Telugu Global
Sports

లెజెండ్స్ ఫైనల్లో రాయుడు షో..విజేత భారత్!

ప్రపంచ లెజెండ్స్ టీ-20 క్రికెట్ టైటిల్ ను యువరాజ్ సింగ్ నాయకత్వంలోని భారత్ గెలుచుకొంది. ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాక్ పై విజయం సాధించింది.

లెజెండ్స్ ఫైనల్లో రాయుడు షో..విజేత భారత్!
X

ప్రపంచ లెజెండ్స్ టీ-20 క్రికెట్ టైటిల్ ను యువరాజ్ సింగ్ నాయకత్వంలోని భారత్ గెలుచుకొంది. ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాక్ పై విజయం సాధించింది.

అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకొన్న క్రికెటర్ల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న లెజెండ్స్ టీ-20 చాంపియన్స్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకొంది.

బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఆస్ట్ర్ర్లేలియా, భారత్, పాక్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు తలపడ్డాయి.

సెమీఫైనల్లో పవర్ ఫుల్ ఆస్ట్ర్రేలియాను అధిగమించిన భారత్ టైటిల్ పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను ఢీ కొట్టింది.

పాక్ కు భారత్ పగ్గాలు...

ఈ టైటిల్ పోరులో టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకొన్న పాకిస్థాన్ ను భారత బౌలర్లు సమర్థవంతంగా కట్టడి చేయగలిగారు. 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగుల స్కోరుకే పరిమితం చేయగలిగారు.

పాక్ బ్యాటర్లలో షోయబ్ మాలిక్ 36 బంతుల్లో 41 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. షోయబ్ మూడు సిక్సర్లతో ఈ స్కోరు సాధించాడు. సోహెయిల్ తన్వీర్ 9 బంతుల్లో 19 పరుగులు సాధించడంతో పాక్ జట్టు 150కి చేరుకోగలిగింది.

భారత బౌలర్లలో అనురీత్ సింగ్ 43 పరుగులిచ్చి 3 వికెట్లు, ఇర్ఫాన్ పఠాన్ 12 పరుగులిచ్చి 1 వికెట్ , పవన్ నేగీ, వినయ్ కుమార్ చెరో వికెట్ పడగొట్టారు.

రాయుడి ధూమ్ ధామ్ బ్యాటింగ్..

లెజండ్స్ ట్రోఫీ అందుకోవాలంటే 20 ఓవర్లలో 157 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన భారత్ 19.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికే గమ్యం చేరుకోగలిగింది. ఓపెనింగ్ జోడీ రాబిన్ ఊతప్పృ అంబటి రాయుడి జోడీ తమ జట్టుకు 34 పరుగులతో మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. అయితే స్కోరు 38 వద్ద ఊతప్పతో పాటు..వన్ డౌన్ సురేశ్ రైనా సైతం వెనుదిరగడంతో భారత్ చిక్కుల్లో పడింది.

ఆ తరువాత వచ్చిన గురుకీరత్ సింగ్ మాన్ తో జంటగా ఓపెనర్ రాయుడు ఎదురుదాడికి దిగాడు. భారీషాట్లతో స్కోరుబోర్డును పరుగులెత్తించాడు. 3వ వికెట్ కు 60 పరుగుల భాగస్వామ్యంతో విజయానికి మార్గం సుగమం చేశాడు.

రాయుడు కేవలం 30 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. ఆట 12వ ఓవర్లో రాయుడి వికెట్ పడగొట్టిన పాక్..ఆ వెంటనే గురుకీరత్ ( 33 బంతుల్లో 34 పరుగులు)ను సైతం అవుట్ చేయగలిగింది. 108 పరుగులకే 4 టాపార్డర్ వికెట్లు నష్టపోయిన తమజట్టును యూసుఫ్ పఠాన్ తో కలసి కెప్టెన్ యువరాజ్ సింగ్ ఆదుకొన్నాడు.

యూసుఫ్ పఠాన్ 16 బంతుల్లో 30 పరుగులు, యువరాజ్ 22 బంతుల్లో 15 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఈ ఇద్దరూ 6వ వికెట్ కు 5.4 ఓవర్లలో 42 పరుగుల భాగస్వామ్యంతో విజయం ఖాయం చేశారు.

చివరి 10 బంతుల్లో విజయానికి 7 పరుగులు సాధించాల్సిన భారత్..ఆఖరి ఓవర్ తొలిబంతిని ఇర్ఫాన్ పఠాన్ బౌండ్రీకి పంపడంతో భారత్ 5 వికెట్ల విజయంతో ప్రపంచ చాంపియన్ గా నిలువగలిగింది.

అంబటి రాయుడికి ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ అవార్డు దక్కింది.

First Published:  14 July 2024 6:30 AM GMT
Next Story