యష్ దయాళ్.. గాయపడ్డ సింహంలా గర్జించాడు
మొన్నటి మినీ వేలంలో ఆర్సీబీ యష్ దయాల్‌ను తీసుకుంది. చావో రేవో తేలిపోయే ఓవర్‌లో అతనికి బంతి ఇచ్చి మరింత ఆత్మవిశ్వాసం పెంచాడు ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్.
చెన్నైతో మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్‌కి వెళ్లి సంచలనం సృష్టించింది ఆర్సీబీ. ఈ మ్యాచ్‌లో అసలు హీరో చివరి ఓవర్ బౌలింగ్ చేసిన యష్ దయాళ్. పెద్ద పేరున్న బౌలర్ కాదు.. ఐపీఎల్‌లో స్టార్ అంతకన్నా కాదు.. సో సో బౌలర్. అవతల ఉన్నది క్రికెట్ యోధుడు మహేంద్ర సింగ్ ధోనీ. అలాంటి బ్యాట్స్‌మన్ మొదటి బంతిని సిక్సు బాదేస్తే తర్వాత బాల్ వేయడానికే బౌలర్ వణికిపోతాడు. కానీ, యష్ తర్వాత బాల్‌కే ధోనీని అవుట్ చేయడమే కాదు, తర్వాత నాలుగు బంతుల్లో కేవలం ఒక్క పరుగే ఇచ్చి, జట్టును గెలిపించేశాడు. కానీ యష్ అద్భుత ప్రదర్శన వెనుక ఏడాది ఆవేదన ఉంది. అంతులేని అవమానం ఉంది. గాయపడిన సింహంలా గర్జించాలన్న తపన ఉంది.
నిరుడు రింకూ సింగ్ దెబ్బకు ఆస్పత్రి పాలు
గతేడాది గుజరాత్ టైటాన్స్‌కి ఆడిన యష్ దయాళ్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో తీవ్ర పరాభవాన్ని చవిచూశాడు. కోల్‌కతా బ్యాటర్ రింకూసింగ్ యష్ ఓవర్లో 5 బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టడంతో మానసికంగా వేదనకు గురైన యష్ తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రి పాలయ్యాడు. ఇప్పట్లో అతను కోలుకొని మళ్లీ మ్యాచ్‌లు ఆడడం కష్టమేనని జట్టు యాజమాన్యం ప్రకటించింది. తర్వాత జట్టులో నుంచి తీసేసింది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అక్కున చేర్చుకుంది
అయితే మొన్నటి మినీ వేలంలో ఆర్సీబీ యష్ దయాల్‌ను తీసుకుంది. చావో రేవో తేలిపోయే ఓవర్‌లో అతనికి బంతి ఇచ్చి మరింత ఆత్మవిశ్వాసం పెంచాడు ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్. అప్పుడే యష్ నిర్ణయించుకున్నాడు. అసలిక క్రికెట్ భవిష్యత్తు లేదనే స్థాయి నుంచి కోలుకొని హోరాహోరీ పోరులో తన చేతికి బంతి అందే వరకు పడిన కష్టం గుర్తొచ్చింది. తనను తీసుకుని వెన్నుతట్టిన ఆర్సీబీ టీం, కెప్టెన్ డుప్లెసిస్ గుర్తొచ్చారు. తన అత్యుత్తమ బౌలింగ్‌ను ప్రదర్శించాలని అతను ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు.
తొలి బంతికే సిక్స్.. కానీ
ప్లే ఆఫ్స్‌కి వెళ్లాలంటే చివరి ఓవర్‌లో 17 పరుగులు కావాలి. వాళ్లను 17 పరుగుల్లోపు ఆపితే ఆ బెర్త్ ఆర్సీబీది. ఇలాంటి పరిస్థితుల్లో యష్ బౌలింగ్ మొదలయింది. బ్యాట్స్‌మన్ ధోనీ. తొలి బంతే మహేంద్రుడి బ్యాట్‌ను తాకి 110 మీటర్ల అవతల పడింది. ఇక అయిపోయింది ఆర్సీబీ పని. యష్ దయాల్ కెరీర్లీ మరో మచ్చ తప్పదని ఫ్యాన్స్ నిర్ణయించేసుకున్నారు. కానీ బెంగళూరు ఆశలను మోస్తూ రెండో బంతి విసిరిన యష్ ధోనీని అవుట్ చేశాడు. అంతే... అంతటి కూల్ ధోనీ కూడా బ్యాట్‌ను ఎడమ చేత్తో కొట్టుకుంటూ ఆగ్రహంతో వెనుదిరిగాడు. తర్వాత నాలుగు బంతుల్లో కేవలం ఒకే ఒక్క పరుగు ఇచ్చి తమ జట్టును ప్లే ఆఫ్స్‌కి సగర్వంగా తీసుకెళ్లాడు యష్. మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచి ఉండొచ్చు కానీ హీరో మాత్రం యష్ దయాళే.