Telugu Global
Sports

అశ్విన్ కు 500 బంగారు కాసులతో అపూర్వ సత్కారం!

టెస్టు చరిత్రలో అరుదైన జంట రికార్డులు నెలకొల్పిన భారత స్పిన్ జాదూ రవిచంద్రన్ అశ్విన్ ను తమిళనాడు క్రికెట్ సంఘం అపూర్వరీతిలో సత్కరించింది.

అశ్విన్ కు 500 బంగారు కాసులతో అపూర్వ సత్కారం!
X

టెస్టు చరిత్రలో అరుదైన జంట రికార్డులు నెలకొల్పిన భారత స్పిన్ జాదూ రవిచంద్రన్ అశ్విన్ ను తమిళనాడు క్రికెట్ సంఘం అపూర్వరీతిలో సత్కరించింది.

భారత క్రికెట్ కు గత 13 సంవత్సరాలుగా విలక్షణ సేవలు అందిస్తూ దేశానికి మాత్రమే కాదు..తమ రాష్ట్ర్రానికి ఖ్యాతి తెచ్చిన రవిచంద్రన్ అశ్విన్ ను తమిళనాడు క్రికెట్ సంఘం అరుదైన రీతిలో , అపురూప సత్కారంతో ఉక్కిరిబిక్కిరి చేసింది.

చెన్నై వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో భారత మాజీ కెప్టెన్ అనీల్ కుంబ్లే చేతుల మీదుగా ఈ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించింది.

100 టెస్టులు....500 వికెట్లు....

తొమ్మిది దశాబ్దాల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో 100 టెస్టులు ఆడడంతో పాటు 500కు పైగా వికెట్లు పడగొట్టిన రండోబౌలర్ గా, 14వ ఆటగాడిగా జంట రికార్డులు నెలకొల్పిన 37 సంవత్సరాల అశ్విన్ ను తమిళనాడు క్రికెట్ సంఘం అక్కున చేర్చుకొంది.

ఐసీసీ టెస్టు లీగ్ సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ తో ముగిసిన సిరీస్ లో అశ్విన్ ఏకంగా 26 వికెట్లు పడగొట్టడం ద్వారా టాప్ బౌలర్ గా నిలిచాడు. రాజకోట టెస్టులో 500 వికెట్ల మైలురాయిని చేరడంతో పాటు..ధర్మశాల టెస్టు ద్వారా 100 టెస్టుల రికార్డును సైతం పూర్తి చేయగలిగాడు.

14వ భారత క్రికెటర్ అశ్విన్...

టెస్టు చరిత్రలో 100 టెస్టులు ఆడిన భారత 14వ క్రికెటర్ గా రికార్డుల్లో చేరిన అశ్విన్...500 కు పైగా వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్ గాను నిలిచాడు. భారత టెస్టు చరిత్రలో ముందుగా 500 వికెట్లు పడగొట్టిన అనీల్ కుంబ్లే చేతుల మీదుగా అశ్విన్ కు తమిళనాడు క్రికెట్ సంఘం సత్కారకార్యక్రమం నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో అశ్విన్ తన కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో కలసి పాల్గొన్నాడు.

500 వికెట్లు పడగొట్టిన అశ్విన్ కు 500 బంగారు కాసులు నజరానాగా ఇచ్చింది. 100 టెస్టులు ఆడినందుకు కోటిరూపాయలు నగదు బహుమతి అందచేసింది.

ధోనీకి జీవితాంతం రుణపడి ఉంటా..అశ్విన్...

తమిళనాడు క్రికెట్ సంఘం తనను అపూర్వరీతిలో సత్కరించడంతో అశ్విన్ ఉబ్బితబ్బిబ్బయాడు. తన ఈ ఉన్నతి వెనుక కుటుంబసభ్యులతో పాటు పలువురు భారత మాజీ క్రికెటర్ల ప్రోత్సాహం ఉందని గుర్తు చేసుకొన్నాడు.

భారత్ కమ్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లేకుంటే తన క్రికెట్ జీవితమే లేదని, తాను సాధించిన ఈ అరుదైన రికార్డులన్నీ ధోనీ పుణ్యమేనని అశ్విన్ ప్రకటించాడు.

2011 ఐపీఎల్ ఫైనల్లో చెన్నై కెప్టెన్ ధోనీ తన చేతికి కొత్తబంతి ఇవ్వడమే తన కెరియర్ లో గొప్పమలుపని, బెంగళూరు డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్ ను అవుట్ చేయడంతో

తనలో అంతులేని ఆత్మవిశ్వాసం వచ్చిందని, ఆ తర్వాత దశాబ్దకాలం పాటు తాను నిలకడగా రాణించగలిగానని, టెస్టు చరిత్రలో 100 టెస్టులు, 516 వికెట్ల రికార్డులు సాధించడం వెనుక ధోనీ తనతో చేసిన ప్రయోగం ఉందని తెలిపాడు.

తన తొలిరంజీ మ్యాచ్ లో కెప్టెన్ గా వ్యవహరించిన బద్రీనాథ్, ప్రస్తుత సెలెక్టర్ కమ్ అలనాటి బ్యాటర్ శరత్ సైతం తన ఉన్నతికి తోడ్పడ్డారని చెప్పాడు. 2008 ప్రారంభ ఐపీఎల్ లో అశ్విన్..చెన్నై ఫ్రాంచైజీజట్టులో చోటు సంపాదించినా...ముత్తయ్య మురళీధరన్ ప్రధాన స్పిన్నర్ గా ఉండడంతో తుదిజట్టులో చోటు సంపాదించలేకపోయాడు.

భారత ప్రస్తుత చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, మాజీ కోచ్ రవిశాస్త్రి, విఖ్యాత కామెంటీటర్ సునీల్ గవాస్కర్ , కెప్టెన్ రోహిత్ శర్మతో సహా పలువురు ప్రముఖులు అశ్విన్ ను ప్రశంసలతో ముంచెత్తారు.

First Published:  17 March 2024 6:13 PM IST
Next Story