ధోనీసేనకు అంబటి రాయుడి బిర్యానీ పార్టీ!
హైదరాబాద్ వేదికగా ఐపీఎల్ మ్యాచ్ ఆడటానికి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యులకు అంబటి రాయుడు బిర్యానీపార్టీ ఇచ్చాడు.
హైదరాబాద్ వేదికగా ఐపీఎల్ మ్యాచ్ ఆడటానికి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యులకు అంబటి రాయుడు బిర్యానీపార్టీ ఇచ్చాడు.
హైదరాబాదీ బిర్యానీతో ఆతిథ్యమివ్వడంలో తెలుగుతేజం, మాజీ క్రికెటర్ అంబటి రాయుడి తరువాతే ఎవరైనా. 2008 నుంచి జరుగుతున్న ఐపీఎల్ లో ముందుగా ముంబై ఫ్రాంచైజీకి ఆడిన తెలుగు రాష్ట్ర్రాల స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు ఆ తరువాత చెన్నై ఫ్రాంచైజీకి ఆడుతూ గత సీజన్లోనే రిటైర్మెంట్ ప్రకటించాడు.
అయితే..హైదరాబాద్ వేదికగా జరిగే ఐపీఎల్ మ్యాచ్ ల్లో పాల్గొనటానికి వచ్చిన ముంబై లేదా చెన్నైజట్ల సభ్యులకు ప్రతి సీజన్లోనూ హైదరాబాదీ బిర్యానీతో విందు ఏర్పాటు చేయటం రాయుడికి ఓ అలవాటుగా మారింది.
హైదరాబాదీ బిర్యానీకి చెన్నై క్రికెటర్ల వహ్వా.....
హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా శుక్రవారం జరిగే లీగ్ పోరులో ఆతిథ్య సన్ రైజర్స్ తో తలపడటానికి రుతురాజ్ గయక్వాడ్ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరలి వచ్చింది.
గత సీజన్ వరకూ చెన్నైజట్టులో కీలక సభ్యుడిగా ఉంటూ వచ్చిన అంబటి రాయుడు తన మాజీ ఫ్రాంచైజీ ఆటగాళ్లకు కమ్మటి బిర్యానీతో అద్దిరిపోయే ఆతిథ్యమిచ్చాడు.
రాయుడి బిర్యానీ విందుకు రవీంద్ర జడేజాతో సహా జట్టులోని ఆటగాళ్లు, సహాయ సిబ్బంది సైతం హాజరయ్యారు.
ఓ ప్లేటు బిర్యానీని టేబుల్ మీద ఉంచి మరీ రాయుడితో కలసి జడేజా, దీపక్ చహార్, శివం దూబే దిగిన ఓ ఫోటోను అభిమానులతో పంచుకొన్నారు.
ప్రస్తుత సీజన్ లీగ్ లో ఇప్పటి వరకూ ఆడిన మొదటి నాలుగురౌండ్లలో చెన్నై 3 విజయాలు, ఓ ఓటమి రికార్డుతో ఉండగా..హైదరాబాద్ సన్ రైజర్స్ 3 రౌండ్ల మ్యాచ్ లు ఆడి రెండు పరాజయాలు, ఓ విజయంతో ఉంది.
హైదరాబాద్ వేదికగా జరిగే ఈ పోరు రెండుజట్లకూ కీలకంగా మారింది.
అరుదైన రికార్డుకు 6 పరుగుల దూరంలో ధోనీ...
భారత క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ వికెట్ కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనీ తన సుదీర్ఘ కెరియర్ లో ఐపీఎల్ ఆఖరి సీజన్ ఆడుతూ ఓ అరుదైన రికార్డుకు చేరువయ్యాడు.
ఐపీఎల్ గత 16 సీజన్లలో ఐదుసార్లు చెన్నైని విజేతగా నిలిపిన ధోనీ హైదరాబాద్ వేదికగా ఈరోజు జరిగే పోరులో మరో 6 పరుగులు చేయగలిగితే 5వేల పరుగుల మైలురాయిని చేరిన రెండో చెన్నై బ్యాటర్ గా చరిత్ర సృష్టించగలుగుతాడు.
ప్రస్తుత సీజన్ 3వరౌండ్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ పై 17 బంతుల్లో 31 పరుగుల స్కోరుతో నాటౌట్ గా నిలిచిన ధోనీ 2008 నుంచి 2024 సీజన్ మూడోరౌండ్ వరకూ 4994 పరుగులు సాధించగలిగాడు. 5వేల పరుగులకు కేవలం 6 పరుగుల దూరంలో మాత్రమే నిలిచాడు.
విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో ముగిసిన మ్యాచ్ వరకూ 215 ఇన్నింగ్స్ లో ధోనీ 39.01 సగటుతో 138.22 స్ట్ర్రయిక్ రేటుతో 23 హాఫ్ సెంచరీలు సాధించాడు.
సన్ రైజర్స్ తో జరిగే మ్యాచ్ లో ధోనీ మరో ఆరు పరుగులు చేయగలిగితే 5వేల పరుగుల రికార్డు సాధించిన చెన్నై రెండో బ్యాటర్ గా రికార్డుల్లో చేరగలుగుతాడు.
సురేశ్ రైనా 2008- 2021 మధ్యకాలంలో 5529 పరుగులతో 33.1 సగటుతో 38 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఆ తర్వాతి స్థానంలో ధోనీ కొనసాగుతు్న్నాడు.
ఇప్పటికే టీ-20 ఫార్మాట్లో వికెట్ కీపర్ గా 300 మందిని అవుట్ చేసిన రికార్డు ధోనీకి మాత్రమే ఉంది.