Telugu Global
Sports

కోపా అమెరికాకప్ శిఖరాగ్రాన అర్జెంటీనా!

కోపా అమెరికాకప్ ఫుట్ బాల్ టోర్నీలో ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఉరుగ్వే 15 టైటిల్స్ రికార్డును అధిగమించింది.

కోపా అమెరికాకప్ శిఖరాగ్రాన అర్జెంటీనా!
X

కోపా అమెరికాకప్ ఫుట్ బాల్ టోర్నీలో ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఉరుగ్వే 15 టైటిల్స్ రికార్డును అధిగమించింది.

లాటిన్ అమెరికా, అమెరికా ఖండదేశాల ఫుట్ బాల్ చాంపియన్లకు ఇచ్చే కోపా అమెరికా కప్ ను లయనల్ మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా 16వసారి గెలుచుకొంది.

అమెరికా వేదికగా ముగిసిన 2024 కోపా అమెరికాకప్ ఫైనల్లో 1-0తో కొలంబియాను అధిగమించింది.

కోపా 'కింగ్' అర్జెంటీనా....

ఉరుగ్వే, చిలీ, బ్రెజిల్, మెక్సికో, కొలంబియా, పెనామా, కోస్టారికా, హోండురాస్, వెనిజ్వేలా, అమెరికా, కెనడా, జమైకా, పెరూ లాంటి మేటిజట్లు తలపడే కోపా అమెరికాకప్ ఫుట్ బాల్ టోర్నీలో ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా తనకు తిరుగేలేదని మరోసారి చాటుకొంది.

స్టార్ ఆటగాడు లయనల్ మెస్సీ నాయకత్వంలో 2021 కోపా అమెరికాకప్ గెలుచుకొన్న అర్జెంటీనా..అమెరికా వేదికగా ముగిసిన 2024 టోర్నీలో సైతం విజేతగా నిలిచింది.

ఎక్స్ ట్రా టైమ్ గోల్ తో నెగ్గిన అర్జెంటీనా...

సంచలనాల కొలంబియాతో మియామీలోని హార్డ్ రాక్ స్టేడియం వేదికగా జరిగిన టైటిల్ పోరులో అర్జెంటీనా అడుగడుగునా గట్టి పోటీ ఎదుర్కొంది. ఆట నిర్ణితసమయంలో కొలంబియాను అధిగమించలేకపోయింది. చివరకు గోల్ ల మాంత్రికుడు లయనల్ మెస్సీ మంత్రాలు సైతం కొలంబియా ముందు ఏమాత్రం ఫలించలేదు.

ఆట నిర్ణితసమయంలో ఏ జట్టూ గోలు చేయలేకపోడంతో స్కోరు 0-0తో ముగిసింది. దీంతో ఆటను అదనపు సమయానికి పొడిగించక తప్పలేదు. ఎక్స్ ట్రా టైమ్ లో సబ్ స్టిట్యూట్ ఆటగాడు లాటారో మార్టినేజ్ సాధించిన గోలుతో అర్జెంటీనా విజేతగా నిలువగలిగింది.

గత 28 అంతర్జాతీయ మ్యాచ్ ల్లో ఓటమి అంటే ఏమిటో తెలియని కొలంబియా చివరకు ఆర్జెంటీనాతో తుదివరకూ పోరాడి..ఓడాల్సి వచ్చింది. లయనల్ మెస్సీ గాయంతో ఆట నుంచి తప్పుకొన్న తరువాత కానీ అర్జెంటీనా ఎక్స్ ట్రా టైమ్ గోల్ తో విన్నర్ కాగలిగింది.

ఉరుగ్వేను మించిన అర్జెంటీనా...

కోపా అమెరికా కప్ టైటిల్ ను చెరో 15సార్లు నెగ్గడం ద్వారా ఉరుగ్వే, అర్జెంటీనా ఇప్పటి వరకూ సమఉజ్జీలుగా నిలువగలిగాయి. అయితే..2021, 2024 టైటిల్స్ సాధించడం ద్వారా అర్జెంటీనా 16వసారి విజేతగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. అత్యధికంగా 16సార్లు చాంపియన్ గా నిలిచిన తొలిజట్టు ఘనతను దక్కించుకొంది. సూపర్ స్టార్ లయనల్ మెస్సీ తన కెరియర్ లో ఆడిన ఆఖరి కోపాకప్ లోనూ బంగారు పతకం అందుకోడం విశేషం..

మెస్సీ ఖాతాలో 45వ టైటిల్...

2024 కోపా అమెరికాకప్ విజయంతో అర్జెంటీనా దిగ్గజం లయనల్ మెస్సీ మరో అరుదైన ప్రపంచ రికార్డు సాధించగలిగాడు. ఓ ప్రో- ఆటగాడిగా మెస్సీ సాకర్ ప్రస్థానంలో ఇది 45వ సీనియర్ టైటిల్ కావడం విశేషం.

గత నాలుగు సంవత్సరాలలో మెస్సీ నాయకత్వంలో అర్జెంటీనా రెండు కోపాకప్ ట్రోఫీలతో పాటు ఓ ప్రపంచకప్ టైటిల్ సైతం సాధించింది.

ఫుట్ బాల్ చరిత్రలో అత్యధిక సీనియర్ ట్రోఫీలు సాధించిన ఆటగాడి రికార్డు డానీ అల్వేజ్ పేరుతో ఉంది. డానీ 44 అంతర్జాతీయ టైటిల్స్ గెలుచుకోగా..లయనల్ మెస్సీ 45వ ట్రోఫీతో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పగలిగాడు.

ఓ ప్రపంచకప్, 39 క్లబ్ టైటిల్స్.....

లయనల్ మెస్సీ సాధించిన టైటిల్స్ లో 10 లా లీగా ట్రోఫీలు, నాలుగు చాంపియన్స్ లీగ్ ట్రోఫీలు, 8 బాలన్ డీ ఓర్ టైటిల్స్, ఆరు గోల్డెన్ బూట్ ట్రోఫీలు సైతం ఉన్నాయి.

మెస్సీ సాధించిన మొత్తం 45 టైటిల్స్ లో 39 క్లబ్ టైటిల్స్ ఉన్నాయి.

మొత్తం 1068 మ్యాచ్ లు ఆడి 1212 గోల్స్ సాధించాడు. 838 అంతర్జాతీయ గోల్స్ తో పాటు సహఆటగాళ్లు గోల్స్ చేయటంలో 374సార్లు సహకరించగలిగాడు.

మొత్తం మీద..తన కెరియర్ లో ఆఖరిసారి ప్రపంచకప్ ( 2022 ), కోపా అమెరికాకప్ ( 2024 )టోర్నీలలో నాయకత్వం వహించడం ద్వారా అర్జెంటీనాను విజేతగా నిలుపగలిగాడు.

First Published:  16 July 2024 12:07 PM GMT
Next Story