిగారు.

చాలెంజర్ స్థానం కోసం మారథాన్ సమరం...

ప్రపంచ చెస్ పురుషుల, మహిళల విభాగాలలోని ఏడుగురు చొప్పున అత్యుత్తమ గ్రాండ్మాస్టర్లు పోటీపడుతున్నారు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ గా ఉన్న చైనా సూపర్ గ్రాండ్మాస్టర్ డింగ్ లిరెన్ తో తలపడటానికి అర్హతగా ఈ క్యాండిడేట్స్ టోర్నీని ప్రపంచ చదరంగ సమాఖ్య నిర్వహిస్తోంది.

మహిళల విభాగంలో సైతం చైనాకే చెందిన వెంగ్ వీ విశ్వవిజేతగా కొనసాగుతోంది.

పురుషుల, మహిళల విభాగాలలో మొత్తం మూడువారాలపాటు జరిగే ఈ టోర్నీని డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ తరహాలో నిర్వహిస్తున్నారు. ఒక్కో గ్రాండ్మాస్టర్ తన ప్రత్యర్థితో రెండుసార్లు తలపడాల్సి ఉంది. మొత్తం 14 రౌండ్లలో అత్యధిక పాయింట్లు సాధించిన మొదటి ఇద్దరి నడుమ క్యాండిడేట్స్ టైటిల్ సమరాన్ని నిర్వహిస్తారు.

గత ఐదురోజుల్లో జరిగిన నాలుగు రౌండ్ల పోరులో హాట్ ఫేవరెట్, రష్యాకు చెందిన ఇయాన్ నెపిమోనిచ్ 3 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

విదిత్ గుజరాతీ, ఫిరోజా అలీరెజాలపై నెగ్గిన నెపిమోనిచ్ మిగిలిన రెండురౌండ్ల మ్యాచ్ లను డ్రాగా ముగించడం ద్వారా పాయింట్ల పట్టిక అగ్రభాగాన నిలువగలిగాడు.

తొలిసారిగా బరిలో నిలిచిన భారత యువగ్రాండ్మాస్టర్ల త్రయం మాత్రం మిశ్రమఫలితాలు ఎదుర్కొనాల్సి వచ్చింది.

ప్రారంభ రౌండ్లలో ప్రపంచ మూడోర్యాంక్ ప్లేయర్ హికారు నకామురాపై భారత గ్రాండ్ మాస్టర్ విదిత్ గుజరాత్ సంచలన విజయంతో తన పోరు ప్రారంభించాడు.

రెండోస్థానంలో గుకేశ్...

ప్రపంచ రెండోర్యాంక్ ఆటగాడు ఫేబియానో కరూనా, భారత టాప్ ర్యాంక్ స్టార్ గుకేశ్ చెరో 2.5 పాయింట్లు చొప్పున సాధించి లీగ్ టేబుల్ రెండోస్థానంలో కొనసాగుతున్నారు.

చెన్నై చిన్నోడు ప్రజ్ఞానంద్ 4 రౌండ్లలో 2 పాయింట్లతో నాలుగోస్థానంలో నిలిచాడు. విదిత్ గుజరాతీ అబసోవా, అలీరెజా, నకమురా 1.5 పాయింట్లతో 5వ స్థానంలో ఉన్నారు.

గ్రాండ్మాస్టర్ నెపోమినిచ్ తో జరిగిన కీలక పోరులో గుకేశ్ గట్టిపోటీ ఇచ్చినా పూర్తి పాయింటు సాధించలేకపోయాడు. ప్రజ్ఞానంద్ పై సంచలన విజయం సాధించడం ద్వారా గుకేశ్ తను పాయింట్ల సంఖ్యను 2.5కు పెంచుకోగలిగాడు.

గుకేశ్ చేతిలో ఓటమి పొందిన ప్రజ్ఞానంద్ 4వ రౌండ్ పోరులో మాత్రం తన దేశానికే చెందిన విదిత్ గుజరాతీని కంగు తినిపించడం ద్వారా తేరుకోగలిగాడు.

మహిళల విభాగంలో తలపడుతున్న ప్రజ్ఞానంద్ సోదరి వైశాలి సైతం నాలుగో రౌండ్ విజయంతో సత్తా చాటుకోగలిగింది. కోనేరు హంపి మాత్రం తొలి ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

5వ రౌండ్లో ఎవరితో ఎవరెవరు?

ఓ రోజు విశ్రాంతి అనంతరం ప్రారంభంకానున్న 5వ రౌండ్ పోటీలు కీలకంకానున్నాయి. ఫిరోజా అలీరెజాతో హికారు నకమురా, గుకేశ్ తో నిజత్ అబ్సోవ్, విదిత్ గుజరాతీతో ఫేబియానో కరూనా, టాప్ ర్యాంక్ ప్లేయర్ ఇయాన్ నెపోమినిచ్ తో భారత చిచ్చరపిడుగు ప్రజ్ఞానంద్ తలపడనున్నారు.

ప్రపంచ మేటి గ్రాండ్మాస్టర్ల సత్తాకు పరీక్షగా నిలిచే ఈ టోర్నీలో ప్రతి 4 రౌండ్ల తరువాత ఓ రోజు విశ్రాంతి ఇవ్వనున్నారు.

First Published:  10 April 2024 8:03 AM GMT
Next Story