సూర్య చేతికి భారత టీ-20జట్టు పగ్గాలు వెనుక?
భారత టీ-20 జట్టు కెప్టెన్ గా హార్థిక్ పాండ్యాను కాదని సూర్యకుమార్ యాదవ్ ను ఎంపిక చేయడం పైన ఎడతెగని చర్చే జరుగుతోంది.
భారత టీ-20 జట్టు కెప్టెన్ గా హార్థిక్ పాండ్యాను కాదని సూర్యకుమార్ యాదవ్ ను ఎంపిక చేయడం పైన ఎడతెగని చర్చే జరుగుతోంది.
భారత క్రికెట్లో వివాదాలకు కొరతే ఉండదు. కెప్టెన్ లేదా జట్టు ఎంపిక జరిగిన సమయంలో అసంతృప్తులు, వివాదాలు లావాతీరులో వెదజల్లడం అత్యంత సహజమే. భారత్ లో క్రికెట్ కు ఉన్న క్రేజు అలాంటిది మరి.
టీ-20 ప్రపంచకప్ విజయంతో ప్రశాంత వాతావరణం నెలకొన్న భారత క్రికెట్లో టీ-20 జట్టు కెప్టెన్ గా హార్థిక్ పాండ్యాను కాదని సూర్యకుమార్ యాదవ్ ను ఎంపిక చేయడం కలకలమే రేపింది. రోహిత్ శర్మ వారసుడుగా ఉన్న వైస్ కెప్టెన్ హార్థిక్ పాండ్యాకు భారత టీ-20 జట్టు పగ్గాలు ఇవ్వకపోడం అన్యాయమంటూ పలువురు గగ్గోలు పెట్టారు.
అయితే..భారత సరికొత్త ప్రధాన శిక్షకుడు గౌతం గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తమదైన శైలిలో నాయకత్వ మార్పుపై సహేతుకమైన వివరణ ఇచ్చారు.
ద్రావిడ్ హయాంలోనే సూర్యావైపు మొగ్గు!
భారత టీ-20 జట్టు కెప్టెన్ గా ఎంపిక చేయటానికి చీఫ్ కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కారణమని అందరూ అనుకొంటుంటే...ఈ ఆలోచన మాజీ చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ది మాత్రమేనని భారత జట్టు మాజీ బౌలింగ్ కోచ్ పరస్ మాంబ్రే బయట పెట్టారు.
హార్థిక్ పాండ్యా తరచూ ఫిట్ నెస్ సమస్యలతో జట్టుకు దూరం కావడంతో టీ-20 జట్టు పగ్గాలు సూర్యకుమార్ కు అప్పజెబితే బాగుంటుందని గత కోచ్ రాహుల్ ద్రావిడ్ భావించారని, జట్టుకు నాయకుడుగా ఉండే ఆటగాడు అన్నిమ్యాచ్ లకూ పూర్తి ఫిట్ నెస్ తో అందుబాటులో ఉండాలని అందరూ కోరుకొంటారని, అయితే..హార్థిక్ పాండ్యా ప్రతిభావంతుడైన ఆల్ రౌండర్ గా ఉన్నా గాయాలు ఆవరోథంగా మారాయని, ఇప్పటికే టెస్టు క్రికెట్ నుంచి తప్పుకొని వన్డే, టీ-20 ఫార్మాట్లకే అందుబాటులో ఉన్నాడన్న విషయాన్ని పరస్ మాంబ్రే గుర్తు చేశారు. తరచూ గాయాలతో జట్టుకు దూరమయ్యే ఆటగాళ్లకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని ఎవ్వరూ కోరుకోరని చెప్పారు. మాజీ చీఫ్ కోచ్ ద్రావిడ్ ఆలోచన..సరికొత్త కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ల నేతృత్వంలో వాస్తవరూపం తీసుకొందని తెలిపారు.
సూర్యాకు అంతా అనుకూలమే....
టీ-20 ఫార్మాట్లోని ఇద్దరు అత్యుత్తమ బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ ఒకరని, గతంలో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్, ప్రస్తుతం రెండో ర్యాంక్ బ్యాటర్ గా ఉన్న సూర్యకు జట్టుకు ముందుండి విజయపథంలో నడిపించే సత్తా ఉందని మాంబ్రే తెలిపారు.
దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిక్ క్లాసెన్, సూర్యకుమార్ ప్రస్తుత టీ-20 ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్లుగా ఉన్నారు. పైగా భారతజట్టులోని దిగ్గజ బ్యాటర్లు రోహిత్, విరాట్ లతో పాటు నవతరం ఆటగాళ్లతో కూడా సూర్యకుమార్ కు చక్కటి సంబంధాలు ఉన్నాయని, అందరిని కలుపుకుపోతూ సరదాగా ఉంటే తత్వం సూర్యలో ఉందన్న విషయాన్ని తాము గుర్తించామని, ఓ జట్టుకు నాయకుడిగా ఉన్న ఆటగాడికి ఉండాల్సిన ప్రధాన లక్షణం అదేనని మాంబ్రే గుర్తు చేశారు.
జట్టు కష్టాలలో ఉన్నసమయంలో ఎంతో బాధ్యతాయుతంగా ఆడటంలో సూర్య తరువాతే ఎవరైనానని, తోటి ఆటగాళ్లలో జోష్ ను నింపి అత్యుత్తమంగా రాణించేలా చేయడంలో సూర్యా సిద్ధహస్తుడని మాంబ్రే ప్రశంసించారు.
పూర్తిస్థాయి కెప్టెన్ గా సూర్య కొత్తఇన్నింగ్స్...
ఇప్పటి వరకూ భారత టీ-20 జట్టుకు వెన్నెముకగా ఉన్న సూర్యకుమార్....రోహిత్ శర్మ రిటైర్మెంట్ తో ఇక పూర్తిస్థాయి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు. శ్రీలంకతో తీన్మార్ టీ-20 సిరీస్ ద్వారా జట్టు నాయకుడిగా సూర్య కొత్తజీవితం ప్రారంభించనున్నాడు.
31 సంవత్సరాల లేటు వయసులో భారత టీ-20 జట్టులో చోటు సంపాదించిన సూర్య ఆ తరువాత మరి వెనుదిరిగి చూసింది లేదు.దాదాపు రెండేళ్లపాటు ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ బ్యాటర్ గా నిలిచాడు.
ఇటీవలే ముగిసిన టీ-20 ప్రపంచకప్ ఫైనల్స్ వరకూ సూర్య 68 గేమ్ లు ఆడి 167. 74 స్ట్ర్రయిక్ రేటుతో 2340 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు శతకాలు సైతం ఉన్నాయి.
రాహుల్ ద్రావిడ్ భారతజట్టు ప్రధాన శిక్షకుడిగా ఉన్న సమయంలో సూర్య ఆడిన 31 మ్యాచ్ ల్లో 1164 పరుగులతో నంబర్ వన్ బ్యాటర్ గా నిలిచాడు. 46.56 సగటు, 187. 43 స్ట్ర్రయిక్ రేట్ సైతం నమోదు చేశాడు.
పల్లెకెలీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగే మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ తో కెప్టెన్ గా మిస్టర్ టీ-20 సూర్యకుమార్ జైత్రయాత్ర ప్రారంభించడానికి తహతహలాడుతున్నాడు.
కెప్టెన్ గా సూర్య 5-2 రికార్డు...
2022 సీజన్ నుంచి భారతజట్టు ఆడిన 79 టీ-20 మ్యాచ్ ల్లో పాండ్యా గాయాలతో 33 మ్యాచ్ లకు దూరమయ్యాడు. భారత టీ-20 జట్టుకు తాత్కాలిక కెప్టెన్ గా సూర్య 7 మ్యాచ్ ల్లో వ్యవహరించి 5 విజయాలు, 2 పరాజయాల రికార్డుతో ఉన్నాడు.